అధికార పార్టీలో అప్పుడే మొదలైన వర్గపోరు
అనంతపురంలో దగ్గుపాటి వర్సెస్ వైకుంఠం
‘బియ్యం దొంగ’ నువ్వంటే నువ్వంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు
శింగనమలలో ఎమ్మెల్యేను లెక్కచేయని ద్విసభ్య కమిటీ
ఎమ్మెల్యే సిఫారసు చేసిన డీలర్‌షిప్‌లకు బ్రేక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికారం చేపట్టి మూడు మాసాలు కూడా కాకమునుపే అధికార పార్టీలో కలహాల కాపురం మొదలైంది. కొన్ని నియోజకవర్గాల్లో ‘తమ్ముళ్లు’ రెండు వర్గాలుగా విడిపోయి నిత్యం పోట్లాడుకుంటుండడంపై సామాన్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హామీలు నెరవేరుస్తామని, సంపద సృష్టిస్తామని ఊరూరా వచ్చి ప్రచారం చేస్తే ఏమో అనుకున్నామని, ఇదేనా మీ సంపద సృష్టి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం, శింగనమల నియోజకవర్గాల్లో వర్గపోరు తారస్థాయికి చేరింది.
అర్బన్‌లో రాజుకున్న అగ్గి..
అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరింది. బియ్యం దొంగ నువ్వంటే నువ్వేనంటూ పరస్పరం సోషల్ మీడియాలో యుద్ధం చేసినంత పనిచేశారు. తొలుత ప్రభాకర్ చౌదరి మనుషులే మాధవి అనే మహిళతో వాయిస్ రికార్డింగ్ చేయించి బ్లాక్‌మార్కెట్‌కు బియ్యం తరలిస్తున్నట్టు మీడియాకు ఇచ్చారని ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గం ఆరోపిస్తుండగా.. పాతూరులో కావాలని తన అనుచరులు బ్లాక్‌మార్కెట్‌కు బియ్యం తరలిస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రచారం చేశారని వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా అనంతపురం నియోజకవర్గంలో నిర్బంధ వసూళ్లు జరుగుతున్నట్టు ఆరోపించారు.
ఇద్దరూ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అధికారం వచ్చింది..అభివృద్ధి పనులు చేయాల్సింది పోయి ఇలా కుమ్ములాడుకోవడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. దగ్గుపాటి అంతుచూస్తానని ప్రభాకర్ చౌదరి అంటుండగా.. చౌదరి నైజం అందరికీ తెలుసునని దగ్గుపాటి వర్గం అంటోంది. ప్రభాకర్ చౌదరికి నామినేటెడ్ పోస్టు సైతం రాకుండా అడ్డుకునేందుకు దగ్గుపాటి వర్గం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈయన పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
శింగనమలలో రచ్చకెక్కిన వ్యవహారం..
శింగనమల అంటేనే తెలుగుదేశం పార్టీలో వర్గపోరుకు చిరునామాగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బండారు శ్రావణి గెలిచారు. ఈమె గెలుపును నియోజకవర్గంలో పార్టీ ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ఏ మాత్రమూ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఎమ్మెల్యే శ్రావణి ద్విసభ్య కమిటీ సభ్యులను కాదని రేషన్ షాపుల డీలర్‌షిప్పులను తన వర్గీయులకు ఇచ్చుకున్నారు.
దీంతో ద్విసభ్య కమిటీ సభ్యులు అధిష్టానానికి ఫిర్యాదులు చేయించి 52కు పైగా డీలర్‌షిప్పులను ఆపించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలోనూ శ్రావణి పెత్తనం చెల్లదంటూ ద్విసభ్య కమిటీ అంటోంది. ‘ఎమ్మెల్యేను నేను కదా.. వాళ్లెవరు’ అని శ్రావణి అంటుండగా..మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు. వీరి వ్యవహారంతో ముఖ్యంగా తహసీల్దార్లు, ఎంపీడీఓలు తల పట్టుకుంటున్నారు. కూటమి పాలన అంటే ఇదేనా అంటున్నారు. కుమ్ములాటల కారణంగా అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయినట్టు విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment