నల్ల బజారుకు విత్తనాలు
- బయోమెట్రిక్ అంతా ఉత్తిదే
- అధికారుల సహకారంతోనే బ్లాక్‌మార్కెట్‌కు
ఖాజీపేట: రైతులకు సబ్సిడీ ద్వారా అందాల్సిన విత్తనాలు అధికారుల సహకారంతో దర్జాగా నల్ల బజారుకు తరలివెళ్లాయి. ఈ విషయం సాక్షి నిఘాలో బట్టబయలైంది. సబ్సిడీ విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నా అధికారులు తమకేమి తెలియదన్నట్లు వ్యవహరించడం గమనార్హం. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో రైతులకు సబ్సిడీతో శనగ విత్తనాలను శుక్రవారం అధికారికంగా పంపిణీ చేపట్టారు. మొదటి రోజే ప్రభుత్వ లక్ష్యానికి దళారులు తూట్లు పొడిచారు.
ఖాజీపేట మండలంలో రబీ సీజన్ కు 200 క్వింటాళ్ల శనగ విత్తనాలు మంజూరయ్యయి. శుక్రవాం ఏటూరు గ్రామంలో విత్తన పంపిణీ చేపట్టారు. అధికారుల ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఒక్క రోజు 112 మందికి 25 కేజీల శనగల బ్యాగులు 400 వరకు పంపిణీ చేశారు. ఇందులో సుమారు 150కి పైగా నల్లబజారుకు తరలివెళ్లాయి.
అధికారుల మాటలు నీటిమూటలు
అక్రమాలను అరికట్టేందుకే బయోమెట్రిక్ విధానం తీసుకు వచ్చామని అధికారులు ప్రకటించారు. ఖాజీపేట మండలంలో బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ చేపడుతున్నాం అని చెప్పారు. కానీ కేవలం మాటలకే పరిమితమయ్యాయి. అధికారికంగానే దర్జాగా విత్తన బస్తాలను ట్రాక్టర్‌లో కమలాపురాని తరలించారు. వాస్తవానికి విత్తనాలు కావాల్సిన రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ఆధార్‌కార్డు, పాసుపుస్తకం నమోదు చేసుకోవాలి. వేలి ముద్రలు వేయించుకుని స్లిప్‌లు తీసుకుని మన గ్రోమోర్ దగ్గరకు వెళ్లాలి.అప్పుడే విత్తనాలు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మన గ్రోమోర్‌కు చెందిన వారు రైతులకు సంభందించిన అన్ని బస్తాలను ఒకే ట్రాక్టర్‌లో వేశారు. ఆ ట్రాక్టర్ ఏటూరు గ్రామంలోకి వెళ్లి్లంది అక్కడ సుమారు 40నుంచి 50 బస్తాలు దించి మిగిలిన వాటిని కమలాపురానికి తీసుకెళ్లారు.విత్తనాలు దర్జాగా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అధికారులు కూడా తమ వంతుగా సహకరించినట్లు తెలుస్తోంది.
సమస్య నుంచి బయట పడేందుకు ఏర్పాట్లు
సబ్సిడీ విత్తనాలు నల్లబజారుకు తరలి వెళ్లిన విషయం బయట పడడంతో అప్పడే అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాగోలా ఈవిషం నుంచి బయట పడాలని తమకు కావాల్సిన విధంగా ఇటు ఉన్నతాధికారులను అటు రాజకీయంగా ఉన్న పలుకు బడిన ఉపయోగించి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లు రైతులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.