ఆన్‌లైన్‌లో విత్తు
‘ఈ’ వ్యవ‘సాయం’
వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తి స్థాయిలో అమలు
‘మీ-సేవ’లో సైతం లావాదేవీలు
సబ్సిడీ విత్తు, పంట బీమా సేవలు
ఒక్కో లావాదేవిపై రూ.20 చార్జీ
పెరగనున్న పారదర్శకత
సాక్షి, సంగారెడ్డి:
ఇకపై ఆన్‌లైన్‌లో సబ్సిడీ విత్తనాల విక్రయాలు జరపనున్నారు. మండల వ్యవసాయ కార్యాలయాలు, మీ-సేవ’ కేంద్రాలు రైతులకు ఆన్‌లైన్ విధానంలో విత్తన పర్మిట్లు జారీ చేయనున్నాయి. ‘మీ-సేవ’ కేంద్రాల్లో విత్తనాల విక్రయాలతో పాటు పంట బీమా ప్రీమియం వసులూ చేయనున్నారు.
అయితే ఒక్కో లావాదేవిపై రూ.20 చార్జీని వసూలు చేయనున్నాయి. వివిధ పథకాల కింద దాదాపు 50 శాతం వరకు సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తనాలు ప్రతి ఏటా దారిమళ్లి దుర్వినియోగమవుతున్నాయి. పారదర్శకత కోసం అమలు చేస్తున్న ‘ఈ’ విధానం వల్ల ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న విత్తనాలను ఎవరెవరికి అందుతున్నాయో క్షణాల్లో తెలుసుకోవచ్చు. గత ఖరీఫ్ సీజన్‌లో సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో పెలైట్ ప్రాజెక్టుగా ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేశారు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో మొక్కజొన్న రైతుల నుంచి పంట బీమా ప్రీమియం సొమ్మును ‘మీ-సేవా’ కేంద్రాల్లో కట్టించుకున్నారు. ఇకపై పంట బీమా ప్రీమియం వసూలుతో పాటు సబ్సిడీ విత్తనాల విక్రయాలు సైతం ‘మీ-సేవా’లో జరపనున్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఈ’ విధానంపై వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, మీ-సేవ కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జాతీయ ఆహార భద్రత కార్యక్రమం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం), సీడ్ విలేజ్ తదితర పథకాల ద్వారా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తోంది. ప్రైవేటు డీలర్లు, మన గ్రోమోర్, ఏపీ ఆగ్రోస్, హాకా, పీఏసీఎస్‌ల ద్వారా సబ్సిడీ విత్తనాలు విక్రయిస్తున్నారు. జిల్లాలో సబ్సిడీ విత్తనాల విక్రయం కోసం 118 సంస్థలు లెసైన్స్ కలిగి ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో గల 220 మీ-సేవా కేంద్రాల ద్వారా సైతం విత్తనాల విక్రయాలు జరగనున్నాయి. పట్టాదారు పాస్‌పుస్తకాలు చూపెట్టిన రైతులకు మండల వ్యవసాయ కార్యాలయాలు విత్తన పర్మిట్లు జారీ చేస్తే పైన పేర్కొన్న కేంద్రాల్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ విధానం అమల్లోకి వస్తే.. రైతుల వివరాలతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకాన్ని స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. అనంతరం నాన్ సబ్సిడీ మోత్తాన్ని రైతు నుంచి వసూలు చేసి ఓ పర్మిట్‌ను రైతు చేతికి అందిస్తారు. పర్మిట్‌లో సూచించిన విక్రయ కేంద్రానికి వెళ్లితే రైతుకు కోరిన విత్తనాలు లభ్యం కానున్నాయి.