దోచుకో..దాచుకో! | corruption subsidy seeds | Sakshi
Sakshi News home page

దోచుకో..దాచుకో!

Published Sat, Jan 28 2017 11:37 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

దోచుకో..దాచుకో! - Sakshi

దోచుకో..దాచుకో!

- విత్తనం సొమ్ము తినికూర్చున్న  తెలుగు‘తమ్ముళ్లు’
– రూ.1.19 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి
– వసూళ్ల కోసం తిరుగుతున్న ఏపీ సీడ్స్‌ అధికారులు


వేరుశనగ సొమ్ము ఏపీ సీడ్స్‌కు చెల్లించకుండా బకాయిపడిన వివరాలిలా...
మండలం        రావాల్సిన మొత్తం        మండలం        రావాల్సిన మొత్తం
కొత్తచెరువు        37.96 లక్షలు        నల్లమాడ            01.99 లక్షలు
ఓడీ చెరువు        00.94 వేలు        శెట్టూరు            31.85 లక్షలు
బ్రహ్మసముద్రం    20.76 లక్షలు        కళ్యాణదుర్గం        01.74 లక్షలు
మడకశిర        03.51 లక్షలు        రొళ్ల            00.89 వేలు
గుడిబండ        00.25 వేలు        పరిగి            03.22 లక్షలు
పెనుకొండ        00.88 వేలు        ఉరవకొండ        14.78 లక్షలు


అనంతపురం అగ్రికల్చర్‌ : తాము నీతి నిజాయితీకి మారుపేరు అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక వైపు గొప్పలు చెబుతుండగా... మరో వైపు దొరికింది దోచుకో.. దాచుకో అనే రీతిలో తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి జమ చేయాల్సిన ప్రజాధనాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచర వర్గాలు యథేచ్చగా స్వాహా చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకు నిదర్శనం ఏటా ఖరీఫ్‌లో రైతులకు రాయితీతో పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ సొమ్మును పలువురు తెలుగు తమ్ముళ్లు దిగమింగినట్లు తెలుస్తోంది. 

2016 ఖరీఫ్‌ విత్తన వేరుశనగ పంపిణీకి సంబంధించి రూ.1.19 కోట్లు వసూలు చేసుకుని జేబులు నింపుకుని దర్జాగా తిరుగుతున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతల నుంచి సొమ్మును రాబట్టుకునేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్‌) అధికారులు నెలల తరబడి తంటాలు పడుతున్నా పైసా కూడా చెల్లించకుండా దొరల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.  ఏపీ సీడ్స్‌ ద్వారా 2016లో 1.51 లక్షల క్వింటాళ్లు 31 మండలాల్లో పంపిణీ చేశారు.  అధికార పార్టీకి చెందిన నేతల సిఫారసుతో ప్రధాన అనుచరులు మండలాల్లో పంపిణీ చేసే బాధ్యతలు దక్కించకున్నారు.

పంపిణీ చేసిన తర్వాత వారి కమీషన్‌ తీసుకుని మిగతా మొత్తం ఏపీ సీడ్స్‌ ద్వారా ప్రభుత్వానికి జమ చేయాల్సివుంది. కానీ కొందరు నేతలు కమీషన్‌తో పాటు ప్రభుత్వానికి కట్టాల్సిన మొత్తం సొమ్మును దిగమింగి కూర్చోవడంతో ఏపీ సీడ్స్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో ప్రజాప్రతినిధులు, పంపిణీ చేసిన నేతల ఇళ్లు, కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నా వసూలు కావడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా కళ్యాణదుర్గం, పుట్టపర్తి నియోజక వర్గాల పరిధిలో పెద్ద మొత్తంలో రాయితీ సొమ్ము పేరుకుపోయింది.

తామేమీ తక్కువ కాదంటున్న వ్యవసాయశాఖ అధికారులు
ఓ వైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తుండగా తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా వ్యవసాయశాఖ డివిజన్, మండల స్థాయి అధికారులు కూడా వివిధ పథకాల కింద పంపిణీ చేసిన విత్తనాలకు సంబంధించి రాయితీ సొమ్మును ప్రభుత్వానికి చెల్లించకుండా జేబుల్లో పెట్టుకుని స్వంతానికి వాడుకుంటున్నారు. అందులో 2016–17 సంవత్సరానికి సంబంధించి 13 మండలాల అధికారులు రూ.15.87 లక్షలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు.

ఈ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు ఏపీ సీడ్స్‌ అధికారులు అష్టకష్టాలు పడుతున్నట్లు సమాచారం. మడకశిర డివిజన్‌ ఏడీ నుంచి రూ.4.73 లక్షలు రాయితీ సొమ్ము రావాల్సి ఉందిది. అలాగే రాప్తాడు ఏఓ రూ.59 వేలు, గాండ్లపెంట ఏఓ రూ.25 వేలు, ఓడీ చెరువు ఏఓ రూ.21 వేలు, నల్లచెరువు ఏఓ రూ.81 వేలు, గుంతకల్లు ఏఓ రూ.12 వేలు, మడకశిర ఏఓ రూ.5 వేలు, గుత్తి ఏఓ రూ.3,500, తనకల్లు ఏఓ రూ.3.21 లక్షలు, తలుపుల ఏఓ రూ.1.37 లక్షలు, విడపనకల్‌ ఏఓ రూ.3,600, అమడగూరు ఏఓ రూ.1.03 లక్షలు, రొళ్ల ఏఓ రూ.3.39 లక్షలు చెల్లించకుండా నెలల తరబడి జాప్యం చేస్తున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement