సాక్షి, ఒంగోలు: అనారోగ్యం ఆమెను పట్టి పీడిస్తుంది. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకు కనీసం కట్టుకున్న ఇంటిలో కూడా ఉండకుండా వెళ్లగొట్టాడు. తప్పనిస్థితిలో బతుకుజీవుడా అనుకుంటూ కూతురి ఇంటివద్ద తలదాచుకుంటూ మాకు న్యాయం చేయండయ్యా అంటూ ఓ వృద్ధురాలు జిల్లా ఎస్పీని కలిసి స్పందనలో వేడుకుంది. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదుపై వన్‌టౌన్ జియో సోమేపల్లి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాది ఆసియా బేగం స్థానిక విజయనగర్ కాలనీ వాసి. ఆమె భర్త మత్స్యశాఖలో అటెండర్‌గా పనిచేసేవాడు. 2019 జూలై 31న రిటైరయ్యాడు. ఆయనకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రూపంలో డబ్బులు వచ్చాయి. వాటన్నింటిని బ్యాంకులో దాచుకోగా అతని కుమారుడు షేక్ జావెద్ కన్ను దానిపై పడింది.
తిరుపతి రావు అనే వ్యక్తి సహకారంతో కొడుకు జావెద్ తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏటీఎం కార్డు, బ్యాంకు చెక్కు ద్వారా ఏకంగా రూ. 25లక్షలు కాజేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు కొడుకుని ప్రశ్నించడంతో ఇళ్లు నాది అంటూ తల్లిదండ్రులను ఇద్దరిని ఇంటినుంచి వెళ్లగొట్టాడు. అంతే కాకుండా తిరుపతిరావు, గురు, కోమల్ అనే వారితో కలిసి మరలా వస్తే చంపేస్తామంటూ బెదిరించినట్లు ఆసియా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తాము చీమకుర్తిలోని కుమార్తె ఇంటివద్ద తలదాచుకున్నామని పేర్కొంది. వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిన కొడుకు నుంచి న్యాయం అందేలా చేయాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు కోసం దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment