TRS parliamentary
-
'ప్లాన్'తో పంటలేద్దాం..
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పంటలు, వాతావరణ వైవిధ్యం ఉంటుంది. కేంద్రం వార్షిక ప్రణాళికను ప్రకటిస్తే రాష్ట్రం కూడా కేంద్రం ప్రకటించిన వార్షిక ప్రణాళికకు అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహిస్తుంది. ఆహార ధాన్యాల సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ, అస్పష్ట విధానాలు తెలంగాణ రైతాంగానికి, దేశంలో వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారాయి. దీనిపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కనీస మద్దతు ధరతో పాటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి వార్షిక ప్రణాళికను ప్రకటించాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్రం వార్షిక ప్రణాళికను ప్రకటిస్తే దానికనుగుణంగా పంటలు సాగు చేద్దామన్నారు. ఆహార ధాన్యాల సేకరణ అంశంలో కేంద్రానికి సమగ్ర జాతీయ విధానం ఉండాలని, ధాన్యం సేకరణలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం వర్తింపజేయాలని కూడా డిమాండ్ చేయాలని చెప్పారు. వ్యవసాయ అంశాలపై కేంద్రం ఏర్పాటు చేయనున్న కమిటీ త్వరగా ఏర్పాటయ్యేలా ఒత్తిడి చేయాలని సూచించారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు అంశంపై పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. యాసంగి పనులు ప్రారంభమైన నేపథ్యంలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్రం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరి సరికాదు ‘రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించడం ఒక్కరోజులో అయ్యే పనికాదు. ఇది ఒక క్రమ పద్ధతిలో జరగాల్సిన ప్రక్రియ. వానాకాలం వరి సాగు విస్తీర్ణం విషయంలో కేంద్రం రోజుకో మాటతో కిరికిరి పెడుతోంది. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి గాను కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నులు (40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం) మాత్రమే సేకరిస్తామని పాత పాట పాడుతోంది. రాష్ట్ర మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యింది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల బృందం కేంద్ర అధికారులను కలిసింది. అయినా కేంద్రం ఎటూ తేల్చకపోవడం సరికాదు..’అని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టే విద్యుత్ చట్టంపై, విభజన హామీలపై గట్టిగా ప్రశ్నించాలని సూచించారు. రైతుల పక్షాన గళం విప్పాల్సిందే.. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో రైతుల పక్షాన గళం వినిపించాలని టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం నిర్ణయించింది. వార్షిక ధాన్యం సేకరణ కేలండర్‌ను విడుదల చేయాలన్న సీఎం డిమాండ్‌ను అభినందిస్తూ, కేంద్రం అనుసరిస్తున్న ఆయోమయ విధానంపై పోరాడాలని నిర్ణయించింది. ధాన్యం దిగుబడిలో తెలంగాణ రైతాంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా.. కేంద్రం వైఖరి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అశనిపాతంగా మారిందని సమావేశం అభిప్రాయపడింది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కె.కేశవరావు సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, పి.రాములు, దయాకర్, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, ఎం.శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
మా హక్కులకు భంగం వాటిల్లితే న్యాయ పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: ‘‘కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు, హక్కులకు ఏమాత్రం భంగం కలిగినా ఉపేక్షించేది లేదు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తీసుకునేలా కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఇంజనీర్లు అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రం హక్కులు, దక్కాల్సిన వాటాల్లో ఎలాంటి అన్యాయం జరిగినా న్యాయ పోరాటం చేస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేసినట్టు తెలిసింది. రాజ్యాంగ స్ఫూర్తికి, విభజన చట్టానికి భిన్నంగా కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేసి ఉంటే.. అన్ని వేదికలపై నిలదీయాల్సిందేనని పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్రవారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ కూడా హాజరైన ఈ సమావేశంలో.. కృష్ణా జలాలు, బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయంపై పార్లమెంట్లో గట్టిగా తమ వాణిని వినిపించాలని ఎంపీలను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిపే వరకు కొట్లాడాలని సూచించారు. చుక్క నీటి దుర్వినియోగం లేదు కృష్ణా జలాల్లో తెలంగాణకు తొలి నుంచీ అన్యాయం జరిగిందని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గొంతును వినిపించే అవకాశం లేక న్యాయం జరగలేదని, ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. జల వివాదాలు తలెత్తినప్పుడు కేంద్రం ఇరు రాష్ట్రాలను కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేయాల్సిందిపోయి చోద్యం చూస్తూ కూర్చుందని, అందుకే సమస్యలు జటిలం అవుతున్నాయని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కృష్ణా నీళ్లను వాడుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ చేస్తున్న ఆరోపణలు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంగా తెలంగాణపై చేసిన ఫిర్యాదులపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ‘‘రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటాల్లోంచే నీటిని వినియోగించుకుంటున్నాం. అదనంగా ఒక్క చుక్క నీటిని వాడుకోవడం లేదు. దుర్వినియోగం చేయడం లేదు. తెలంగాణ అక్రమంగా నీటిని వినియోగిస్తోందన్న వాదన అబద్ధం. సాగునీటి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ కోసమే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తున్నాం. ఎత్తిపోతల పథకాలు నడపాలన్నా, సాగుకు నీరు అందించాలన్నా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నుంచి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయడం తప్ప మార్గం లేదు. కానీ ఈ అంశాన్ని వక్రీకరించి తెలంగాణను బద్నాం చేస్తున్నారు..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు వెల్లడించాయి. అదనంగా నీటిని వాడుకునేలా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారనే అభిప్రాయం తప్పు అని.. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోల ఆధారంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్న అంశాన్ని తెలియజెప్పాలని ఎంపీలకు కేసీఆర్ సూచించినట్టు సమాచారం. ఇక కేంద్రం పేర్కొన్న కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం ప్రస్తావనకు రాగా.. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాలు, రాష్ట్రం హక్కులపై పార్లమెంట్లో గట్టిగా గొంతు వినిపించాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాక మూడు, నాలుగు రోజుల్లో ఢిల్లీకి వస్తానని.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తానని ఎంపీలకు చెప్పినట్టు సమాచారం. -
పార్లమెంట్లో ఆందోళనపై వెనక్కి తగ్గిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్లో ఆందోళనల విషయంలో టీఆర్ఎస్ వెనక్కి తగ్గింది. స్పీకర్ నిర్ణయానికి అనుగుణంగా సభలో వ్యవహరించాలని నిర్ణయించింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎంపీలు సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సోమవారం ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో.. కేంద్రంపై వివిధ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు వస్తే పాల్గొనాలని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. అలాగే అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ భేటీలో ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కవిత, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్రాలకే కేటాయించాలంటూ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. దీంతో లోక్ సభ సమావేశాలకు అంతరాయం కలగడంతో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే సభ వాయిదా పడుతూ వస్తోంది. -
నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. ఈ నెల 5 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి హాజరు కావాలని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. -
టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష ఉపనేతగా వినోద్
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష ఉపనేతగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ ఎంపికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎంపీల సమావేశంలో పార్లమెంటరీ పదవులను కేసీఆర్ భర్తీ చేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ నేతగా కె.కేశవరావు, లోక్సభాపక్షనేతగా మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఎంపికయ్యారు. లోక్‌సభ నేతగా వినోద్‌కుమార్‌ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా, సామాజిక సమీకరణలు అడ్డు పడినట్లు సమాచారం. ఇప్పటికే వెలమ సామాజికవర్గం నుంచి కేసీఆర్ సీఎంగా, హరీశ్‌రావు, కేటీఆర్‌లు మంత్రులుగా ఉన్నారు. అదే సామాజికవర్గానికి చెందిన వినోద్‌కుమార్‌కు కులం అడ్డుగా నిలిచినట్లు సమాచారం. ఢిల్లీలో టీఆర్ఎస్కు పెద్దదిక్కుగా ఉన్న వినోద్‌కుమార్ సేవలను ఎలాగైనా వినియోగించుకోవాలనే నిర్ణయంతోనే కేసీఆర్ ఆయనకు ఉపనేత పదవి కట్టబెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు జిల్లాకు కేంద్ర మంత్రి పదవులు లభించినప్పటికీ, లోకసభ ఉపనాయకుడి పదవి దక్కడం ఇదే మొదటిసారి. వరంగల్ జిల్లాకు చెందిన వినోద్‌కుమార్ కరీంనగర్‌లోనే జన్మించారు. హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా తొలిసారి గెలిచిన ఆయన 2009లో కేసీఆర్ ఖాళీ చేయడంతో కరీంనగర్ లోకసభ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరోసారి ఇటీవలి ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నుంచి పోటీచేసి ఘన విజయం సాధించారు.