విత్తనాలు స్వాహా చేసిన వారిని శిక్షించాలని కోరుతున్న రైతులు
సాక్షి, గజపతినగరం రూరల్ (విజయనగరం): మండలానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు వ్యవసాయాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి వరి విత్తనాలు తీసుకెళ్లిన సంఘటన చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారంపై పో లీసులకు ఫిర్యాదు చేసే యోచనలో వ్యవసాయా శాఖాధికారులున్నారు. విషయంలోకి వెళ్తే... మండల వ్యవసాయాధికారి టి. సంగీత ఈ నెల 20వ తేదీన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద కెంగువ, తుమ్మికాపల్లి, లోగిశ గ్రామాలకు చెందిన రైతులకు రాయితీ వరి విత్తనాలు పంపిణీ చేశారు. అయితే కెంగువ గ్రామానికి సంబంధించి 25 స్లిప్పులు ఎక్కువగా వచ్చాయి.
దీంతో ఏఓ సంగీతకు అనుమానం వచ్చి ఆయా స్లిప్పులను పరిశీలించగా.. 25 స్లిప్పులపై తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. వాస్తవానికి రైతుకు విత్తన బస్తా మంజూరు కావాలంటే వ్యవసాయాధికారి సంతకం చేసిన స్లిప్పు ఉండాలి. రైతులందరూ వారి పట్టాదారు పాస్ పుస్తకాలు అధికారులకు చూపిస్తే ఏఓ కార్యాలయం సిబ్బంది స్లిప్పు అందిస్తారు. ఈ స్లిప్పు పీఏసీఎస్ కార్యాలయంలో చూపించి రాయితీపై వరి విత్తన బస్తా పొందాల్సి ఉంటుంది. అయితే రైతులకు స్లిప్పులు పంపిణీ చేయడం కోసం వ్యవసాయ శాఖ కార్యాలయం సిబ్బంది స్టాంప్ వేసిన స్లిప్పులను సిద్ధంగా ఉంచుకున్నారు.
ఇదే అదునుగా ఏఓ కార్యాలయంలోని స్లిప్పులను కెంగువకు చెందిన టీడీపీ నాయకులు కొందరు స్వాహా చేసి.. వాటిపై ఏఓ సంతకం చేసి విత్తనాలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ విషయమై గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మజ్జి గోవింద, తదితరులను ఏఓ ప్రశ్నించారు. అయితే ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. అయితే ఏమైందో ఏమో కాని పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.
వాస్తవాలు తెలియాలి...
ఫోర్జరీ సంతకాలతో విత్తనాలు తీసుకెళ్లినట్లు ఆధారాలున్నా అధికారులు టీడీపీ నాయకులపై వ్యవసాయాధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కావడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఫోర్జరీ పత్రాలపై కెంగువ గ్రామానికి చెందిన మజ్జి రామునాయుడు, యిజ్జిరోతు పాపినాయుడు, దాసరి చిన్నంనా యుడు, మండల రామునాయుడు, మండల అప్పలనాయుడు, మిత్తిరెడ్డి సింహాచలం, మిత్తిరెడ్డి సూర్యనారాయణ, మిత్తిరెడ్డి బంగారునాయుడు, గుడివాడ రమణ, అలుగోలు పెంటయ్య, కొండల రాము, ఎండ బంగారప్పడు, ఎండ నారాయణ, మజ్జి సన్యాసియుడు, మజ్జి కామునాయుడు, కర్రి తవుడు, దాసరి సూరినాయుడు, మజ్జి సింహాచలం, మద్ది సత్యం, మద్ది పైడిరాజు, పల్లేడ సత్యమమ్మ, బూడి పాపినాయుడు, పెనుమజ్జి రాము, మజ్జి చిన్నంనాయుడు, తదితరులకు విత్తనాలు అందినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఫోర్జరీ చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తాను...
ఈ నెల 20వ తేదీన జరిగిన విత్తనాల పంపిణీలో 25 ప్యాకెట్లకు సంబంధించి ఫోర్జరీ సంతకంతో కూడిన స్లిప్పులు వచ్చినా తొందరపాటులో విత్తనాలు ఇచ్చేశాం. వెంటనే అక్రమాన్ని పసిగట్టి నిందితులపై ఫిర్యాదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విత్తనాల విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు.
– టి. సంగీత, మండల వ్యవసాయాధికారి, గజపతినగరం
ఎందుకు ఫిర్యాదు చేయలేదు..
ఫోర్జరీ సంతకాల విషయంలో అ టు టీడీపీ, ఇటు వ్యవసాయ శా ఖాధికారులపై అనుమానాలు న్నాయి. 25 బస్తాల విత్తనాలు బయటకు వెళ్లిపోయినా ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఫోర్జరీ సంతకాలతో విత్తనాలు వెళ్లిపోయిన విష యం ఏఓకు తెలుసు. అయినా ఎటువంటి చర్యలు తీ సుకోకపోవడం దారుణం.
– లెంక గణేష్, కెంగువ
విచారకరం..
అందరి రైతులకు అందాల్సిన విత్తనాలు కొంతమంది తప్పుడు సంతకాలతో తీసుకెళ్లిపోవడం విచారకరం. టీడీపీ నాయకులు స్లిప్పులు దొంగిలించి వాటిపై రైతుల పేరు రాసుకుని ఏఓ సంతకం ఫోర్జరీ చేసి విత్తనాలు తీసుకెళ్లిపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జరిగిన తతంగంపై విచారణ చేపట్టాలి.
– గుడివాడ తాతయ్యలు
Comments
Please login to add a commentAdd a comment