subsidy seeds
-
ఫోర్జరీ సంతకాలతో విత్తనాలు స్వాహా...
సాక్షి, గజపతినగరం రూరల్ (విజయనగరం): మండలానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు వ్యవసాయాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి వరి విత్తనాలు తీసుకెళ్లిన సంఘటన చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారంపై పో లీసులకు ఫిర్యాదు చేసే యోచనలో వ్యవసాయా శాఖాధికారులున్నారు. విషయంలోకి వెళ్తే... మండల వ్యవసాయాధికారి టి. సంగీత ఈ నెల 20వ తేదీన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద కెంగువ, తుమ్మికాపల్లి, లోగిశ గ్రామాలకు చెందిన రైతులకు రాయితీ వరి విత్తనాలు పంపిణీ చేశారు. అయితే కెంగువ గ్రామానికి సంబంధించి 25 స్లిప్పులు ఎక్కువగా వచ్చాయి. దీంతో ఏఓ సంగీతకు అనుమానం వచ్చి ఆయా స్లిప్పులను పరిశీలించగా.. 25 స్లిప్పులపై తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. వాస్తవానికి రైతుకు విత్తన బస్తా మంజూరు కావాలంటే వ్యవసాయాధికారి సంతకం చేసిన స్లిప్పు ఉండాలి. రైతులందరూ వారి పట్టాదారు పాస్ పుస్తకాలు అధికారులకు చూపిస్తే ఏఓ కార్యాలయం సిబ్బంది స్లిప్పు అందిస్తారు. ఈ స్లిప్పు పీఏసీఎస్ కార్యాలయంలో చూపించి రాయితీపై వరి విత్తన బస్తా పొందాల్సి ఉంటుంది. అయితే రైతులకు స్లిప్పులు పంపిణీ చేయడం కోసం వ్యవసాయ శాఖ కార్యాలయం సిబ్బంది స్టాంప్ వేసిన స్లిప్పులను సిద్ధంగా ఉంచుకున్నారు. ఇదే అదునుగా ఏఓ కార్యాలయంలోని స్లిప్పులను కెంగువకు చెందిన టీడీపీ నాయకులు కొందరు స్వాహా చేసి.. వాటిపై ఏఓ సంతకం చేసి విత్తనాలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ విషయమై గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మజ్జి గోవింద, తదితరులను ఏఓ ప్రశ్నించారు. అయితే ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. అయితే ఏమైందో ఏమో కాని పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. వాస్తవాలు తెలియాలి... ఫోర్జరీ సంతకాలతో విత్తనాలు తీసుకెళ్లినట్లు ఆధారాలున్నా అధికారులు టీడీపీ నాయకులపై వ్యవసాయాధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఫోర్జరీ పత్రాలపై కెంగువ గ్రామానికి చెందిన మజ్జి రామునాయుడు, యిజ్జిరోతు పాపినాయుడు, దాసరి చిన్నంనా యుడు, మండల రామునాయుడు, మండల అప్పలనాయుడు, మిత్తిరెడ్డి సింహాచలం, మిత్తిరెడ్డి సూర్యనారాయణ, మిత్తిరెడ్డి బంగారునాయుడు, గుడివాడ రమణ, అలుగోలు పెంటయ్య, కొండల రాము, ఎండ బంగారప్పడు, ఎండ నారాయణ, మజ్జి సన్యాసియుడు, మజ్జి కామునాయుడు, కర్రి తవుడు, దాసరి సూరినాయుడు, మజ్జి సింహాచలం, మద్ది సత్యం, మద్ది పైడిరాజు, పల్లేడ సత్యమమ్మ, బూడి పాపినాయుడు, పెనుమజ్జి రాము, మజ్జి చిన్నంనాయుడు, తదితరులకు విత్తనాలు అందినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఫోర్జరీ చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తాను... ఈ నెల 20వ తేదీన జరిగిన విత్తనాల పంపిణీలో 25 ప్యాకెట్లకు సంబంధించి ఫోర్జరీ సంతకంతో కూడిన స్లిప్పులు వచ్చినా తొందరపాటులో విత్తనాలు ఇచ్చేశాం. వెంటనే అక్రమాన్ని పసిగట్టి నిందితులపై ఫిర్యాదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విత్తనాల విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. – టి. సంగీత, మండల వ్యవసాయాధికారి, గజపతినగరం ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. ఫోర్జరీ సంతకాల విషయంలో అ టు టీడీపీ, ఇటు వ్యవసాయ శా ఖాధికారులపై అనుమానాలు న్నాయి. 25 బస్తాల విత్తనాలు బయటకు వెళ్లిపోయినా ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఫోర్జరీ సంతకాలతో విత్తనాలు వెళ్లిపోయిన విష యం ఏఓకు తెలుసు. అయినా ఎటువంటి చర్యలు తీ సుకోకపోవడం దారుణం. – లెంక గణేష్, కెంగువ విచారకరం.. అందరి రైతులకు అందాల్సిన విత్తనాలు కొంతమంది తప్పుడు సంతకాలతో తీసుకెళ్లిపోవడం విచారకరం. టీడీపీ నాయకులు స్లిప్పులు దొంగిలించి వాటిపై రైతుల పేరు రాసుకుని ఏఓ సంతకం ఫోర్జరీ చేసి విత్తనాలు తీసుకెళ్లిపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జరిగిన తతంగంపై విచారణ చేపట్టాలి. – గుడివాడ తాతయ్యలు -
రైతును వీడని ఆన్లైన్ కష్టాలు
సాక్షి, బలిజిపేట (విజయనగరం): గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను ఇంకా అవస్థలకు గురిచేస్తోంది. భూముల ఆన్లైన్ ప్రక్రియ సంవత్సరాలు గడిచినా నేటికీ పూర్తికాకపోవడంతో సబ్సిడీ విత్తనాలకు, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో సబ్సిడీ విత్తనాలు అందక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందంటున్నారు. గత ప్రభుత్వం ‘మీ ఇంటికి–మీ భూమి’ కార్యక్రమాన్ని పెట్టి ఊదర్లు కొట్టింది తప్పా కార్యాచరణ పూర్తిచేయలేదని రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రైతులకు అవసరమైనన్ని విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు పొందాలంటే భూమి ఆన్లైన్ జరగడం, ఆన్లైన్ అయిన భూమికి ఆధార్ అనుసంధానం అవడం తప్పనిసరి కావడంతో సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఖరీఫ్ సీజనులో సాగు విస్తీర్ణం 6వేల హెక్టార్లు. అవసరమైన విత్తనాలు 4,500 క్వింటాళ్లుగా అంచనా. ప్రభుత్వం, వ్యాపారులు కలిపి వీటిని అందించాల్సి ఉంది.నిబంధనల ప్రకారం ప్రభుత్వం సరఫరా చేయనున్న విత్తనాలు 35శాతం. కాగా మండలానికి వచ్చిన సబ్సిడీ విత్తనాలు 2,080.50 క్వింటాళ్లు. కాగా ప్రైవేటు వ్యాపారులు పెట్టిన ఇండెంట్ 2,450 క్వింటాళ్లు. కాగా వచ్చిన సబ్సిడీ విత్తనాలలో విక్రయించినవి 1,275క్వింటాళ్లు. మిగిలి ఉన్నవి 805 క్వింటాళ్లు. ఖరీఫ్‌కు సాగుచేయనున్న రైతులు 20వేల మంది కాగా భూములు ఆన్లైన్ అయినవారు 60శాతం మాత్రమే ఉన్నారు. భూములు ఆన్లైన్ అయినవారిలో ఆధార్ అనుసంధానం కాని రైతులు 30 శాతం వరకు ఉన్నారని తెలుస్తోంది. భూములు పూర్తిగా ఆన్లైన్ కాని రైతులు 40 శాతం వరకు ఉన్నారు. ఈలెక్కన ఆన్లైన్ అవక నష్టపోతున్న రైతులు చాలావరకు కనిపిస్తున్నారు. వీరు ప్రైవేటుగా విత్తనాలను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆన్లైన్ అంటూ గత ప్రభుత్వంలో చాలావరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక బ్యాంకు రుణాలు పొందేటపుడు ఆన్లైన్ జరగని, ఆధార్‌లింక్ అవని భూములకు సంబంధించి రుణాలు పొందే అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాలు సంభవించేటప్పుడు అసలైన రైతులు నష్టపోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి ఆన్లైన్ వ్యవస్థను సరిచేయాలని కోరుతున్నారు. ఆన్లైన్ కాకపోవడంతో విత్తనాలు అందడం లేదు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆన్లైన్ అన్నారు తప్పా భూములను ఆన్లైన్ చేయలేదు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. విత్తనాలు కావాలన్నా, ప్రభుత్వ లబ్ధి పొందాలన్నా ఆన్లైన్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి అవడంతో నష్టపోయాం. –వెంకటరమణ, నూకలవాడ, బలిజిపేట మండలం ఖరీఫ్‌కు అన్నీ కొత్తవిత్తనాలే ప్రస్తుత ఖరీఫ్‌కు అన్నీ కొత్త విత్తనాలే అవడంతో సాగుచేస్తున్న ప్రతిరైతూ విత్తనాలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సంవత్సరం రైతులు పండించిన పంటలో విత్తనాలను కడితే వచ్చే సీజనుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. – నాగేశ్వరరావు, ఏఓ, బలిజిపేట -
నిజమైన సం.. క్రాంతి!
సం..క్రాంతి.. పండుగ కాంతి.. మట్టి పిసికే రైతు ఒంటరిగా ఉంటే విఫణిలో బేలగా నిలబడాల్సి వస్తుంది.. వ్యాపారుల నిలువు దోపిడీకి గురవ్వాల్సి వస్తుంది.. విత్తనాలు, ఎరువులు వ్యాపా రులు చెప్పిన (చిల్లర) ధరకు కొనాల్సి వస్తుంది.. దళారులు చెప్పిన (టోకు) ధరకే పంటను తెగనమ్మాల్సి వస్తుంది...! అటువంటి రైతులే, చేయీ చేయీ కలిపితే మహత్తర శక్తిగా మారొచ్చని జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ రైతన్నలు రుజువు చేశారు. ఐకమత్యంతో కదులుతూ చరిత్రను తిరగరాస్తున్నారు. పెద్ద పండుగ వేళ లక్ష్మీపూర్ రైతన్నల ఆచరణ నుంచి మనమూ స్ఫూర్తి పొందుదాం.. ఒక్కతాటిపైకి వచ్చిన అన్నదాతలకు నిండు మనసుతో శుభాకాంక్షలు చెబుదాం.. లక్ష్మీపూర్ రైతులు రాజకీయాలకు అతీతంగా చేయి చేయి కలిపి.. సమష్టి శక్తిగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఓ చిన్న గ్రామం లక్ష్మీపూర్. తొలుత సహకార సంఘంగా ఏర్పడిన రైతులు అనతి కాలంలోనే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. లక్ష్మీపూర్ సొసైటీ 2016 డిసెంబర్లో రిజిస్టరైంది. సొసైటీ కన్నా మెరుగైన ప్రయోజనాల కోసం లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ (ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ)ని రైతులు నాబార్డ్ తోడ్పాటుతో సెప్టెంబర్ 2018లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీకి కేంద్ర వాణిజ్య శాఖ గుర్తింపు కూడా ఇటీవలే లభించింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను, రాయితీలను, రుణాలను అందుకోవడానికి.. తమ ఉత్పత్తులను దేశ విదేశాల్లో ఎక్కడైనా అమ్ముకోవడానికి లక్ష్మీపూర్ రైతులకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా అవకాశం ఏర్పడింది. సంఘ సభ్యులందరికీ ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఒకే చోట విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను తక్కువ ధరకే సంఘం రైతులకు అందుబాటులో ఉంచుతున్నది. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు సైతం నేరుగా సంఘానికి వస్తాయి. దీనివల్ల రైతులకు రవాణా భారం, ఖర్చులు తగ్గాయి. వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు.. ఆ గ్రామంలో 90 శాతం రైతు కుటుంబాలే. దాదాపు 8 వేల జనాభా. వ్యవసాయాన్ని కష్టంగా కాకుండా ఇష్టపడి చేస్తూ, ప్రతి పంటలోను తోటి గ్రామాల రైతుల కంటే అధిక దిగుబడులు సాధిస్తుంటారు. వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు, టమాటోలు తదితర కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. వేరుశెనగ, కంది పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ప్రతి భూమిలో కనీసం రెండు, మూడు పంటలు పండిస్తారు. ఎన్నికలప్పుడు ఎవరి పార్టీ వారిదే. ఎన్నికలయ్యాక మాత్రం అందరూ ఒక్కటిగా మెలుగుతున్నారు. ఒకప్పుడు అందరు రైతుల మాదిరిగానే ఆ రైతులు పంట అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడేవారు. అటువంటి పరిస్థితుల్లో రిటైర్డ్ ఎ.డి. అశోక్‌కుమార్ తోడై, రైతుల ఐకమత్యంతో ఏమేమి సాధించవచ్చో నూరిపోశారు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టుకొచ్చిందే లక్ష్షీ్మపూర్ రైతుల పరస్పర సహకార సంఘం. సభ్యత్వ రుసుము రూ. 3,500 తొలుత ఐదుగురు సభ్యులు సహకార సంఘానికి బీజం వేశారు. వారి ఆలోచనలు నచ్చిన గ్రామంలోని రైతులందరు సంఘంలో సభ్యులైనారు. కేవలం నెలలోపే, ఎవరి ప్రమేయం లేకుండా 312 మంది రైతులు సభ్యులుగా చేరడం రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా చెపుతుంటారు. రెండెకరాల రైతుకు అప్పట్లో సభ్యత్వ రుసుము రూ. 2,300 ఉండేది, ప్రస్తుతం రూ. 3,500కు పెరిగింది. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి, మూడు నెలలకొకసారి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. సంఘం చైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులను ప్రతి రెండేళ్ల కొకసారి ఎన్నుకుంటారు. వీరు సంఘం నిర్మాణం, పటిష్టత, వ్యాపారాలపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమవుతుంటారు. చైర్మన్ సహా ప్రతి సభ్యుడూ సంఘ నియమాలకు కట్టుబడి ఉంటామని సభ్యులందరి ముందు ప్రమాణం చేస్తారు. ప్రభుత్వ నిబంధనలతో పాటు సంఘానికి ప్రత్యేక నిబంధనలు రాసుకుని ముందుకు వెళ్తుండటంతో సొసైటీ విజయపథాన నడుస్తోంది. సర్వసభ్య సమావేశానికి రాకపోతే రూ. 500 జరిమానా, సంఘ డైరెక్టర్లు సమావేశానికి వెళ్లకపోతే రూ. 100 జరిమానా విధిస్తుంటారు. దీంతో, ప్రతి సమావేశానికి సభ్యులందరూ వచ్చి తమకు తోచిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో సంఘానికి ఆదాయం తెస్తూనే, సంఘ సభ్యుడైన రైతులకు లాభం ఉండేలా తొలుత ‘లక్ష్షీ్మపూర్ రైస్’ను తెర మీదకు తెచ్చి, సఫలీకృతులయ్యారు. ఆ కోవలోనే గ్రామ రైతులు పండించిన విత్తనాన్ని తోటి రైతులకు అందించాలనే ఆకాంక్షతో ‘లక్ష్మీపూర్ సీడ్’ను అమ్ముతున్నారు. ఇదే వరుసలో తాజాగా ‘లక్ష్మీపూర్ నువ్వుల’ను సైతం మార్కెట్లోకి తీసుకువచ్చారు. క్వింటాలుకు రూ. వెయ్యి అదనపు రాబడి గ్రామంలో ఎక్కువగా బీపీటీ, హెచ్ఎంటీ, జై శ్రీరాం వరి రకాలను సాగు చేస్తుంటారు. ఈ గ్రామస్తులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో, ఎకరాకు 28–30 క్వింటాళ్ల దిగుబడి తీస్తుంటారు. రైతులు ఎవరికివారే వరి ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, గ్రామంలోని మిల్లులో మర ఆడిస్తారు. అప్పుడు సంఘ ప్రతినిధి బృందం పరిశీలించి, బాగున్నాయనుకుంటేనే సంఘం తీసుకుని, గోదాములో నిల్వ చేస్తుంది. మార్కెట్ రేటు కంటే తక్కువకే నేరుగా వినియోగదారులకు అమ్ముతుంటారు. బియ్యం అమ్మగా వచ్చిన డబ్బులో కొంత సంఘానికి జమ చేసి, మిగతా డబ్బులను వెంటనే రైతులకు చెల్లిస్తుంటారు. దీని వల్ల గ్రామంలోని రైతులందరూ సన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చుతుండటంతో, ధాన్యాన్ని అమ్మిన దాని కంటే, బియ్యం అమ్మగా రైతులకు క్వింటాల్‌కు అదనంగా రూ. 500 నుంచి వెయ్యి వరకు లాభపడుతున్నారు. లక్ష్మిపూర్ సీడ్‌కు ఆదరణ గ్రామ రైతులు ప్రతి సీజన్లో లక్షల రూపాయలు పెట్టి రక రకాల కంపెనీల వరి విత్తనాన్ని తీసుకువచ్చి పంటే వేసేవారు. కానీ, విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల పంట దిగుబడులు వచ్చేవి కాదు. దీంతో, రైతులందరం కలిసి మన విత్తనాన్ని మనమే తయారు చేసుకోవడం కాదు, తోటి రైతులకు కూడా అందించాలని లక్ష్షీ్మపూర్ సీడ్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. పొలాస పరిశోధనా స్థానం నుంచి వరిలో కొత్త దొడ్డు రకం జెజిఎల్–24423ని దాదాపు 1000 ఎకరాల్లో సాగు చేసి, ఆ విత్తనాన్ని తోటి రైతులకు అమ్ముతున్నారు. వీటితో పాటు ఐఆర్–64, బతుకమ్మ, ఎంటియు–1010 రకాలను కూడా విక్రయిస్తున్నారు. విత్తన రైతులకు మార్కెట్ ధర కంటే రూ. 200 వరకు ఎక్కువ ధర వస్తున్నది. లక్ష్మీపూర్ రైతులు పసుపు పంట తర్వాత నువ్వులు వేస్తుంటారు. గ్రామంలో దాదాపు వెయ్యి క్వింటాళ్ల వరకు నువ్వులు పండుతాయి. నువ్వులు నాణ్యంగా ఉన్నప్పటికీ, దళారులు రంగ ప్రవేశం చేసి కిలో రూ 70–100 వరకు కొనుగోలు చేసేవారు. దీంతో, రైతులకు సరైన ఆదాయం రాక నష్టపోతుండేవారు. సీడ్స్, రైస్‌తో లక్ష్మీపూర్‌కు బ్రాండ్ ఇమేజ్ వచ్చినందున, నువ్వులను సైతం విక్రయిస్తున్నారు. ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. లక్ష్మీపూర్ రైతులు ఐకమత్యంతో చేస్తున్న ప్రతి పనికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తోడ్పాటునిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చొరవ వల్ల గ్రామంలో రూ. 4 కోట్లతో విత్తన శుద్ధి ప్లాంట్ ఏర్పాటైంది. సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న చైర్మన్ తిరుపతి రెడ్డి రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. 2017లో రూ. 11 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు, 2018లో రూ. 14 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు అమ్మారు. సంఘం ప్రారంభించిన రెండేళ్లలోనే దాదాపు రూ. 4 కోట్ల టర్నోవర్‌తో శభాష్ అనిపించుకుంటున్నారు. రైతులు పండించే కూరగాయల అమ్మకానికి లక్ష్మీపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంఘటితం కావడం వల్ల రైతులు అధికాదాయం పొందుతున్నారు. సరసమైన ధరకు నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు దొరుకుతుండటంతో వినియోగదారులూ సంతోషపడుతున్నారు. (వివరాలకు.. సంఘ ప్రతినిధులు మోహన్ రెడ్డి(95020 26069), రాంరెడ్డి(99484 52429) పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలి పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలన్నదే మా సంఘం ప్రధాన ఉద్దేశం. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటూనే సంఘాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. యువ రైతులను, ఖాళీగా ఉండే వెనుకటి పెద్ద మనుషులను సంఘ సలహాదారులు నియమించుకుంటున్నాం. రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను ఒక చోట అందిస్తూనే, ముఖ్యంగా రైతులు పండించిన ప్రతి పంటను ఎలా మార్కెటింగ్ చేయాలన్న దానిపైనే చర్చిస్తున్నాం. అదే మాదిరిగా వినియోగదారులకు సైతం తక్కువ ధరలో ఉత్పత్తులు అందేందుకు ప్రయత్నిస్తున్నాం. – పన్నాల తిరుపతి రెడ్డి, చైర్మన్(93915 28529), లక్ష్మీపూర్ రైతుల సహకార సంఘం, జగిత్యాల జిల్లా సంకల్ప బలమే సక్సెస్‌కు కారణం లక్ష్మీపూర్ సొసైటీ రైతు లోకానికి మార్గదర్శిగా మారింది. ఇక్కడి రైతులు రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తుండటంతో, చాలా గ్రామాల రైతులు సైతం లక్ష్మీపూర్ రైస్ మాదిరిగా ఆయా గ్రామాల పేర్లతో రైస్ విక్రయించడం జరుగుతుంది. ఇక్కడి రైతుల్లో సంకల్పం, పట్టుదల, విజయం సాధిస్తామన్న నమ్మకం మెండుగా ఉంది. అందువల్లే ప్రతి పనిలోనూ సక్సెస్ కాగలుగుతున్నారు. – అశోక్‌కుమార్ (85004 28578), జిల్లా వ్యవసాయ శాఖ సలహాదారు, జగిత్యాల ∙‘లక్ష్మీపూర్ నువ్వుల’ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న జిల్లా కలెక్టర్ శరత్ నువ్వులు విక్రయిస్తున్న సంఘ సభ్యులు – పన్నాల కమలాకర్, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
ఆన్లైన్లో సబ్సిడీ విత్తనాలు
బాన్సువాడ: సబ్సిడీ విత్తనాలను అక్రమార్కులు సరిహద్దులు దాటించి పక్క రాష్ట్రాలకు విక్రయించే విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. సబ్సిడీ విత్తనాలు అసలైన రైతులకే లభించేలా ఆన్లైన్ విధానాన్ని సర్కారు ప్రవేశపెట్టింది. గతేడాది వానాకాలం సీజన్లోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా, సత్ఫలితాలొచ్చాయి. దీంతో ప్రస్తుత ఖరీఫ్‌లోనూ ఆన్లైన్లోనే విత్తనాలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొన్న తర్వాతే రైతులకు సబ్సిడీ విత్తనాలను అందిస్తారు. రాయితీ విత్తనాలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అక్రమాలకు తెర పడనుంది. రాయితీ విత్తనాల్లో అక్రమాలు ప్రతి ఏడాది రాయితీ విత్తనాల పంపిణీలో అక్ర మాలు జరిగేవి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, మద్నూర్, జుక్కల్, పిట్లం మండలాలకు చెందిన కొందరు వ్యక్తులు సబ్సిడీ విత్తనాలను మహారాష్ట్ర, కర్ణాటకకు తరలించి, అక్కడ విక్రయించే వారు. శనగ విత్తనాలు క్వింటాళ్ల కొద్దీ తరలిపోయేవి. ఏ రైతు ఎన్ని విత్తనాలు తీసుకొంటున్నారనే సమాచారం ఉండేది కాదు. గతంలో కొన్ని విత్తనాలు కేంద్రాల కు రాకముందే నేరుగా తరలించి విక్రయించుకున్నారు. అందుబాటులో విత్తనాలు ఎన్ని ఉన్నా యో తెలియని పరిస్థితి ఉండేది. ఎన్ని రోజులు ఇస్తారో తెలిసేది కాదు. దీంతో రైతులు విత్తన కొనుగోలు కేంద్రాల్లో బారులు తీరి, విత్తనాలు ల భించక ఆందోళనలు చేసే వారు. కొందరు రైతుల పేరును ఉపయోగించుకొని సబ్సిడీ విత్తనాలు తీసుకొని మార్కెట్లో అమ్ముకొనేవారు. అధికారు లు ఇష్టం వచ్చిన వారికి కూపన్లు జారీ చేసే వారు. మార్కెట్లో సంబంధిత విత్తనాల ధరలు ఎక్కువ ఉండడం, రాయితీ విత్తనాలు తక్కువ ధరకు లభించడంతో వేల క్వింటాళ్ల విత్తనాలు పక్కదారి పట్టేవి. గతంలో విత్తనాలు పొందాలంటే మండల కేంద్రానికి వెళ్లి కూపన్లు పొందాల్సి వచ్చేది. కొన్ని గ్రామాల రైతులకు దూర భారం కావడంతో పాటు వెళ్లిన సమయంలో వ్యవసాయాధికారి లేని పక్షంలో కూపన్లు తీసుకోవడానికి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అక్రమాలకు చెక్ ఈ నేపథ్యంలో సబ్సిడీ విత్తనాల సరఫరాలో జరుగుతున్న అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. గతేడాది జీలుగ, జనుము విత్తనాలను ఆన్లైన్లో సరఫరా చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ప్రస్తుత వానాకాలంలో వీటితో పాటు వరి, సోయా విత్తనాలను కూడా ఆన్లైన్లోనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్లో రాయితీ విత్తనాలు పొందేందుకు వీలుగా క్లస్టర్ స్థాయిలో కూపన్లు పొందేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో పంటలు సాగు చేస్తారని అంచనా. ఈ మేరకు రాయితీపై విత్తనాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఇతర పంటల సాగు విస్తీర్ణం మేరకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేయనున్నారు. రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి కాగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సీజన్ నుంచి మండల వ్యవసాయాధికారి ద్వారా క్లస్టర్ స్థాయిలోనే కూపన్లు జారీ చేయనున్నారు. ఆన్లైన్ ఇలా.. రాయితీ విత్తనాలు అవసరమైన రైతులు వ్యవసాయాధికారి వద్దకు వెళ్లి తమ పట్టాదారు పాస్‌పుస్తకం ఖాతా సంఖ్య నమోదు చేయించాలి. ఆ రైతుకు సంబంధించిన భూమి వివరాలు, సర్వే నంబర్, గతేడాది వేసిన పంట తదితర వివరాలు వెల్లడవుతాయి. రైతుకు ఉన్న భూమికి తగ్గట్టుగా అవసరమైన విత్తన సంచులకు సంబంధించిన కూపన్ నంబర్ రైతు సెల్ నంబర్‌కు చేరుతుంది. ఆ సంఖ్యను విత్తన కేంద్రంలో చూపించి రాయితీ పోనూ మిగతా డబ్బులు చెల్లిస్తే విత్తనాలు ఇస్తారు. అయితే, ఏ రోజు కూపన్ తీసుకొంటారో అదే రోజు రైతులు విత్తనాలను తీసుకోవాలి. మరుసటి రోజు ఆ కూపన్ చెల్లదు. మళ్లీ విత్తనాలు పొందాలంటే కూపన్లు పొందాల్సి ఉంటుంది. ఏ రోజు ఎంత మంది విత్తనాలు పొందారు? ఇంకా ఎంత నిల్వ ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వ్యవసాయ అధికారికి సమాచారం అందుతుంది. విత్తన కేంద్రాల్లో ఎన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయనే సమాచారం అధికారుల వద్ద ఉంటుంది. రైతులు రెండు, మూడు సార్లు విత్తనాలు కొనుగోలు చేయడానికి వీలుండదు. -
ప్రత్యామ్నాయ పంటలకు రాయితీతో విత్తనాలు
అనంతపురం సిటీ: సకాలంలో కురవని వర్షాలతో రైతులు దిగాలు పడ్డారని, ఇక ప్రత్నామ్నాయ పంటలే దిక్కని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు రాయితీతో విత్తనాలు అందించేందుకు రూ.85.5 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. స్థానిక జాతీయ రహదారులు, భవనాల శాఖ అథితి గృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక జిల్లాలో వేరుశనగ విత్తనం విత్తేందుకు గడువు లేదని, ఖరీఫ్‌లో కూడా తుంగభద్ర ఎగువ కాలువలో నీళ్లు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా ఉలవలు 50 వేల క్వింటాళ్లు, అలసందలు 19 వేలు, కొర్ర 2500లు, పచ్చజొన్న 4500 క్వింటాళ్ల విత్తనం జిల్లాకు అవసరం ఉందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. స్పందించిన ముఖ్య మంత్రి అందుకు సరేనని చెప్పారు. రేపటి నుంచి ఈ విత్తనాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని రకాల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. బయోమెట్రిక్ ద్వారా విత్తన పంపిణీ చేపట్టి ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావులేకుండా చూస్తామన్నారు. ఇక చంద్రన్న బీమా పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సహజ మరణం చెందిన కుటుంబాలకు పెద్దకర్మ రోజుకే రూ.30 వేలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశామన్నారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీకే ప్రజలు పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన అనంతరం తెలుగు దేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులకు నంద్యాల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, ఇదే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
వేరుశెనగకు డిమాండ్ కొంతే
– ఇప్పటి వరకు పంపిణీ 13065 క్వింటాళ్లు మాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగకు డిమాండ్ కనిపించడం లేదు. జిల్లాలో మే 30 నుంచి వేరుశెనగ పంపిణీ చేస్తున్నప్పటికి ఇంతవరకు పంపిణీ అయింది కేవలం 13065 క్వింటాళ్లు మాత్రమే. ఖరీప్ సీజన్ ఈ నెల1వ తేదీతో ప్రారంభమైనా ఇంత వరకు చినుకు జాడ లేకపోవడంతో రైతులు సబ్సిడీ వేరుశనగ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఖరీప్ సీజన్‌కు సంబంధించి రైతులకు సబ్సిడీ వేరుశెనగకు నిర్ణయించిన ధర రూ.7700. ప్రభుత్వం దళారీలకు లబ్ధి చేకూర్చేందుకే ధరను ఇలా నిర్ణయించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయ శాఖ కిలో వేరుశెనగ ధర రూ.77 నిర్ణయించి సబ్సిడీ 40 శాతం ఇచ్చింది. కిలోకు సబ్సిడీ రూ.30.80 ఉండగా రైతులు రూ.46.20 చెల్లించాల్సి ఉంది. మార్కెట్లో వేరుశెనగ క్వింటాం ధర రూ.4000 నుంచి రూ.4500 వరకు ఉంది. మార్కెట్ ధర కంటే సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగ ధర ఎక్కువగా ఉండటంతో రైతులు ముందుకు రావడం లేదు. మార్క్‌ఫెడ్, ఏపీ సీడ్స్, ఆయిల్ఫెడ్లు వేరుశెనగను సరఫరా చేస్తున్నాయి. ఈ ఏజెన్సీలు దళారీలపై ఆధారపడ్డాయి. దీంతో వేరుశెనగ నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యత లేకపోవడం, ధర ఎక్కువగా ఉండటం, అందులోను వర్షాలు లేకపోవడంతో సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగకు డిమాండ్ లేకుండా పోయింది. జిల్లాకు వ్యవసాయశాఖ 60,600 క్వింటాళ్లు కేటాయించింది. అయితే 10 వేల క్వింటాళ్లు బఫర్‌లో ఉంచి మిగిలిన 50,600 క్వింటాళ్లను మండలాలకు కేటాయించారు. కర్నూలు, ఆలూరు, మంత్రాలయం సబ్ డివిజన్లలో వేరుశెనగకు డిమాండ్ కనిపించడం లేదు. కాగా పత్తికొండ, ఎమ్మిగనూరుల్లో వేరుశనగ పంపిణీ శనివారం నుంచి మొదలైంది. -
అన్నదాత ఆక్రోశం
- విత్తన టోకన్ల నిలిపివేతపై కనెర్ర – ప్రధాన రహదారిలో గంటపాటు నిరసన – రైతులకు మద్దతు పలికిన ïసీపీఐ, సీపీఎం నాయకులు పత్తికొండ: సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. శనివారం స్థానికి వ్వవసాయ మార్కెట్ యార్డు అవరణలో విత్తన టోకన్లు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో ఉదయం ఏడు గంటలకే రైతులు పత్తికొండకు చేరుకున్నారు. మ«ధ్యాహ్నం 12.30 గంటలైన కౌంటర్ల వద్దకు వ్యవసాయ అధికారులు రాక పోవడంతో వారు ఆగ్రహించారు. మార్కెట్ యార్డు వద్ద ప్రదాన రహదారిలో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ నబీరసూల్, మండల నాయకులు కారన్న, సీపీఎం డివిజన్ కన్వీనర్ వీరశేఖర్, సీఐటీయూ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు చక్రాళ్ల వెంకటేశ్వరరెడ్డి, దస్తగిరి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. వెంటనే విత్తన టోకన్లు ఇవ్వాలని, డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ వస్తున్నారని టోకన్లు ఇవ్వడం నిలిపేయడం దారుణమని మండిపడ్డారు. సమాచారం తెలుసుకున్న పత్తికొండ, తుగ్గలి ఎస్ఐలు, పోలీసులు మార్కెట్‌యార్డుకు చేరుకొని రైతులను నచ్చజెప్పేందుకు యత్నించారు. సబ్సిడీ విత్తనాలకు టోకన్ల ఇస్తామని అధికారులు చెప్పడంతోనే తాము రామలింగాయపల్లి, చెన్నంపల్లి, ఎర్రగుడి, గిరిజన తండాల నుంచి చార్జీలు పెట్టుకొని వచ్చామని వాపోయారు. పత్తికొండలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పర్యటన ముగిసిన వెంటనే టోకన్లను ఇప్పిస్తామని పత్తికొండ ఎస్ఐ మధుసూదన్ హమీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. -
రైతన్న కన్నెర్ర
పత్తికొండ టౌన్: సబ్సిడీ వేరుశనగ కావాలంటే తప్పనిసరిగా విత్తనశుద్ధి మందు కూడా కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు నిబంధనలు విధించడంతో రైతన్నలు రోడ్డెక్కారు. కాలం చెల్లిన మందులు తీసుకొని ఏం చేయాలని ఆగ్రహించారు. పత్తికొండలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన కౌంటర్లలో తుగ్గలి మండల రైతులకు బయోమెట్రిక్ ద్వారా విత్తనపర్మిట్లు జారీ చేస్తున్నారు. వీటిని తీసుకునేందుకు ఆ మండలం నుంచి అధికసంఖ్యలో రైతులు మార్కెట్‌యార్డుకు చేరుకున్నారు. ఒక్కో రైతుకు పాసుపుస్తకానికి 4 ప్యాకెట్లు(30కిలోలు) వేరుశనగకాయలు ఇస్తున్నారు. దీంతో పాటు రూ.200 విలువచేసే నాలుగు ప్యాకెట్ల విత్తనశుద్ధి మందు కొనుగోలు చేయాలని వ్యవసాయ సిబ్బంది మెలిక పెట్టారు. ఆ పాతస్టాకు మందు తమకు వద్దని వేరుశనగకాయలు మాత్రమే పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు వినకపోవడంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్‌యార్డు బయట ఉన్న పత్తికొండ–గుత్తి ప్రధాన రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకుని తుగ్గలి మండల వ్యవసాయాధికారి మునెమ్మ అక్కడకు రాగా రైతులు, ఏపీ రైతుసంఘం నాయకులు సమస్య వివరించారు. వెంటనే ఏఓ ఫోన్లో జేడీఏ ఉమామహేశ్వరమ్మతో మాట్లాడగా ఒక విత్తనశుద్ధి ప్యాకెట్ కొనుగోలు చేసినా వేరుశనగ ఇవ్వాలని ఆమె సూచించారు. ఇందుకు సమ్మతించిన రైతులు ఆందోళన విరమించి వేరుశనగ విత్తన పర్మిట్లు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే రైతులు ఆందోళనతో గంటపాటు రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఆందోళన కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం జిల్లా సహాయకార్యదర్శి రాజాసాహెబ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురుదాస్, మండల కార్యదర్శి కారన్న, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి సుల్తాన్ పాల్గొనా్నరు. -
నాలుగో రోజు 19,977 క్వింటాళ్ల పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లావ్యాప్తంగా నాలుగో రోజు శనివారం 17,201 మంది రైతులకు 19,977 క్వింటాళ్లు విత్తన వేరుశనగ పంపిణీ చేసినట్లు ఇన్చార్జి జేడీఏ డి.జయచంద్ర, ఏడీఏ (పీపీ) జి.విద్యావతి తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో 44,359 మంది రైతులకు 51,585 క్వింటాళ్లు అందజేశామన్నారు. ఆదివారం సెలవు కావడంతో విత్తన పంపిణీ ఉండదన్నారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం యథావిధిగా పంపిణీ కొనసాగిస్తామని వారు తెలిపారు. -
దోచుకో..దాచుకో!
- విత్తనం సొమ్ము తినికూర్చున్న తెలుగు‘తమ్ముళ్లు’ – రూ.1.19 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి – వసూళ్ల కోసం తిరుగుతున్న ఏపీ సీడ్స్ అధికారులు వేరుశనగ సొమ్ము ఏపీ సీడ్స్‌కు చెల్లించకుండా బకాయిపడిన వివరాలిలా... మండలం రావాల్సిన మొత్తం మండలం రావాల్సిన మొత్తం కొత్తచెరువు 37.96 లక్షలు నల్లమాడ 01.99 లక్షలు ఓడీ చెరువు 00.94 వేలు శెట్టూరు 31.85 లక్షలు బ్రహ్మసముద్రం 20.76 లక్షలు కళ్యాణదుర్గం 01.74 లక్షలు మడకశిర 03.51 లక్షలు రొళ్ల 00.89 వేలు గుడిబండ 00.25 వేలు పరిగి 03.22 లక్షలు పెనుకొండ 00.88 వేలు ఉరవకొండ 14.78 లక్షలు అనంతపురం అగ్రికల్చర్ : తాము నీతి నిజాయితీకి మారుపేరు అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక వైపు గొప్పలు చెబుతుండగా... మరో వైపు దొరికింది దోచుకో.. దాచుకో అనే రీతిలో తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి జమ చేయాల్సిన ప్రజాధనాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచర వర్గాలు యథేచ్చగా స్వాహా చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకు నిదర్శనం ఏటా ఖరీఫ్‌లో రైతులకు రాయితీతో పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ సొమ్మును పలువురు తెలుగు తమ్ముళ్లు దిగమింగినట్లు తెలుస్తోంది. 2016 ఖరీఫ్ విత్తన వేరుశనగ పంపిణీకి సంబంధించి రూ.1.19 కోట్లు వసూలు చేసుకుని జేబులు నింపుకుని దర్జాగా తిరుగుతున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతల నుంచి సొమ్మును రాబట్టుకునేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) అధికారులు నెలల తరబడి తంటాలు పడుతున్నా పైసా కూడా చెల్లించకుండా దొరల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఏపీ సీడ్స్ ద్వారా 2016లో 1.51 లక్షల క్వింటాళ్లు 31 మండలాల్లో పంపిణీ చేశారు. అధికార పార్టీకి చెందిన నేతల సిఫారసుతో ప్రధాన అనుచరులు మండలాల్లో పంపిణీ చేసే బాధ్యతలు దక్కించకున్నారు. పంపిణీ చేసిన తర్వాత వారి కమీషన్ తీసుకుని మిగతా మొత్తం ఏపీ సీడ్స్ ద్వారా ప్రభుత్వానికి జమ చేయాల్సివుంది. కానీ కొందరు నేతలు కమీషన్‌తో పాటు ప్రభుత్వానికి కట్టాల్సిన మొత్తం సొమ్మును దిగమింగి కూర్చోవడంతో ఏపీ సీడ్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో ప్రజాప్రతినిధులు, పంపిణీ చేసిన నేతల ఇళ్లు, కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నా వసూలు కావడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా కళ్యాణదుర్గం, పుట్టపర్తి నియోజక వర్గాల పరిధిలో పెద్ద మొత్తంలో రాయితీ సొమ్ము పేరుకుపోయింది. తామేమీ తక్కువ కాదంటున్న వ్యవసాయశాఖ అధికారులు ఓ వైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తుండగా తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా వ్యవసాయశాఖ డివిజన్, మండల స్థాయి అధికారులు కూడా వివిధ పథకాల కింద పంపిణీ చేసిన విత్తనాలకు సంబంధించి రాయితీ సొమ్మును ప్రభుత్వానికి చెల్లించకుండా జేబుల్లో పెట్టుకుని స్వంతానికి వాడుకుంటున్నారు. అందులో 2016–17 సంవత్సరానికి సంబంధించి 13 మండలాల అధికారులు రూ.15.87 లక్షలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు ఏపీ సీడ్స్ అధికారులు అష్టకష్టాలు పడుతున్నట్లు సమాచారం. మడకశిర డివిజన్ ఏడీ నుంచి రూ.4.73 లక్షలు రాయితీ సొమ్ము రావాల్సి ఉందిది. అలాగే రాప్తాడు ఏఓ రూ.59 వేలు, గాండ్లపెంట ఏఓ రూ.25 వేలు, ఓడీ చెరువు ఏఓ రూ.21 వేలు, నల్లచెరువు ఏఓ రూ.81 వేలు, గుంతకల్లు ఏఓ రూ.12 వేలు, మడకశిర ఏఓ రూ.5 వేలు, గుత్తి ఏఓ రూ.3,500, తనకల్లు ఏఓ రూ.3.21 లక్షలు, తలుపుల ఏఓ రూ.1.37 లక్షలు, విడపనకల్ ఏఓ రూ.3,600, అమడగూరు ఏఓ రూ.1.03 లక్షలు, రొళ్ల ఏఓ రూ.3.39 లక్షలు చెల్లించకుండా నెలల తరబడి జాప్యం చేస్తున్నట్లు సమాచారం. -
నల్ల బజారుకు విత్తనాలు
- బయోమెట్రిక్ అంతా ఉత్తిదే - అధికారుల సహకారంతోనే బ్లాక్‌మార్కెట్‌కు ఖాజీపేట: రైతులకు సబ్సిడీ ద్వారా అందాల్సిన విత్తనాలు అధికారుల సహకారంతో దర్జాగా నల్ల బజారుకు తరలివెళ్లాయి. ఈ విషయం సాక్షి నిఘాలో బట్టబయలైంది. సబ్సిడీ విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నా అధికారులు తమకేమి తెలియదన్నట్లు వ్యవహరించడం గమనార్హం. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో రైతులకు సబ్సిడీతో శనగ విత్తనాలను శుక్రవారం అధికారికంగా పంపిణీ చేపట్టారు. మొదటి రోజే ప్రభుత్వ లక్ష్యానికి దళారులు తూట్లు పొడిచారు. ఖాజీపేట మండలంలో రబీ సీజన్ కు 200 క్వింటాళ్ల శనగ విత్తనాలు మంజూరయ్యయి. శుక్రవాం ఏటూరు గ్రామంలో విత్తన పంపిణీ చేపట్టారు. అధికారుల ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఒక్క రోజు 112 మందికి 25 కేజీల శనగల బ్యాగులు 400 వరకు పంపిణీ చేశారు. ఇందులో సుమారు 150కి పైగా నల్లబజారుకు తరలివెళ్లాయి. అధికారుల మాటలు నీటిమూటలు అక్రమాలను అరికట్టేందుకే బయోమెట్రిక్ విధానం తీసుకు వచ్చామని అధికారులు ప్రకటించారు. ఖాజీపేట మండలంలో బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ చేపడుతున్నాం అని చెప్పారు. కానీ కేవలం మాటలకే పరిమితమయ్యాయి. అధికారికంగానే దర్జాగా విత్తన బస్తాలను ట్రాక్టర్లో కమలాపురాని తరలించారు. వాస్తవానికి విత్తనాలు కావాల్సిన రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ఆధార్‌కార్డు, పాసుపుస్తకం నమోదు చేసుకోవాలి. వేలి ముద్రలు వేయించుకుని స్లిప్‌లు తీసుకుని మన గ్రోమోర్ దగ్గరకు వెళ్లాలి.అప్పుడే విత్తనాలు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మన గ్రోమోర్‌కు చెందిన వారు రైతులకు సంభందించిన అన్ని బస్తాలను ఒకే ట్రాక్టర్లో వేశారు. ఆ ట్రాక్టర్ ఏటూరు గ్రామంలోకి వెళ్లి్లంది అక్కడ సుమారు 40నుంచి 50 బస్తాలు దించి మిగిలిన వాటిని కమలాపురానికి తీసుకెళ్లారు.విత్తనాలు దర్జాగా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అధికారులు కూడా తమ వంతుగా సహకరించినట్లు తెలుస్తోంది. సమస్య నుంచి బయట పడేందుకు ఏర్పాట్లు సబ్సిడీ విత్తనాలు నల్లబజారుకు తరలి వెళ్లిన విషయం బయట పడడంతో అప్పడే అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాగోలా ఈవిషం నుంచి బయట పడాలని తమకు కావాల్సిన విధంగా ఇటు ఉన్నతాధికారులను అటు రాజకీయంగా ఉన్న పలుకు బడిన ఉపయోగించి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లు రైతులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
పైసా లేదు..పంట ఎలా?
కరువు సాయంలో చేతులెత్తేసిన ప్రభుత్వం పెండింగ్‌లో రెండేళ్ల ఇన్పుట్ సబ్సిడీ ఈ ఏడాది సాయంపై స్పష్టత కరువు అనంతపురం సెంట్రల్ : ఖరీఫ్ దగ్గర పడుతోంది. రైతు చేతిలో చిల్లిగవ్వ లేదు. సాయం చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. పంట ఏ విధంగా పెట్టాలో తెలియక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే రెండేళ్ల పంట నష్టపరిహారం పెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది కూడా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను రైతులు చవిచూశారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు పాలకులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది. మంగళవారం జరిగే అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ ఎప్పటి నుంచి చేపడతారో, సబ్సిడీ ఎంత మేర ప్రకటిస్తారో అధికారులకే తెలియడం లేదు. ఈ నెల 15 నుంచి పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఆదశగా ఏర్పాట్లు జరగడం లేదు. దీంతో సకాలంలో విత్తనం అందుతుందా, అదనులో పంట సాగు చేసుకుంటామా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. మూడేళ్లుగా జిల్లా రైతులు వరుస నష్టాలను చవి చూస్తున్నారు. నష్టపోయిన పంటకు పరిహారం న్యాయబద్ధంగా అందాల్సి ఉండగా, పాలకుల నిర్లక్ష్యం కారణంగా మరుగున పడిపోతోంది. 2013-14 ఖరీఫ్ సీజన్లో పంటనష్టపోయిన రైతులకు రూ. 643 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2014-15లో రూ. 559 కోట్లు మంజూరైందని చెబుతున్నా.. పంపిణీ కార్యక్రమం పూర్తి ప్రహసనంగా మారింది. గతేడాది(2015-16) కూడా తీవ్ర వర్షభావంతో రైతన్నలు పంట నష్టపోయారు. నష్టాన్ని అధికారులు అంచనా వేయకపోవడంతో ఇన్పుట్ సబ్సిడీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు 15వేల హెక్టార్లలో ఉద్యానపంటలు ఎండిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉన్న ఉద్యాన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. గతంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఈ సారి అది కూడా లేదు. -
టీడీపీ నేత ఇంట్లో భారీగా సబ్సిడీ విత్తనాలు
అనంతపురం: అనంతపురం జిల్లా గోరంట్ల మండలం శెట్టిచిన్నంపల్లెలో ఓ టీడీపీ నాయకుడి ఇంటి నుంచి పెద్ద మొత్తంలో సబ్సిడీ విత్తనాలను వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నాయుకుడు, వ్యాపారి కూడా అయిన శివారెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 411 బస్తాల (ఒక్కోటీ 30 కిలోలు) సబ్సిడీ వెరుశనగ విత్తనాలు వెలుగు చూశాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు. -
ఖరీఫ్‌కు విత్తనాలు సిద్ధం
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సీజన్‌కు రాయితీ విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం పలు రకాల విత్తనాలను రాయితీపై ఇచ్చేందుకు సిద్ధం చేసింది. ప్రస్తుతం జొన్న 10 క్వింటాళ్లు, సజ్జ 90, మొక్కజొన్న 50, పెసర 200, మినుము 150, కంది 1500, నువ్వులు 110, ఆముదం 50, వేరుశనగ 3000, జీలుగ 700, పిల్లిపెసర 800, జనుము 300 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ ఏడీఏ రత్న ప్రసాద్ ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. వేరుశనగ విత్తనాల ధర క్వింటా రూ.1,500, కంది రూ.1,950, మినుము రూ.2,450, పెసర క్వింటా రూ.2,925, కొర్రల ధర క్వింటా రూ.1,300తోపాటు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జొన్న, సజ్జ, ఆముదం విత్తనాలు క్వింటా ధర రూ.2,500 చొప్పున రాయితీపై ఇస్తామన్నారు. అంతేగాక వరి ఆరు వేల క్వింటాళ్లు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 3,38,000 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. గతేడాది 3,35,898 హెక్టర్లలో వరితో పాటు వేరుశనగ, మిరప, సజ్జల తదితర పంటలు సాగు చేశారు. ఈ ఏడాది కంది, పత్తి, మినుము అధికంగా సాగవుతుందని అంచనా. దర్శి, త్రిపురాంతకం, తర్లుపాడు ప్రాంతాల్లో కంది ఎక్కువగా సాగు చేస్తారు. కందితో పాటు సజ్జ, జొన్న, ఆముదం పంటలు అధికంగా సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరి విత్తనాలకు రాయితీ లేదని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో కొంత చల్లబడడం, అరకొరగా కురిసిన వర్షాలతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. సమృద్ధి వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అనుకోకుండా వర్షాలు కురిస్తే భూమిని సారవంతం చేసుకోవడానికి జీలుగా, పిల్లిపెసర, జనుము విత్తనాలు సగం రాయితీపై ఇవ్వనుంది. 694 ఎరువుల నమూనాల సేకరణ లక్ష్యం ఈ ఏడాది 694 ఎరువుల నమూనాల సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు నత్రజని 16, భాస్వరం 160, డీఏపీ 96, పొటాష్ 31, కాంప్లెక్స్ ఎరువులు 150, మిక్చర్స్ 90, మరోరెండు రకాల ఎరువుల నమూనాలను సేకరించినట్లు ఏడీఏ జి. రత్నప్రసాద్ తెలిపారు. అదే విధంగా భూసార పరీక్షలకు ఇప్పటి వరకు 4,400 మట్టి నమూనాలు ల్యాబ్‌లకు చేరాయని తెలిపారు. 1000కిపైగా పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు. -
సబ్సిడీ తగ్గించిన వ్యవసాయ శాఖ
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగుకు విత్తనాలను సమకూర్చుకోవడం రైతన్నకు భారమవుతోంది. సబ్సిడీ విత్తనాల ధరను మార్కెట్ కంటే ఎక్కువకు నిర్ణయించడం పట్ల వ్యవసాయ శాఖపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా వేరుశనగ విషయంలో రైతులు ముందుగా పూర్తి ధర చెల్లించాలనే షరతు విధించడం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాకు 40 వేల క్వింటాళ్ల వేరుశనగ.. 12 క్వింటాళ్ల మొక్కజొన్న.. 500 క్వింటాళ్ల మినుములు.. 100 క్వింటాళ్ల పెసలు.. 50 క్వింటాళ్ల సద్దలు.. 50 క్వింటాళ్ల ఆముదం.. 4,500 క్వింటాళ్ల దయంచ.. 300 క్వింటాళ్ల పిల్లి పెసరను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు మంజూరయ్యాయి. గతంలో వేరుశనగకు 30 శాతం సబ్సిడీ ఉండగా.. మిగిలిన విత్తనాలకు 50 శాతం సబ్సిడీ ఇచ్చేవారు. జిల్లాలో కందులు, మినుములు, పెసలు సాగు భారీగా ఉంటోంది. ఈ విత్తనాలకు ఇచ్చే సబ్సిడీని విపత్తు ప్రస్తుతం 33 శాతానికి తగ్గించడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంది ధర కిలో రూ.59గా ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కంటే ఈసారి కంది విత్తనాలు కిలోపై ధర రూపాయి పెరిగింది. అయితే 50 శాతం ఉన్న సబ్సిడీని 33.05 శాతానికి తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మినుములు కిలో ధర గత ఏడాది రూ.58 కాగా.. రూ.74కు పెరిగింది. దీనిపై సబ్సిడీని మాత్రం 50 నుంచి 33.11 శాతానికి తగ్గించడం గమనార్హం. పెసర ధరను కూడా అడ్డగోలుగా పెంచేశారు. గత ఏడాది కిలో పెసర విత్తనాల ధర రూ.68 కాగా.. ఈసారి ధర ఏకంగా రూ.88కు చేరింది. ఇక వేరుశనగ విషయానికొస్తే.. ఖరీఫ్ సీజన్లో దాదాపు 1.50 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. జిల్లాకు కె6 రకం వేరుశనగ 40 వేల క్వింటాళ్లు మంజూరైంది. మార్కెట్లో నాణ్యమైన వేరుశనగ క్వింటాలు ధర రూ.4 వేలలోపే. గత ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ పండించిన రైతుల్లో 80 శాతం మంది రూ.3 వేల లోపు ధరకే అమ్ముకున్నారు. సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగకు మాత్రం పూర్తి ధర రూ.4,600గా నిర్ణయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో సబ్సిడీ 32.61 శాతానికే పరిమితం చేశారు. సబ్సిడీ పోను వేరుశనగ క్వింటాలుకు రూ.3,100 చెల్లించాల్సి ఉంది. సబ్సిడీ పోను మిగిలిన ధరకే మార్కెట్లో వేరుశనగ లభిస్తుండటం గమనార్హం. వేరుశనగకు పూర్తి ధర చెల్లించాల్సిందే... సబ్సిడీపై వేరుశనగ తీసుకోవాలనుకునే రైతులు ముందుగా పూర్తి ధర అంటే కిలోకు రూ.46 చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. గత రబీలో పప్పుశనగకు కూడా ముందు పూర్తి ధర చెల్లించాలని ప్రకటించడంతో విత్తనాలు తీసుకునేందుకు రైతు లు వెనుకంజ వేశారు. ఖరీఫ్‌కు సంబంధించి వేరుశనగకు ముందు పూర్తి ధర చెల్లించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొనుగోలుకు ఆసక్తి చూపకపోవచ్చని భావిస్తున్నారు. అప్పుడే నకిలీలు: జిల్లాలో నకిలీ విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీటీ పత్తిలో నకిలీల బెడద గత ఏడాదికంటే ఈసారి రెట్టింపయింది. సాధారణ పత్తి విత్తనాలను ప్రాసెసింగ్ చేసి కలర్ అద్ది ప్యాకింగ్ చేసి బీటీ పేరు 450 గ్రాముల ప్యాకెట్‌ను రూ.830 ప్రకారం అమ్ముతున్నారు. సి.బెళగల్, గూడూరు, కోడుమూరు, దేవనకొండ, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, హాలహర్వి తదితర మండలాల్లోని గ్రామాల్లో నకిలీ బీటీ విత్తనాల వ్యాపారం జోరుగా జరుగుతోంది. జిల్లాకు 8.30 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు మంజూరైనా సంబంధిత కంపెనీలు వీటిని సిద్ధం చేయని పరిస్థితి. ఈ కారణంగా రైతులు నకిలీ విత్తనాల బారిన పడుతున్నారు. నకిలీ విత్తనాలపై నియంత్రణ లేకపోవడం వల్ల ఇప్పటికే కోట్లాది రూపాయల విలువ చేసే నకిలీ బీటీ విత్తనాలు రైతులకు అంటగట్టినట్లు తెలుస్తోంది. -
పెరిగిన విత్తనాల ధరలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది రైతన్న పరిస్థితి. వరుస ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలను చవిచూసి సాగులో చతికిలపడ్డ అన్నదాతలు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఏటేటా సాగు భారం పెరగడం అన్నదాతను కలవర పరుస్తోంది. ప్రభుత్వం తాజాగా విత్తనాల సబ్సిడీలో భారీగా కోత పెట్టింది. దీంతో సాగుకు సిద్ధపడుతున్న రైతులకు పెరిగిన విత్తనాల ధర పెనుభారమైంది. ధర పెంచారు.. సబ్సిడీలో కోత పెట్టారు జిల్లాలో పత్తి తర్వాత అధికంగా పండించేది సోయాబీన్. సోయా విత్తనాల ధరను ప్రభుత్వం అమాంతంగా పెంచేసింది. పెంచిన ధర ప్రకారం రైతన్నపై క్వింటాల్‌కు రూ.2,010 అదనపు భారం పడనుంది. జిల్లాకు ఈ ఏడాది 90వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ లెక్కన రైతులపై సుమారు రూ.18.09 కోట్ల అదనపు భారం పడనుంది. సబ్సిడీలోనూ 2.57శాతం కోత పెట్టారు. కంది విత్తనాల ధర పెంచడమే కాకుండా సబ్సిడీని సుమారు 17శాతం తగ్గించారు. క్వింటాల్ ధరపై రైతులకు రూ.1,050 అదనపు భారం పడనుంది. జిల్లాకు 400 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరం కాగా, ఈ లెక్కన రైతులపై రూ.4.20 లక్షల భారం పడనుంది. పెసర విత్తనాలపై రూ.9.90 లక్షలు, మినుములపై రూ.2.05లక్షల భారం అదనంగా పడనుంది. మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు విత్తనాలపై క్వింటాల్‌కు రూ.500 సబ్సిడీ ప్రకటించారు. వరి విత్తనాల ధరలు ఈ ఖరీఫ్‌కుగాను పెరిగాయి. ఎంటీయూ 1010, ఎంటీయూ 1001 రకాల ధరలు గతేడాది క్వింటాల్‌కు రూ.2,250 ఉండగా ఈసారి రూ.2,500 వరకు పెరిగాయి. ఎంటీయూ 7029, ఎంటీయూ 1061 ధరలు గతేడాది రూ.2,300 ఉండగా ఈసారి 2,550 వరకు పెరిగాయి. ఆర్జీఎల్ రూ.2,600 నుంచి రూ.2,650కి పెరగగా, బీపీటీ రూ.2,800 నుంచి రూ.2,750కి తగ్గింది. సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకే. విత్తనాలు కొనాలంటే రైతులు మొదట పూర్తి ధర చెల్లించాలి. ఆ తర్వాత పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. సబ్సిడీ డబ్బులు రైతు ఖాతాలో ఆ తర్వాత జమ అవుతాయి. ఉదాహరణకు.. సోయాబీన్ విత్తనాలు కొనాలంటే మొదట రైతు రూ.7,800 చెల్లించాలి. ఆ తర్వాత రైతు ఖాతాలో ఇందుకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు రూ.2,574 జమ అవుతాయి. -
‘సబ్సిడీ’ వట్టిమాటే!
గజ్వేల్, న్యూస్‌లైన్: విత్తనాలకు ‘సబ్సిడీ’ వర్తింపు వట్టిమాటగానే మిగిలింది. జిల్లాలో అత్యధికంగా సాగుచేసే వరి, మొక్కజొన్న పంటలపై ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. జాతీయ ఆహార భద్రతా పథకం జాబితా నుంచి జిల్లాను తొలగించడంవల్ల వరి విత్తనాలపై సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం.. మొక్కజొన్నకు సైతం అంతంత మాత్రమే రాయితీ ఇస్తోంది. 33 నుంచి 50 శాతం వరకు సబ్సిడీ అందజేస్తున్నామని గొప్పగా చెబుతున్నా వాస్తవ పరిస్థితిల్లో 20 శాతానికి మించడంలేదు. ప్రధానంగా మొక్కజొన్న విత్తనాల పంపిణీ పరిస్థితి అధ్వానంగా మారింది. ఇందులో కొన్ని రకాలు సబ్సిడీపై, ప్రైవేట్ దుకాణాల్లో ఒకే ధరకు లభ్యం కావడం విస్మయం కలిగిస్తోంది. కంపెనీల ప్రయోజనాల కోసమే ఈ తంతు కొనసాగుతుందనే విషయం బయట పడుతోంది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సుమారు 5 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇందులో భాగంగానే వరి సుమారు లక్ష హెక్టార్లు, మొక్కజొన్న 1.50 లక్షల హెక్టార్లు, మిగతా విస్తీర్ణంలో పత్తి, కూరగాయలు, ఇతర పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఇందుకోసం అన్ని విత్తనాలు కలుపుకుని వేల క్వింటాళ్ల సబ్సిడీపై పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. వరి విస్తారంగా సాగవుతుందనే సాకుతో జాతీయ భద్రతా పథకం జాబితా నుంచి జిల్లాను తొలగించారు. ఫలితంగా ఈసారి వరి విత్తనాలపై సబ్సిడీ నిలిచిపోయింది. ఈ విషయాన్ని ఈ నెల 15న ‘సబ్సిడీ విత్తుకు మంగళం.. వరి రైతుకు షాక్’ శీర్షికన ‘సాక్షి’ బయటపెట్టిన సంగతి తెలిసిందే. మిగతా విత్తనాలకు సంబంధించి 33 నుండి 50 శాతం సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. 20 శాతం కూడా సబ్సిడీ వర్తించడం లేదు. మొక్కజొన్న విత్తనాల పరిస్థితీ అంతే.. మొక్కజొన్నకు సంబంధించి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తనాలు, బహిరంగ మార్కెట్లో దొరుకుతున్న విత్తనాల్లో కొన్ని రకాలు ఒకే ధర కలిగి ఉండడం గమనార్హం. ఈ విత్తనాలను కిలోకు రూ.25 సబ్సిడీపై అందజేస్తున్నారు. పలు రకాల కంపెనీల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ఇందులో సగం వరకు రకాలు బహిరంగ మార్కెట్లో ఒకే ధరకు లభిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. సబ్సిడీపై, బయట మార్కెట్లో ఒకే ధరపై విక్రయించడం వల్ల తమకు ఒరిగేదేమిటని రైతులు మండిపడుతున్నారు. మరోపక్క ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బ్రాండెడ్ రకాల సబ్సిడీ తీరు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్రాండెడ్ రకాలకు చెందిన విత్తన ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్ పరిమాణం 5 కిలోలు) ఎమ్మార్పీ రూ.750 నుంచి రూ.650 వరకు ఉన్నాయి. గతేడాది ఇలా... గతేడాది ఖరీఫ్‌లో గజ్వేల్ పట్టణంలోని కావేరి ఎక్కా విత్తనాల పంపిణీకి సంబంధించి జ్యోతి, శివ ట్రేడర్లు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు. సబ్సిడీపై అందజేసే విత్తనాలను రైతులు పర్మిట్లు పొంది ఈ రెండు దుకాణాల్లోనే రూ.525కి పొందాలి. కానీ స్థానికంగా ఉన్న దుకాణదారులు పర్మిట్లతో ప్రమేయం లేకుండా ఈ విత్తనాలను ప్యాకెట్‌కు కేవలం రూ.520 లోపే విక్రయిస్తున్నట్లు గజ్వేల్ వ్యవసాయాధికారి ప్రవీణ్‌కుమార్ గుర్తించారు. ఈ మేరకు ఆయా దుకాణాల్లో శనివారం తనిఖీలు నిర్వహించి తక్కువ ధరకు విక్రయిస్తున్న 180 ప్యాకెట్లను సీజ్ చేశారు. సదరు దుకాణాల్లో ఆ ప్యాకెట్ల అమ్మకాలను నిలిపివేశారు. ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ ధరకు కంటే తక్కువగా ఎందుకు పంపిణీ చేయాల్సి వచ్చింది? వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. దీనిని బట్టి చూస్తే తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడానికి ప్రభుత్వానికి అధిక ధరలను కోడ్ చేసి ఇస్తున్న కంపెనీలు.. బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి ధరను తగ్గించి ఇవ్వడంలో మాయజాలాన్ని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమైంది. ఈసారి కూడా అదే రకమైన మాయాజాలానికి తెరలేవడం గమనార్హం. -
విత్తన గుబులు
సాక్షి, కడప/అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : అన్నదాతల్లో విత్తన గుబులు మొదలైంది. సీజన్ ముంచుకొస్తున్నా విత్తన సేకరణ చేయడంలో ఆయిల్‌ఫెడ్, ఏపీ సీడ్స్, హాకా విత్తన సంస్థలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. దీనికితోడు విత్తన ధరలు కూడా పెరిగాయి. ఇది చాలదన్నట్లు పూర్తి ధర చెల్లిస్తేనే సబ్సిడీపై విత్తనాలు ఇస్తామని, ఆ తర్వాత సబ్సిడీని రైతు ఖాతాల్లో జమ చేస్తామని గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లో ఈనెల 25వ తేది నుంచి విత్తనాలు పంపిణీ చేసేందుకు వ్యవసాయాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం వేరుశనగ విత్తనాలను క్వింటాలు రూ. 4600కు సరఫరా చేస్తామని చెబుతోంది. దీంతో పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీ 33 శాతం అంటే రూ. 1518 రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ఏడాది వేరుశనగవిత్తనాలు క్వింటా ధర రూ.3600 ఉండటం గమనార్హం. ఈ ఏడాది రైతుల వద్ద వేరుశనగ విత్తన కాయలు క్వింటా రూ. 3300కు లభ్యమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పోలిస్తే అన్నదాతకు స్వల్పంగా కేవలం రూ. 218 మాత్రమే లబ్ధి చేకూరనుంది. మొత్తం మీద రైతులు విత్తన కాయలు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. విత్తన కేటాయింపులు ఇలా! జిల్లాలో వేరుశనగ విత్తనాలకు సంబంధించి కే-6 రకం 20 వేల క్వింటాళ్లు, కే-6/కే9 రకాలు 2400 క్వింటాళ్లు, నారాయణి రకం 19 వేల క్వింటాళ్లు, ధరణి 600 క్వింటాళ్లు మొత్తం 42 వేల క్వింటాళ్లు జిల్లాకు కేటాయించారు. గత ఏడాది ఈ సమయానికి విత్తన సేకరణ చేపట్టి మండల కేంద్రాలకు చేర్చే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాది సీజన్ ముంచుకొస్తున్నా ఇప్పటివరకు విత్తన సంస్థలు సేకరణ చేయడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతోపాటు జీలుగలు 6 వేల క్వింటాళ్లు కాగా, కిలో ధర రూ. 30.80, జనుములు వెయ్యి క్వింటాళ్లు కాగా, కిలో ధర రూ. 41.71, పిల్లిపెసర 600 క్వింటాళ్లు కాగా, కిలో ధర రూ. 57.95గా నిర్ణయించారు. ఈ విత్తనాల ధరలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీని రైతు ఖాతాల్లో జమచేయనుంది. మొత్తం మీద అన్నదాతల స్థితి అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో విత్తనాల పూర్తి ధర చెల్లింపులు రైతులకు భారంగా పరిణమించనుంది. దీనికితోడు విత్తన సేకరణ ఇప్పటికీ జరగకపోవడం, ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో విత్తనం వేస్తేనే పంట వస్తుందనేది రైతుల్లో ఉన్న నమ్మకం. సకాలంలో విత్తనాలు అందుతాయో, లేదోనన్న బెంగ రైతులను పట్టుకుంది. ప్రభుత్వం స్పందించి సకాలంలో విత్తనాలు, విత్తన కాయలు సరఫరాచేసి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సోయా నైఆయా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఖరీఫ్ సీజను ముంచుకొస్తున్నా సబ్సిడీ సోయా విత్తనాల జాడ లేకపోవడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. విత్తుకునే సమయం దగ్గర పడుతున్నా.. విత్తన నిల్వలు జిల్లాకు చేరకపోవడంతో ఈసారి విత్తన పంపిణీలో జాప్యం జరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతులు ఏటా జూన్ మొదటి వారం నుంచి సోయాను విత్తుకుంటారు. ఈసారి వర్షాలు సకాలంలోనే కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అభిప్రాయ పడుతోంది. దీంతో రైతులు విత్తుకునే సమయానికి ఈ విత్తనాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది కూడా విత్తన సరఫరాలో వ్యవసాయ శాఖ విఫలమైంది. సకాలంలో విత్తనాలు అందక సోయా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. సబ్సిడీ విత్తనాలు దొరకక ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలు వెచ్చిం చి విత్తనాలను కొనుగోలు చేశారు. అధికారులు చొరవ చూపని పక్షంలో రైతులు ఈసారి కూడా ఇబ్బందులే ఎదుర్కొనే అవకాశాలున్నాయి. వి త్తనాలు వేసుకునే అదును దాటిపోయే ప్రమాదముందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటం కారణంగా విత్తన సరఫరాకు టెండర్లు పిలవడం, ధర నిర్ణయంలో జాప్యం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 90 వేల క్వింటాళ్ల కేటాయింపులు జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజనులో సుమారు 3.5 లక్షల హెక్టార్లలో సోయా పంట సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా. గతేడాది పత్తిని వేసుకున్న రైతులు సరైన ధర లభించక తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పత్తిని విక్రయిస్తే సాగు ఖర్చులు కూడా రాలేవు. దిగుబడి పడిపోవడం వంటి కారణాలతో పత్తిని సాగు చేసిన రైతులు ఈసారి సోయా వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. దీంతో సోయా విస్తీర్ణం పెరగనుంది. ఈసారి ఖరీఫ్ సీజనుకు 1.05లక్షల క్విం టాళ్ల సోయా విత్తనాలు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం ది. అయితే ఈ ప్రతిపాదనలను తగ్గించి కేవలం 90వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు కేటాయిం చారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని అకోల, నాందేడ్ నుంచి ఈ సోయా విత్తనాలు వస్తుం టాయి. కాగా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా ఈ జిల్లాకు చేరలేదు. రైతులు ముందుగా పూర్తి ధర చెల్లించాలి.. 33 శాతం సబ్సిడీపై సోయా విత్తనాలను సరఫరా చేస్తున్నారు. రైతులు మాత్రం ముందుగా పూర్తి ధర చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయా లి. ఆ విత్తనాలను విత్తుకున్నట్లు వ్యవసాయ శా ఖ అధికారులు ధ్రువీకరించాక సబ్సిడీ మొత్తా న్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ధర క్వింటాలుకు రూ.7,800లుగా నిర్ణయించారు. రెండు ఎకరాలున్న రైతులకు ఒక బస్తా (30కిలోలు) వి త్తనాలు సబ్సిడీపై ఇస్తారు. రెండు నుంచి ఐదు ఎకరాలున్న రైతులకు రెండు బస్తాలు, ఐదెకరా ల పైన భూమి ఉన్న రైతులకు మూడు బస్తాల చొప్పున ఈ విత్తనాలను పంపిణీ చేస్తారు. కా గా, జిల్లాలో విత్తన పంపిణీ బాధ్యతలను నాలు గు నోడల్ ఏజెన్సీలకు అప్పగించారు. నిర్మల్, భైంసా వ్యవసాయ డివిజన్లలో ఏపీ సీడ్స్ ద్వారా పంపిణీ చేస్తారు. అలాగే ఉట్నూర్, కాగజ్‌నగర్ డివిజన్లలో హాకా ద్వారా, ఆదిలాబాద్, ఖానాపూర్ డివిజన్లలో ఆయిల్‌ఫెడ్ ద్వారా పంపిణీ చేస్తారు. ఇచ్చోడ, చెన్నూరు డివిజన్లలో పంపిణీ బాధ్యతలను మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. ఇబ్బంది రాకుండా చూస్తాం.. సోయా విత్తనాలు రైతులకు సకాలంలో అందే లా చర్యలు తీసుకుంటున్నాము. ఈనెల 25వ తేదీ వరకు 50శాతం విత్తనాలు జిల్లాకు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. విత్తనాలు జిల్లాకు చేరిన వెంటనే పంపిణీకి చర్యలు చేపడతాము. ఎన్నికల కోడ్ కారణంగా కొంత జాప్యం జరిగింది. -
రైతుల విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు..!
