ప్రత్యామ్నాయ పంటలే మేలు
అనంతపురం అగ్రికల్చర్: తేమ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ రైతులకు సూచించారు. చాలా మండలాల్లో భూములు ఖాళీగా ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగు అంతో ఇంతో దిగుబడులు రావడంతో పాటు పశుగ్రాసం లభిస్తుందన్నారు. ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు ఇస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకుని పంటలు వేసుకోవాలన్నారు.
కొర్రలు
+ ఎకరాకు 2 కిలోల కొర్రలు అవసరం. సాళ్ల మధ్య 20 నుంచి 22 సెంటీమీటర్లు (సెం.మీ), మొక్కల మధ్య 7.5 సెం.మీ దూరం ఉంచి విత్తుకోవాలి. ఎకరాకు 35 కిలోల యూరియా, 50 కిలోల సూపర్‌పాస్ఫేట్ వేయాలి. యూరియాను రెండు భాగాలుగా చేసుకుని విత్తేసమయంలో సగం, విత్తిన 25 రోజుల తర్వాత మిగతా సగం వేసుకోవాలి.
పెసలు
+ ఎకరాకు 6 నుంచి 7 కిలోల పెసలు అవసరం. వరుసల మధ్య 30 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి. భూసారాన్ని బట్టి ఎకరాకు 20 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్‌పాస్ఫేట్ వేయాలి. విత్తిన 20 నుంచి 30 రోజల సమయంలో కలుపు లేకుండా తీసివేయాలి. తొలిదశలో రసంపీల్చు పురుగులు, పూత, కాయ దశలో మారుకామచ్చల పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. పెసరలో కందిని 7 :1 లేదా 15 :1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకున్నా అదనపు ఆదాయం వస్తుంది.
అలసందలు
+ ఎకరాకు 8 నుంచి 10 కిలోల అలసందలు అవసరం. వరుసల మధ్య 30 నుంచి 45 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేయాలి.
ఉలవ
+ వాతావరణ పరిస్థితులు, వర్షం అనుకూలించని సమయంలో చివరగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉలవ పంట వేసుకోవాలి. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరం. గొర్రు ద్వారా 30 (ఇంటు) 10 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 8 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్‌పాస్ఫేట్, 15 కిలోల పొటాష్ ఎరువు విత్తే ముందు వేసుకోవాలి.
అనుములు
+ అనుములు వేయాలనుకుంటే ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరం, సాళ్ల మధ్య ఒక సెం.మీ, మొక్కల మధ్య 1.5 సెం.మీ దూరంలో వేయాలి. 5 శాతం వేపగింజల కషాయం పూత, కాయ దశలో పిచికారీ చేసుకుంటే చీడపీడలు, తెగుళ్లను నివారించుకోవచ్చు.
స్వల్పకాలిక కంది రకాలు
+ ఆగస్టులో స్వల్పకాలిక కంది రకాలు వేసుకోవచ్చు. వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ దూరం పాటించాలి. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం. ఎకరాకు 20 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్‌పాస్ఫేట్ వేయాలి. సెప్టెంబర్‌లో వెర్రితెగులు ఆశించిన మొక్కలను గమనించి తీసేయాలి. పూత, కాయ దశలో మారుకామచ్చ తెగులు ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు 1 మి.లీ నొవాల్యురాన్ లేదా 2 మి.లీ క్లోరోఫైరిపాస్‌కు 1 మి.లీ డైక్లోరోవాస్‌తో లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. శనగపచ్చ పురుగు నివారణకు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వస్తాయి.