alternate crops
-
'ప్లాన్'తో పంటలేద్దాం..
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పంటలు, వాతావరణ వైవిధ్యం ఉంటుంది. కేంద్రం వార్షిక ప్రణాళికను ప్రకటిస్తే రాష్ట్రం కూడా కేంద్రం ప్రకటించిన వార్షిక ప్రణాళికకు అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహిస్తుంది. ఆహార ధాన్యాల సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ, అస్పష్ట విధానాలు తెలంగాణ రైతాంగానికి, దేశంలో వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారాయి. దీనిపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కనీస మద్దతు ధరతో పాటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి వార్షిక ప్రణాళికను ప్రకటించాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్రం వార్షిక ప్రణాళికను ప్రకటిస్తే దానికనుగుణంగా పంటలు సాగు చేద్దామన్నారు. ఆహార ధాన్యాల సేకరణ అంశంలో కేంద్రానికి సమగ్ర జాతీయ విధానం ఉండాలని, ధాన్యం సేకరణలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం వర్తింపజేయాలని కూడా డిమాండ్ చేయాలని చెప్పారు. వ్యవసాయ అంశాలపై కేంద్రం ఏర్పాటు చేయనున్న కమిటీ త్వరగా ఏర్పాటయ్యేలా ఒత్తిడి చేయాలని సూచించారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు అంశంపై పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. యాసంగి పనులు ప్రారంభమైన నేపథ్యంలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్రం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరి సరికాదు ‘రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించడం ఒక్కరోజులో అయ్యే పనికాదు. ఇది ఒక క్రమ పద్ధతిలో జరగాల్సిన ప్రక్రియ. వానాకాలం వరి సాగు విస్తీర్ణం విషయంలో కేంద్రం రోజుకో మాటతో కిరికిరి పెడుతోంది. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి గాను కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నులు (40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం) మాత్రమే సేకరిస్తామని పాత పాట పాడుతోంది. రాష్ట్ర మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యింది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల బృందం కేంద్ర అధికారులను కలిసింది. అయినా కేంద్రం ఎటూ తేల్చకపోవడం సరికాదు..’అని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టే విద్యుత్ చట్టంపై, విభజన హామీలపై గట్టిగా ప్రశ్నించాలని సూచించారు. రైతుల పక్షాన గళం విప్పాల్సిందే.. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో రైతుల పక్షాన గళం వినిపించాలని టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం నిర్ణయించింది. వార్షిక ధాన్యం సేకరణ కేలండర్‌ను విడుదల చేయాలన్న సీఎం డిమాండ్‌ను అభినందిస్తూ, కేంద్రం అనుసరిస్తున్న ఆయోమయ విధానంపై పోరాడాలని నిర్ణయించింది. ధాన్యం దిగుబడిలో తెలంగాణ రైతాంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా.. కేంద్రం వైఖరి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అశనిపాతంగా మారిందని సమావేశం అభిప్రాయపడింది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కె.కేశవరావు సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, పి.రాములు, దయాకర్, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, ఎం.శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ప్రత్యామ్నాయ పంటలే మేలు
అనంతపురం అగ్రికల్చర్: తేమ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ రైతులకు సూచించారు. చాలా మండలాల్లో భూములు ఖాళీగా ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగు అంతో ఇంతో దిగుబడులు రావడంతో పాటు పశుగ్రాసం లభిస్తుందన్నారు. ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు ఇస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకుని పంటలు వేసుకోవాలన్నారు. కొర్రలు + ఎకరాకు 2 కిలోల కొర్రలు అవసరం. సాళ్ల మధ్య 20 నుంచి 22 సెంటీమీటర్లు (సెం.మీ), మొక్కల మధ్య 7.5 సెం.మీ దూరం ఉంచి విత్తుకోవాలి. ఎకరాకు 35 కిలోల యూరియా, 50 కిలోల సూపర్‌పాస్ఫేట్ వేయాలి. యూరియాను రెండు భాగాలుగా చేసుకుని విత్తేసమయంలో సగం, విత్తిన 25 రోజుల తర్వాత మిగతా సగం వేసుకోవాలి. పెసలు + ఎకరాకు 6 నుంచి 7 కిలోల పెసలు అవసరం. వరుసల మధ్య 30 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి. భూసారాన్ని బట్టి ఎకరాకు 20 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్‌పాస్ఫేట్ వేయాలి. విత్తిన 20 నుంచి 30 రోజల సమయంలో కలుపు లేకుండా తీసివేయాలి. తొలిదశలో రసంపీల్చు పురుగులు, పూత, కాయ దశలో మారుకామచ్చల పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. పెసరలో కందిని 7 :1 లేదా 15 :1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకున్నా అదనపు ఆదాయం వస్తుంది. అలసందలు + ఎకరాకు 8 నుంచి 10 కిలోల అలసందలు అవసరం. వరుసల మధ్య 30 నుంచి 45 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేయాలి. ఉలవ + వాతావరణ పరిస్థితులు, వర్షం అనుకూలించని సమయంలో చివరగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉలవ పంట వేసుకోవాలి. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరం. గొర్రు ద్వారా 30 (ఇంటు) 10 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 8 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్‌పాస్ఫేట్, 15 కిలోల పొటాష్ ఎరువు విత్తే ముందు వేసుకోవాలి. అనుములు + అనుములు వేయాలనుకుంటే ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరం, సాళ్ల మధ్య ఒక సెం.మీ, మొక్కల మధ్య 1.5 సెం.మీ దూరంలో వేయాలి. 5 శాతం వేపగింజల కషాయం పూత, కాయ దశలో పిచికారీ చేసుకుంటే చీడపీడలు, తెగుళ్లను నివారించుకోవచ్చు. స్వల్పకాలిక కంది రకాలు + ఆగస్టులో స్వల్పకాలిక కంది రకాలు వేసుకోవచ్చు. వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ దూరం పాటించాలి. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం. ఎకరాకు 20 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్‌పాస్ఫేట్ వేయాలి. సెప్టెంబర్‌లో వెర్రితెగులు ఆశించిన మొక్కలను గమనించి తీసేయాలి. పూత, కాయ దశలో మారుకామచ్చ తెగులు ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు 1 మి.లీ నొవాల్యురాన్ లేదా 2 మి.లీ క్లోరోఫైరిపాస్కు 1 మి.లీ డైక్లోరోవాస్తో లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. శనగపచ్చ పురుగు నివారణకు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వస్తాయి. -
ప్రత్యామ్నాయ పంటలకు రాయితీతో విత్తనాలు
అనంతపురం సిటీ: సకాలంలో కురవని వర్షాలతో రైతులు దిగాలు పడ్డారని, ఇక ప్రత్నామ్నాయ పంటలే దిక్కని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు రాయితీతో విత్తనాలు అందించేందుకు రూ.85.5 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. స్థానిక జాతీయ రహదారులు, భవనాల శాఖ అథితి గృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక జిల్లాలో వేరుశనగ విత్తనం విత్తేందుకు గడువు లేదని, ఖరీఫ్‌లో కూడా తుంగభద్ర ఎగువ కాలువలో నీళ్లు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా ఉలవలు 50 వేల క్వింటాళ్లు, అలసందలు 19 వేలు, కొర్ర 2500లు, పచ్చజొన్న 4500 క్వింటాళ్ల విత్తనం జిల్లాకు అవసరం ఉందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. స్పందించిన ముఖ్య మంత్రి అందుకు సరేనని చెప్పారు. రేపటి నుంచి ఈ విత్తనాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని రకాల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. బయోమెట్రిక్ ద్వారా విత్తన పంపిణీ చేపట్టి ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావులేకుండా చూస్తామన్నారు. ఇక చంద్రన్న బీమా పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సహజ మరణం చెందిన కుటుంబాలకు పెద్దకర్మ రోజుకే రూ.30 వేలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశామన్నారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీకే ప్రజలు పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన అనంతరం తెలుగు దేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులకు నంద్యాల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, ఇదే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.