దోమ, న్యూస్‌లైన్: ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంపిణీ చేయడానికి అందజేసిన శనగ విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్న సంఘటన మండల పరిధిలోని ఊట్పల్లిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా సేంద్రియ ఎరువులతో నాణ్యమైన పంటఉత్పత్తులను సాధించేందుకు వీలుగా ప్రభుత్వం రైతులకు వేరుశగన, శనగ, మొక్కజొన్న తదితర విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఆయా పంటలను సాగు చేయడంలో సలహాలు, సూచనలు అందించడం, రైతులు పండించిన ఉత్పత్తులకు తగిన మార్కెట్ సదుపాయం కలిగించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద రబీ సీజన్లో శనగ పంట సాగుకు అధికారులు మండల పరిధిలోని ఊట్పల్లి, బొంపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో 75 మంది చొప్పున రైతులను ఎంపిక చేశారు. వారికి పంపిణీ చేసేందుకు ఒక్కో గ్రామానికి 75 బస్తాల చొప్పున మొత్తం 150 బస్తాలను రెండు నెలల క్రితం చేరవేశారు. అయితే కొంతకాలం పాటు వాటిని అలాగే ఉంచి తర్వాత అమ్ముకుంటే ఎవరికీ తెలియదని భావించారు ఆదర్శరైతులు. ఈ క్రమంలో ఊట్పల్లిలోని ఓ ఇంట్లో దాచి ఉంచిన శనగ విత్తనాలను గురువారం రాత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎప్పుడూ లేనిది ఊళ్లోకి కార్లు, ఆటోలు హడావుడిగా రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి విషయం ఆరా తీశారు. ఓ గదిలో 32 శనగబస్తాలు దాచి ఉంచారని తెలిసింది. మొత్తం 75 బస్తాలకుగాను 32 మాత్రమే ఉండడంతో స్థానిక ఆదర్శరైతును నిలదీశారు. అతను తనకేం తెలి యదని బుకాయించాడు. గ్రామ సర్పంచ్ పద్మమ్మ తదితరులు గదికి తాళం వేసి విషయాన్ని జేడీఏ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు పరిగి డివిజన్ వ్యవసాయాధికారి నాగేష్ కుమార్, మండల వ్యవసాయాధికారి రేణుకా చక్రవర్తిని శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. రెండు నెలల క్రితం పంపిణీ చే యాల్సిన విత్తనాలను రబీ సీజన్ ముగుస్తున్నా ఎందుకు పంపిణీ చేయలేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఏడీఏతో పాటు మండల వ్యవసాయాధికారి పొం తనలేని సమాధానాలు చెప్పడం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఆదర్శరైతులు కుమ్మక్కై విత్తనాలను అమ్ముకుం టున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బొంపల్లి గ్రామంలోనూ విత్తనాలు పంపిణీ చేయకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆన్లైన్లో విత్తు
‘ఈ’ వ్యవ‘సాయం’ వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తి స్థాయిలో అమలు ‘మీ-సేవ’లో సైతం లావాదేవీలు సబ్సిడీ విత్తు, పంట బీమా సేవలు ఒక్కో లావాదేవిపై రూ.20 చార్జీ పెరగనున్న పారదర్శకత సాక్షి, సంగారెడ్డి: ఇకపై ఆన్లైన్లో సబ్సిడీ విత్తనాల విక్రయాలు జరపనున్నారు. మండల వ్యవసాయ కార్యాలయాలు, మీ-సేవ’ కేంద్రాలు రైతులకు ఆన్లైన్ విధానంలో విత్తన పర్మిట్లు జారీ చేయనున్నాయి. ‘మీ-సేవ’ కేంద్రాల్లో విత్తనాల విక్రయాలతో పాటు పంట బీమా ప్రీమియం వసులూ చేయనున్నారు. అయితే ఒక్కో లావాదేవిపై రూ.20 చార్జీని వసూలు చేయనున్నాయి. వివిధ పథకాల కింద దాదాపు 50 శాతం వరకు సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తనాలు ప్రతి ఏటా దారిమళ్లి దుర్వినియోగమవుతున్నాయి. పారదర్శకత కోసం అమలు చేస్తున్న ‘ఈ’ విధానం వల్ల ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న విత్తనాలను ఎవరెవరికి అందుతున్నాయో క్షణాల్లో తెలుసుకోవచ్చు. గత ఖరీఫ్ సీజన్లో సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో పెలైట్ ప్రాజెక్టుగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేశారు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో మొక్కజొన్న రైతుల నుంచి పంట బీమా ప్రీమియం సొమ్మును ‘మీ-సేవా’ కేంద్రాల్లో కట్టించుకున్నారు. ఇకపై పంట బీమా ప్రీమియం వసూలుతో పాటు సబ్సిడీ విత్తనాల విక్రయాలు సైతం ‘మీ-సేవా’లో జరపనున్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఈ’ విధానంపై వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, మీ-సేవ కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ ఆహార భద్రత కార్యక్రమం(ఎన్ఎఫ్ఎస్ఎం), సీడ్ విలేజ్ తదితర పథకాల ద్వారా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తోంది. ప్రైవేటు డీలర్లు, మన గ్రోమోర్, ఏపీ ఆగ్రోస్, హాకా, పీఏసీఎస్‌ల ద్వారా సబ్సిడీ విత్తనాలు విక్రయిస్తున్నారు. జిల్లాలో సబ్సిడీ విత్తనాల విక్రయం కోసం 118 సంస్థలు లెసైన్స్ కలిగి ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో గల 220 మీ-సేవా కేంద్రాల ద్వారా సైతం విత్తనాల విక్రయాలు జరగనున్నాయి. పట్టాదారు పాస్‌పుస్తకాలు చూపెట్టిన రైతులకు మండల వ్యవసాయ కార్యాలయాలు విత్తన పర్మిట్లు జారీ చేస్తే పైన పేర్కొన్న కేంద్రాల్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఆన్లైన్ విధానం అమల్లోకి వస్తే.. రైతుల వివరాలతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకాన్ని స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం నాన్ సబ్సిడీ మోత్తాన్ని రైతు నుంచి వసూలు చేసి ఓ పర్మిట్‌ను రైతు చేతికి అందిస్తారు. పర్మిట్‌లో సూచించిన విక్రయ కేంద్రానికి వెళ్లితే రైతుకు కోరిన విత్తనాలు లభ్యం కానున్నాయి. -
నాసిరకం విత్తనాలతో రైతుల బెంబేలు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: నాసిరకం విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు వీటిని రైతులకు కట్టబెట్టి నిలువునా ముంచుతున్నారు. మండలంలోని చాలా మంది రైతులు ఈ విత్తనాలను విత్తుకుని నష్టపోతున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. రైతులకు విత్తనాల నాణ్యత విషయంలో అవగాహన కల్పించడంలో వ్యవసాయాధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. నాసిరకం పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయల విత్తనాలు మార్కెట్లోకి పెద్ద ఎత్తున వచ్చాయి. ఇటీవల ఈ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పలు గ్రామాల రైతులు మోసపోయారు. నాణ్యత లేని పత్తి విత్తనాల వల్ల పంట ఏపుగా పెరిగినా సక్రమంగా కాత, పూత రాకపోవడంతో పాటు తెగుళ్లు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం విత్తనాల కారణంగా పత్తి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మండలంలోని తులేకలాన్, ఎలిమినేడు, పోల్కంపల్లి, నాగన్‌పల్లి, రాయపోల్, దండుమైలారం తదితర అనేక గ్రామాలకు చెందిన రైతులు నాసిరకం పత్తి విత్తనాలు వాడి నష్టాల పాలయ్యారు. ఇక నాసిరకం వరి విత్తనాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం వరి నాట్లు సాగుతున్న తరుణంలో ఈ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోయామని ఇబ్రహీంపట్నంకు చెందిన పలువురు రైతులు వాపోయారు. ప్రైవేట్ మార్కెట్లో ఐఆర్ 64 వరి విత్తనాల బ్యాగు (30కిలోలు)లు నాసిరకంవి వచ్చాయని, ఇది తెలియక తాము కొనుగోలు చేశామని రైతులు తెలిపారు. ఒక్క బ్యాగు వరి విత్తనాల ద్వారా ఎకరాన్నర పొలంలో వరిసాగు చేసుకోవచ్చని, కానీ అవి అర ఎకరా పొలానికి మాత్రమే సరిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరినారు సరిపోక బయట కొనుగోలు చేయాల్సి వచ్చిందని పలువురు రైతులు చెబుతున్నారు. మరోవైపు నాసిరకం కూరగాయల విత్తనాలు కూడా కొనుగోలు చేసి నష్టపోయామంటున్నారు రైతులు. టమాటా, బెండ, వంకాయ, క్యాప్సికం నకిలీ విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని, వ్యాపారులు నాణ్యత కలిగినవని చెప్పడంతో కొనుగోలు చేసి మోసపోతున్నామని రైతులు వాపోతున్నారు. నాణ్యత కలిగిన విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేయడమే తప్ప ఆచరణలో శూన్యమని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన శాఖ తరపున సబ్సిడీ విత్తనాలు ఎప్పుడు అందిస్తున్నారో కూడా తెలియడం లేదని రైతులు అంటున్నారు. ముఖ్యంగా ఉద్యాన శాఖ అధికారులు 50 శాతం సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందిస్తున్నామని చెబుతున్నా అవి ఎవరికి అందిస్తున్నారో తెలియడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నాసిరకం విత్తనాలను విక్రయిస్తున్న ప్రైవేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
వేరుశనగ రైతుల అగచాట్లు
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. సబ్సిడీ విత్తనాల పంపిణీలో లింక్‌లతో కొర్రీలు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన విధానం జిల్లాలోని వేరుశనగ రైతులకు శాపంగా మారింది. సర్కారు నిర్ణయంతో చేసేదేమీ లేక సంబంధిత అధికారులు సైతం చేతులెత్తేస్తుండడంతో కర్షకులు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఇందుకు మానుకోట మండలంలోని వేరుశనగ రైతుల దీనావస్థే నిదర్శనంగా నిలుస్తోంది. మండల పరిధిలో సుమారు 12 వేల మంది రైతులు మూడు వేల హెక్టార్లలో వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. ఈ మేరకు గత ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకున్న అధికారులు మూడు వేల క్వింటాళ్ల పత్తివిత్తనాలు అవసరమని ప్రతిపాదనలు పంపారు. నేటి వరకూ విత్తనాలు రాకపోగా... అందుకు సంబంధించిన ధరను సైతం ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇప్పటికే ఆలస్యమవుతున్న క్రమంలో ప్రభుత్వం హడావుడిగా వేరుశనగ విత్తనాల పంపిణీలో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. సబ్సిడీ విత్తనాల పంపిణీని మీ సేవ కేంద్రాలకు లింక్ చేయడంతోపాటు రైతు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలనే నిబంధనలు విధించింది. రాష్ట్రంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో వరంగల్ జిల్లా కూడా ఉండడంతో ఇక్కడి రైతులు అగచాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులకు మీ సేవ కేంద్రాలపై అవగాహన లేకపోవడం... కొంతమంది రైతులకు పహాణీలు మాత్రమే ఉండడంతో సబ్సిడీ విత్తనాలకు దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డారుు. గతంలో ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సీడి విత్తనాలను అధికారులే పంపిణీ చేసేవారు. సంబంధిత రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు గానీ.. పహాణాలు గానీ పరిశీలించిన తర్వాత అధికారులే నేరుగా పర్మిట్లు జారీ చేసేవారు. వాటితో సంబంధిత షాపుల్లో కర్షకులు సులువుగా విత్తనాలను కొనుగోలు చేసేవారు. కానీ... తాజాగా ప్రభుత్వ అమలు చేసిన విధానం రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. సబ్సిడీని ఎత్తివేయాలనే కుట్రతో ఈ విధానాన్ని అమలు చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనిచేయని వెబ్సైట్లు.. విద్యుత్ కోతలు సబ్సిడీ విత్తనాల కోసం రైతులు మీ సేవ కేంద్రానికి వెళ్లి పట్టాదారు పాసు పుస్తకం, దరఖాస్తు ఫారం, బ్యాంక్ అకౌంట్‌ను సమర్పించాలి. ఆ తర్వాత మీ సేవ సిబ్బంది వాటిని స్కాన్ చేసి సంబంధిత వ్యవసాయ అధికారుల వె బ్సైట్కు పంపిస్తారు. వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆ సమాచారాన్ని తిరిగి మీ సేవకు పంపిస్తారు. తదుపరి రైతుల దరఖాస్తులను మీ సేవ కేంద్రాల సిబ్బంది స్వీకరిస్తారు. అధికారులు తిరస్కరించినా... సంబంధిత పత్రాలు లేకపోయినా... ఆ రైతుకు విత్తనాలు ఇవ్వరు. వెరిఫికేషన్ అనంతరమే రైతులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పటివరకు విత్తన సంచుల ధరలను ప్రభుత్వం నిర్ణరుుంచలేదు. వెబ్సైట్లు సరిగ్గా పనిచేయకపోవడం.. విద్యుత్ కోతల వంటి సమస్యలతో సబ్సిడీ విత్తనాల విధానం ప్రహసనంగా మారింది. ఫలితంగా విత్తనాల కోసం వేరుశనగ రైతులు మీ సేవ కేంద్రాల చుట్టు ప్రదక్షణ లు చేస్తున్నారు. సహనం కోల్పొయిన రైతులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లి వాగ్వాదానికి దిగుతుండడంతో స్థానిక అధికారులకు తలనొప్పిగా మారింది.