అనంతపురం సిటీ: సకాలంలో కురవని వర్షాలతో రైతులు దిగాలు పడ్డారని, ఇక ప్రత్నామ్నాయ పంటలే దిక్కని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు రాయితీతో విత్తనాలు అందించేందుకు రూ.85.5 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. స్థానిక జాతీయ రహదారులు, భవనాల శాఖ అథితి గృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక జిల్లాలో వేరుశనగ విత్తనం విత్తేందుకు గడువు లేదని, ఖరీఫ్‌లో కూడా తుంగభద్ర ఎగువ కాలువలో నీళ్లు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా ఉలవలు 50 వేల క్వింటాళ్లు, అలసందలు 19 వేలు, కొర్ర 2500లు, పచ్చజొన్న 4500 క్వింటాళ్ల విత్తనం జిల్లాకు అవసరం ఉందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
స్పందించిన ముఖ్య మంత్రి అందుకు సరేనని చెప్పారు. రేపటి నుంచి ఈ విత్తనాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని రకాల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. బయోమెట్రిక్ ద్వారా విత్తన పంపిణీ చేపట్టి ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావులేకుండా చూస్తామన్నారు. ఇక చంద్రన్న బీమా పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సహజ మరణం చెందిన కుటుంబాలకు పెద్దకర్మ రోజుకే రూ.30 వేలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశామన్నారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీకే ప్రజలు పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన అనంతరం తెలుగు దేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులకు నంద్యాల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, ఇదే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయ పంటలకు రాయితీతో విత్తనాలు
Published Wed, Aug 16 2017 9:27 PM | Last Updated on Tue, Sep 12 2017 12:14 AM
Advertisement