సాక్షి, హైదరాబాద్: ‘‘కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు, హక్కులకు ఏమాత్రం భంగం కలిగినా ఉపేక్షించేది లేదు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తీసుకునేలా కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఇంజనీర్లు అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రం హక్కులు, దక్కాల్సిన వాటాల్లో ఎలాంటి అన్యాయం జరిగినా న్యాయ పోరాటం చేస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేసినట్టు తెలిసింది. రాజ్యాంగ స్ఫూర్తికి, విభజన చట్టానికి భిన్నంగా కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేసి ఉంటే.. అన్ని వేదికలపై నిలదీయాల్సిందేనని పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్రవారం ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్ కూడా హాజరైన ఈ సమావేశంలో.. కృష్ణా జలాలు, బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయంపై పార్లమెంట్‌లో గట్టిగా తమ వాణిని వినిపించాలని ఎంపీలను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిపే వరకు కొట్లాడాలని సూచించారు.
చుక్క నీటి దుర్వినియోగం లేదు
కృష్ణా జలాల్లో తెలంగాణకు తొలి నుంచీ అన్యాయం జరిగిందని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గొంతును వినిపించే అవకాశం లేక న్యాయం జరగలేదని, ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. జల వివాదాలు తలెత్తినప్పుడు కేంద్రం ఇరు రాష్ట్రాలను కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేయాల్సిందిపోయి చోద్యం చూస్తూ కూర్చుందని, అందుకే సమస్యలు జటిలం అవుతున్నాయని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కృష్ణా నీళ్లను వాడుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ చేస్తున్న ఆరోపణలు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంగా తెలంగాణపై చేసిన ఫిర్యాదులపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
‘‘రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటాల్లోంచే నీటిని వినియోగించుకుంటున్నాం. అదనంగా ఒక్క చుక్క నీటిని వాడుకోవడం లేదు. దుర్వినియోగం చేయడం లేదు. తెలంగాణ అక్రమంగా నీటిని వినియోగిస్తోందన్న వాదన అబద్ధం. సాగునీటి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ కోసమే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తున్నాం. ఎత్తిపోతల పథకాలు నడపాలన్నా, సాగుకు నీరు అందించాలన్నా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నుంచి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయడం తప్ప మార్గం లేదు. కానీ ఈ అంశాన్ని వక్రీకరించి తెలంగాణను బద్నాం చేస్తున్నారు..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు వెల్లడించాయి. అదనంగా నీటిని వాడుకునేలా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారనే అభిప్రాయం తప్పు అని.. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోల ఆధారంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్న అంశాన్ని తెలియజెప్పాలని ఎంపీలకు కేసీఆర్ సూచించినట్టు సమాచారం. ఇక కేంద్రం పేర్కొన్న కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం ప్రస్తావనకు రాగా.. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాలు, రాష్ట్రం హక్కులపై పార్లమెంట్‌లో గట్టిగా గొంతు వినిపించాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాక మూడు, నాలుగు రోజుల్లో ఢిల్లీకి వస్తానని.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తానని ఎంపీలకు చెప్పినట్టు సమాచారం.
మా హక్కులకు భంగం వాటిల్లితే న్యాయ పోరాటమే!
Published Sat, Jul 17 2021 1:33 AM | Last Updated on Sat, Jul 17 2021 9:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment