గ్రానైట్ పరిశ్రమలపై టీడీపీ హయాంలో గొడ్డలిపెట్టు
అనాలోచిత నిర్ణయంతో తొక్కేసిన చంద్రబాబు
పరిశ్రమల యజమానులను వెంటాడి వేధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
బాధ భరించలేక యంత్రాలను తెగనమ్ముకున్న నిర్వాహకులు
తాడిపత్రి రూరల్: గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకున్న ఒక్క అనాలోచిత నిర్ణయం గ్రానైట్ పరిశ్రమను కోలుకోలేకుండా చేసింది. పరిశ్రమలు దివాళా తీసేందుకు కారణమైంది. వేలాది మంది వలస కూలీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన పరిశ్రమల నిర్వాహకులు చంద్రబాబు దెబ్బతో కోలుకోలేకపోయారు. రూ. కోట్లు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన యంత్రాలను రూ. లక్షలకే తెగనమ్ముకున్నారు. చాలామంది అప్పుల్లో కూరుకుపోయారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గ్రానైట్ పరిశ్రమ ఒక వెలుగు వెలిగింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు నిర్వాహకులకు ఊపిరినిచ్చాయి. తదనంతరం వచ్చిన పాలకుల చిన్నచూపుతో ఈ పరిశ్రమ ప్రభ తగ్గుతూ వచ్చింది.
స్లాబ్ సిస్టం ఎత్తేసి.. ఉసురు తీసి
2014లో అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు గ్రానైట్ పరిశ్రమపై కన్నెర్ర చేశారు. అప్పటి వరకూ అమలులో ఉన్న స్లాబ్ సిస్టం ఎత్తి వేశారు. దీంతో నష్టాలు వస్తాయని, దివాళా తీస్తామని నిర్వాహకులు మొత్తుకున్నా లెక్క చేయలేదు. గ్రానైట్ పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా పట్టించుకోలేదు. 2019లో ఎన్నికలు దగ్గర పడడంతో మొదటికే మోసం వస్తుందని భావించి కంటి తుడుపు చర్యగా గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడానికంటూ కమిటీ ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు కమిటీ నివేదిక ఇచ్చినా దాన్ని బుట్టదాఖలు చేశారు.
చెక్‌పోస్టులతో కొంపముంచిన జేసీ..
గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకులను గట్టెక్కించాల్సిన అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వారిపై మరింత కత్తిగట్టారు. పరిశ్రమల యజమానులను దొంగలుగా చిత్రీకరించారు. బిల్లులు లేకుండా ముడి సరుకు వస్తోందంటూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయించారు. సరుకును తరలిస్తున్న లారీల యజమానులను మామూళ్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. మరో వైపు జేసీ అనుచరులు మాత్రం యథేచ్ఛగా నాసిరకం ముడి సరుకును ఎలాంటి బిల్లులు లేకుండా రవాణా చేసేవారు. జేసీ పెత్తనం వల్ల పనికి రాని సరుకును కూడా కొనుగోలు చేస్తూ యజమానులు మరింత నష్టపోయారు. ఈ దురాగతాలపై ఫిర్యాదు రావడంతో చర్యలకు దిగిన అప్పటి మైన్స్ అండ్ జియాలజీ అధికారిపైనా జేసీ అనుచరులు దాడికి యత్నించారు. తమ జోలికి వస్తే తల నరికి లారీకి కడతామంటూ వారు బెదిరించడం అప్పట్లో సంచలనం రేపింది.
యంత్రాలను నష్టాలకు అమ్ముకుని..
వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో తాడిపత్రి పరిసరాల్లో 250 వరకూ గ్రానైట్ పరిశ్రమలు ఉండేవి. చంద్రబాబు, జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వాకాలతో టీడీపీ ప్రభుత్వ హయాంలో వందకు తగ్గిపోయాయి. పరిశ్రమలు మూతపడటంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల కార్మికులకు వేలకు వేలు అడ్వాన్స్‌లు ఇచ్చి తీసుకొచ్చిన యజమానులు.. కార్మికులు అర్ధంతరంగా వెళ్లడంతో ఆ నష్టాన్ని కూడా మౌనంగా భరించారు. ట్రాలీ, కట్టర్లు, పాలిష్ తదితర మిషన్లను గుజిరీ కింద తెగనమ్ముకున్నారు. చంద్రబాబు మిగిల్చిన పీడ కలను నేటికీ మర్చిపోలేకున్నామని వారు ఆవేదనగా చెబుతున్నారు.
మిషన్లను గుజిరీకి వేశా
ఎన్నో ఆశలతో రూ.కోటి పెట్టుబడి పెట్టి గ్రానైట్ పరిశ్రమను నెలకొల్పా. టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు శరాఘాతంగా మారాయి. దీంతో నష్టాలు తప్పలేదు. పరిశ్రమలోని మిషన్లు, ఇతర సామగ్రిని గుజిరికి వేశా. రూ. 10 లక్షలే అన్నా ఎక్కడ తుప్పు పడతాయన్న భయంతో ఆ రేటుకే అమ్మేశా. ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నా.
– రామ్మోహన్, తాడిపత్రివాసి
Comments
Please login to add a commentAdd a comment