ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: నాసిరకం విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు వీటిని రైతులకు కట్టబెట్టి నిలువునా ముంచుతున్నారు. మండలంలోని చాలా మంది రైతులు ఈ విత్తనాలను విత్తుకుని నష్టపోతున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. రైతులకు విత్తనాల నాణ్యత విషయంలో అవగాహన కల్పించడంలో వ్యవసాయాధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి.
నాసిరకం పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయల విత్తనాలు మార్కెట్లోకి పెద్ద ఎత్తున వచ్చాయి. ఇటీవల ఈ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పలు గ్రామాల రైతులు మోసపోయారు. నాణ్యత లేని పత్తి విత్తనాల వల్ల పంట ఏపుగా పెరిగినా సక్రమంగా కాత, పూత రాకపోవడంతో పాటు తెగుళ్లు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం విత్తనాల కారణంగా పత్తి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మండలంలోని తులేకలాన్, ఎలిమినేడు, పోల్కంపల్లి, నాగన్‌పల్లి, రాయపోల్, దండుమైలారం తదితర అనేక గ్రామాలకు చెందిన రైతులు నాసిరకం పత్తి విత్తనాలు వాడి నష్టాల పాలయ్యారు.
ఇక నాసిరకం వరి విత్తనాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం వరి నాట్లు సాగుతున్న తరుణంలో ఈ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోయామని ఇబ్రహీంపట్నంకు చెందిన పలువురు రైతులు వాపోయారు. ప్రైవేట్ మార్కెట్లో ఐఆర్ 64 వరి విత్తనాల బ్యాగు (30కిలోలు)లు నాసిరకంవి వచ్చాయని, ఇది తెలియక తాము కొనుగోలు చేశామని రైతులు తెలిపారు. ఒక్క బ్యాగు వరి విత్తనాల ద్వారా ఎకరాన్నర పొలంలో వరిసాగు చేసుకోవచ్చని, కానీ అవి అర ఎకరా పొలానికి మాత్రమే సరిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో వరినారు సరిపోక బయట కొనుగోలు చేయాల్సి వచ్చిందని పలువురు రైతులు చెబుతున్నారు. మరోవైపు నాసిరకం కూరగాయల విత్తనాలు కూడా కొనుగోలు చేసి నష్టపోయామంటున్నారు రైతులు. టమాటా, బెండ, వంకాయ, క్యాప్సికం నకిలీ విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని, వ్యాపారులు నాణ్యత కలిగినవని చెప్పడంతో కొనుగోలు చేసి మోసపోతున్నామని రైతులు వాపోతున్నారు. నాణ్యత కలిగిన విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేయడమే తప్ప ఆచరణలో శూన్యమని ఆరోపిస్తున్నారు.
వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన శాఖ తరపున సబ్సిడీ విత్తనాలు ఎప్పుడు అందిస్తున్నారో కూడా తెలియడం లేదని రైతులు అంటున్నారు. ముఖ్యంగా ఉద్యాన శాఖ అధికారులు 50 శాతం సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందిస్తున్నామని చెబుతున్నా అవి ఎవరికి అందిస్తున్నారో తెలియడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నాసిరకం విత్తనాలను విక్రయిస్తున్న ప్రైవేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నాసిరకం విత్తనాలతో రైతుల బెంబేలు
Published Sun, Jan 19 2014 12:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement