'ప్లాన్‌'తో పంటలేద్దాం.. | CM KCR Statement On Agriculture In TRS parliamentary party Meeting | Sakshi
Sakshi News home page

'ప్లాన్‌'తో పంటలేద్దాం..

Published Mon, Nov 29 2021 3:33 AM | Last Updated on Mon, Nov 29 2021 3:33 AM

CM KCR Statement On Agriculture In TRS parliamentary party Meeting - Sakshi

ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్, మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పంటలు, వాతావరణ వైవిధ్యం ఉంటుంది. కేంద్రం వార్షిక ప్రణాళికను ప్రకటిస్తే రాష్ట్రం కూడా కేంద్రం ప్రకటించిన వార్షిక ప్రణాళికకు అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహిస్తుంది.

 ఆహార ధాన్యాల సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ, అస్పష్ట విధానాలు తెలంగాణ రైతాంగానికి, దేశంలో వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారాయి. దీనిపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: నీస మద్దతు ధరతో పాటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి వార్షిక ప్రణాళికను ప్రకటించాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కేంద్రం వార్షిక ప్రణాళికను ప్రకటిస్తే దానికనుగుణంగా పంటలు సాగు చేద్దామన్నారు. ఆహార ధాన్యాల సేకరణ అంశంలో కేంద్రానికి సమగ్ర జాతీయ విధానం ఉండాలని, ధాన్యం సేకరణలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం వర్తింపజేయాలని కూడా డిమాండ్‌ చేయాలని చెప్పారు.

వ్యవసాయ అంశాలపై కేంద్రం ఏర్పాటు చేయనున్న కమిటీ త్వరగా ఏర్పాటయ్యేలా ఒత్తిడి చేయాలని సూచించారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు అంశంపై పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. యాసంగి పనులు ప్రారంభమైన నేపథ్యంలో బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేసేది లేదని కేంద్రం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కేంద్రం వైఖరి సరికాదు 
‘రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించడం ఒక్కరోజులో అయ్యే పనికాదు. ఇది ఒక క్రమ పద్ధతిలో జరగాల్సిన ప్రక్రియ. వానాకాలం వరి సాగు విస్తీర్ణం విషయంలో కేంద్రం రోజుకో మాటతో కిరికిరి పెడుతోంది. 90 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యానికి గాను కేవలం 60 లక్షల మెట్రిక్‌ టన్నులు (40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం) మాత్రమే సేకరిస్తామని పాత పాట పాడుతోంది.

రాష్ట్ర మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యింది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల బృందం కేంద్ర అధికారులను కలిసింది. అయినా కేంద్రం ఎటూ తేల్చకపోవడం సరికాదు..’అని కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టే విద్యుత్‌ చట్టంపై, విభజన హామీలపై గట్టిగా ప్రశ్నించాలని సూచించారు. 

రైతుల పక్షాన గళం విప్పాల్సిందే.. 
అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో రైతుల పక్షాన గళం వినిపించాలని టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం నిర్ణయించింది. వార్షిక ధాన్యం సేకరణ కేలండర్‌ను విడుదల చేయాలన్న సీఎం డిమాండ్‌ను అభినందిస్తూ, కేంద్రం అనుసరిస్తున్న ఆయోమయ విధానంపై పోరాడాలని నిర్ణయించింది. ధాన్యం దిగుబడిలో తెలంగాణ రైతాంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా.. కేంద్రం వైఖరి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అశనిపాతంగా మారిందని సమావేశం అభిప్రాయపడింది.

మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత కె.కేశవరావు సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, పి.రాములు, దయాకర్,   మాలోత్‌ కవిత, వెంకటేశ్‌ నేత, ఎం.శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement