సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. నాయకుల మధ్య సఖ్యత చెడి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. ఏ నాయకుడికీ మరొక నియోజకవర్గ నాయకుడితో సరైన సంబంధాలు లేవు. ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు టీడీపీ అధ్యక్షులను నియమించింది. కానీ ఇక్కడ జిల్లా అధ్యక్షుల మాట కిందిస్థాయి నాయకులు వినే పరిస్థితి లేదు.
పరిటాల వర్గమంటేనే భగ్గుమంటున్నారు
పరిటాల రవి బతికున్నపుడు టీడీపీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన మరణానంతరం పరిటాల కుటుంబమంటేనే కత్తులు దూస్తున్న పరిస్థితి. రాప్తాడు పక్కనే ఉన్న ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు పరిటాల కుటుంబానికి సత్సంబంధాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొనే పరిస్థితులు చాలా తక్కువ.
ఇక ధర్మవరం నుంచి 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన వరదాపురం సూరి.. 2019లో ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు పరిటాల శ్రీరామ్‌తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. ఇద్దరూ ఒకే ఊర్లో ఉంటే రోజూ ఉద్రిక్త పరిస్థితులే.
జేసీ అనుచరులతో ఎవరికీ సంబంధాలు లేవు
పరిటాల తర్వాత జిల్లాలో ప్రధాన గ్రూపు జేసీ బ్రదర్స్‌ది. ఈడీ కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఇప్పుడు జిల్లాలో పలకరించే దిక్కులేదు. పార్టీపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎవరూ ఆయన దగ్గరకు రాని పరిస్థితి.
జిల్లాలో ఏ నాయకుడితోనూ సత్సంబంధాలు లేవు. విధిలేని పరిస్థితుల్లోనే ఆయన కుమారుడికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తున్నట్లు తెలిసింది.
కాలవ మాటకు విలువేది?
టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలవ శ్రీనివాసులు మాటకు విలువ ఇచ్చే నాయకులు వెతికినా కనిపించరు. పైగా ఆయనంటే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రధాన నాయకులు కత్తులు దూస్తున్నారు.
అంతటా ప్రత్యేక గ్రూపులు పెట్టి పార్టీని అధమ స్థాయికి తీసుకెళ్లారని కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు తదితర నియోజకవర్గాల నాయకులు వాపోతున్నారు. అందుకే కాలవ శ్రీనివాసులుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీగా దించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
బీకే వేదన అరణ్య రోదన
టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీకే పార్థసారథి వేదన అరణ్య రోదనగానే ఉంది. తనకు టికెట్ లేదన్న లీకులు ఆయన్ను కలవరపెడుతున్నాయి. సవితమ్మకూ ఈయనకూ గత కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంది.
ఈసారి సవితమ్మకు టికెట్ ఇస్తూ తనను ఎంపీగా పంపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేగానే పోటీచేస్తా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా బీకేను పార్టీ లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో పార్టీ అధ్యక్షుడిగా తన మాట ఎవరూ వినడం లేదని ఆయన లోలోపల కుమిలిపోతున్నారు.
వర్ధంతి..జయంతులకు కొట్లాటే
ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలోనూ కొట్లాటలే. పూలదండలు వేసే కార్యక్రమం చిల్లర కొట్లాటలను తలపించాయి. కళ్యాణదుర్గం నుంచి కదిరి వరకూ వర్గాలు బాహాబాహీగా పోరులో పాల్గొన్నవే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిస్థితి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వర్గపోరును నియంత్రించలేకపోతున్నారు. అందుకే టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment