కొడుకా సురేశా.. | Hostel Student Died in Bomb Blast Sangareddy | Sakshi
Sakshi News home page

కొడుకా సురేశా..

Published Sat, May 18 2019 7:37 AM | Last Updated on Sat, May 18 2019 7:37 AM

Hostel Student Died in Bomb Blast Sangareddy - Sakshi

హాస్టల్‌ వద్ద రోదిస్తున్న బంధువులు , సురేశ్‌(ఫైల్‌)

సిద్దిపేటరూరల్‌: కట్టుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందింది. చెట్టంత ఎదిగిన కొడుకు చదువుకొని ప్రయోజకుడిగా మారి అండగా నిలుస్తాడని ఆ తండ్రి కన్న కలలు ఒక్క క్షణంలో అడియాశలయ్యాయి. మరో రెండు రోజుల్లో సెమిస్టర్‌ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి పేలుళ్ల రాయి మృత్యు రూపంలో కబలించింది. కళ్లముందే చెట్టంత కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసిన ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు.  

స్థానికంగా ఒక ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న సురేశ్‌ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు వసతి గృహంపై అంతస్తులో చదువకుంటున్నాడు. ఇదే సమయంలో సమీపంలోనే ప్రాజెక్టు కెనాల్‌ పనులు కొనసాగుతున్నాయి. బండలను బ్లాస్టింగ్‌ చేసే క్రమంలో సిబ్బంది జిలెటెన్‌ స్టిక్కులను అమర్చి బండలను పేల్చివేశారు. పేలుళ్ల తాకిడికి ఒక రాయి ఎగిరి వచ్చి వసతి గృహంపైన ఆరుబయట చదువుకుంటున్న సురేశ్‌ తలపై పడింది. వెంటనే తీవ్ర రక్త స్రావంతో సురేశ్‌ అక్కడికక్కడే మృతి చెందడం, మరో విద్యార్థికి గాయాలయ్యాయి, విషయం తెలసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు రోదిస్తూ సంఘటన స్థలానికి చేరుకొని వసతిగృహం ముందు ఆందోళన చేపట్టారు.

చదువుకునేందుకు అంతస్తుపైకి..
ప్రత్యక్ష సాక్షుల, పోలీసుల కథనం ప్రకారం మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్ల సురేశ్‌(19) సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు. వెనకబడిన తరగతులకు చెందిన సురేశ్‌ సిద్దిపేట మండలం తోర్నాల శివారులోని బీసీ సంక్షేమ వసతి గృహంలొ ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈనెల 20 నుంచి సెమిస్టర్‌పరీక్షలు కొనసాగనున్న క్రమంలో సురేష్‌ సహచర విద్యార్థులతో కలిసి తోర్నాల వసతి గృహంలోనే ఉండి ప్రతీ రోజు పునశ్చరణ చేస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వసతి గృహంపై అంతస్తుపై చదువుకుందామని తన స్నేహితుడైన శ్రీనివాస్‌తో కలిసి వెళ్లాడు.

ఈ సమయంలో సమీపంలోనే ప్రాజెక్టు కెనాల్‌కు సంబంధించిన నిర్మాణంలో భాగంగా బండరాళ్లను పగల కొట్టేందుకు జిలెటిన్‌ స్టిక్‌లతో పేలుళ్లకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున పేలుళ్లకు బండరాళ్లు గాలిలోకి ఎగిరి చెల్లాచెదురుగా పడ్డాయి. అందులో ఒక పెద్దరాయి సమీపంలోని వసతి గృహంపైన చదువుకుంటున్న చల్మెడకు చెందిన సురేశ్‌ తలపై పడింది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి సురేశ్‌ అక్కడికక్కడే కిందపడి మృతి చెందాడు. సురేశ్‌పై పడిన రాయి పక్కనే చదువుకుంటున్న మరొక విద్యార్థి శ్రీనివాస్‌చేతిపై పడి తీవ్ర గాయం చేసింది. విషయాన్ని సహచర విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన, అడిషనల్‌ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్‌ బలగాలతో తోర్నాల వసతి గృహానికి చేరుకున్నారు. అప్పటికే తండ్రి, కుటుంబీకులు వసతి గృహం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని శాంతింప జేసే ప్రయత్నం చేసినప్పటికి కుటుంబీకులు ఆందోళనను విరమించలేరు. ఒకదశలో న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అందుబాటులో ఉండని వార్డెన్‌..
వసతి గృహానికి చెందిన వార్డెన్‌ సరైన క్రమంలో విధులు హాజరుకాలేడని, గతంలో కూడా ఇదే విధంగా సరిగ్గా విధులకు హాజరు అయ్యేవాడని విద్యార్థులు పేర్కొన్నారు. ఒక వేళ వార్డెన్‌ ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి జరిగేది ఉండేది కాదని విద్యార్థులు, మృతుని కుటుంబీకులు ఆవేద«న వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటాం
సిద్దిపేట నియోజకవర్గం తోర్నాల గ్రామ పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా జరిగిన సంఘటనపై మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్‌కాలువ పనులు కోసం రాళ్లను బ్లాస్టింగ్‌ చేసే సమయంలో మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. సంఘటన బాధకరమని జరిగిన సంఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన విద్యార్థి« కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వం ఆండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  – ఎమ్మెల్యే హరీశ్‌రావు

చల్మెడలో విషాద ఛాయలు
రామాయంపేట, నిజాంపేట(మెదక్‌): సిద్దిపేట జిల్లా తోర్నాలవద్ద శుక్రవారం బ్లాస్టింగ్‌లో నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్టె సురేశ్‌(19) అనే విద్యార్థి మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేశ్‌ మృతి విషయం  తెలుసకున్న గ్రామ సర్పంచ్‌ నర్సిహారెడ్డి, మృతుని కుటుంబసభ్యులు, అతని స్నేహితులు సంఘటనాస్థలికి తరలివెళ్లారు. మృతుడు సురేశ్‌ కుటుంబానికి ఆర్థికసాయం అందజేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement