గురుకుల హాస్టల్‌లో విచారణ చేపడుతున్న అధికారులు
కుభీర్(ముథోల్) : మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్ సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో హాస్టల్ గదిలోనే కత్తిపోట్లకు గురయ్యాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణచాంద మండలం శ్యామన్‌పెల్లి గ్రామానికి చెందిన మమత–శ్రీనివాస్ దంపతుల కుమారుడు హర్షవర్ధన్. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కొడుకును కుభీర్‌లోని గురుకుల పాఠశాలలో వారం క్రితమే చేర్పించారు.
జూన్ 29న చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి కుటుంబీకులు శనివారం ఉదయం పాఠశాలలో చేర్పించారు. హాస్టల్ గదికి తలుపులు లేవు. అద్దె భవనం కావడంతో వసతులు అంతంత మాత్రమే ఉన్నాయి. హాస్టల్‌లో వాచ్‌మన్ గంగాధర్, ఉపాధ్యాయుడు జోహర్ మాత్రమే ఉన్నారు. విద్యార్థి కత్తి కత్తి అని కేకలు వేయగా తోటి విద్యార్థులు లేచి ఉపాధ్యాయుడు జోహార్‌కు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి చూడగా వీపు వెనుకభాగంలో ఐదు చోట్ల కత్తితో పొడిచినట్లు ఉంది.
కత్తి సైతం అతని శరీరంలోనే ఉండిపోయింది. వెంటనే కత్తిని తీసి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్ తీసుకెళ్లగా.. ప్రస్తుతం విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. గురుకుల పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భైంసా పట్టణ సీఐ శ్రీనివాస్, కుభీర్ ఎస్సై కె.రమేశ్ పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. రీజినల్ కో ఆర్డినేటర్ శోభారాణి పాఠశాలకు వచ్చి పరిశీలించారు. ఆ రాత్రి వసతిగృహంలో 254 మంది విద్యార్థులు ఉన్నారు.
దాడి ఎవరు చేశారు హాస్టల్ వసతిలోకి అగంతకులు ఎలా వచ్చారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. హాస్టల్, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే దాడి జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. కత్తిపోట్లు ఎలా జరిగాయి విద్యార్థికి ఎవరిపై శత్రుత్వం ఉంది తల్లిదండ్రులకు ఎవరైనా పగవారు ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. కూరగాయలు కోసే కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థి మాత్రం ఎవరు ప్రశ్నించినా ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దాడి చేసినట్లు అధికారులకు తెలియజేస్తున్నాడు.
ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులువిద్యార్థి హర్షవర్ధన్‌పై జరిగిన కత్తిపోట్ల విషయం దావానంలా వ్యాపించడంతో ఈ పాఠశాలలో చదివే వివిధ గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురికావడమే కాకుండా తమ పిల్లలు ఎలా ఉన్నారనే విషయం తెలుసుకోవడానికి చాలా మంది పాఠశాలకు వచ్చారు.
పిల్లలతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ భోజరాజు మాత్రం తాను ఆదివారం ట్రైనింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లానని ఇన్‌చార్జి బాధ్యతలు తెలుగు ఉపాధ్యాయుడు జోహార్‌కు అప్పగించినట్లు తెలిపారు. పాఠశాలను పరిశీలించారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment