గత ఎన్నికల ముందు కాలవ శ్రీనివాసులు కనికట్టు
కల్యాణ మండపాల నిర్మాణమంటూ హడావుడి శంకుస్థాపనలు
శిలాఫలకాలతో వల పన్నిన వైనం
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నేడు ఆయా వర్గాలకు మళ్లీ ఎర
తనకు అవకాశమిస్తే పూర్తి చేస్తానంటూ మాయ మాటలు
మళ్లీ మోసపోలేమంటున్న ప్రజలు
ఇది రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో నాయీ బ్రాహ్మణ భవన నిర్మాణం కోసమంటూ టీడీపీ హయాంలో వేసిన వేసిన శిలాఫలకం. సరిగ్గా గత సార్వత్రిక ఎన్నికలు రెండు నెలల్లో జరగబోతున్నాయగా.. అప్పట్లో మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులు హడావుడిగా శిలాఫలకం వేసేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పట్టించుకోకుండా కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కనికట్టు చేసేశారు. ఇదొక్కటే కాదు... పలు వర్గాలను మచ్చిక చేసుకునేందుకు పట్టణంలో అనేక చోట్ల ఇలాగే శిలాఫలకాలతో నాటకాలకు తెరలేపి వలపన్నారు. కానీ, అప్పటికే ఆయన మోసాలతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు.
తనను నమ్మి ఓట్లేసిన పాపానికి నియోజకవర్గ ప్రజలను గతంలో కాలవ శ్రీనివాసులు నిండా ముంచారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినా నియోజకవర్గానికి ఆయన ఒరగ బెట్టిందేమీ లేదు. పైగా టీడీపీ నేతలతో కలిసి దోపిడీలకు తెగబడ్డారు. కావాల్సినంత వెనకేసుకున్నారు. అప్పట్లో ప్రజలపై పచ్చమూకలు దౌర్జన్యాలకు పాల్పడినా అడ్డు చెప్పలేదు. జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తున్నా ఆపలేదు సరికదా.. వారికే వంత పాడారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్నారు.
కుల సంఘాలకు కుచ్చుటోపీ..
మంత్రిగా ఉన్నన్నాళ్లూ నియోజకవర్గాన్ని పట్టించుకోని కాలవ శ్రీనివాసులు.. గత సార్వత్రిక ఎన్నికల ముందు నాటకాలకు తెరలేపారు. ఎలాగైనా ఓట్లు రాబట్టేందుకు కల్యాణ మండపాల పేరుతో డ్రామాలు చేశారు. సరిగ్గా ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉండగా, రాయదుర్గం ముత్రాసు కాలనీ బైపాస్‌రోడ్డు పక్కన షాదీమహల్‌కు, మల్లాపురం లౌఅవుట్ వద్ద రజక భవనానికి, బళ్లారి రోడ్డులో స్వకుళసాలి సమాజ కళ్యాణ మండపానికి శంకుస్థాపనలు చేశారు. ఆర్భాటంగా శిలాఫలకాలు వేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేవలం గంట ముందు కూడా డీ హీరేహాళ్ మండలం ఓబుళాపురం వద్ద గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ఓ నీటి పథకానికి శంకుస్థాపన చేశారంటే ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు ఆయన ఎంతలా యత్నించారో అర్థం చేసుకోవచ్చు. కాలవ మోసాలకు నేటికీ ఆ శిలాఫలకాలు సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి.
మళ్లీ మోసగించేందుకు కుయుక్తులు..
ఎన్నికల సమయంలో నాటకాలు ఆడడం అలవాటుగా మార్చుకున్న కాలవ శ్రీనివాసులు.. నేడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కుయుక్తులకు తెరలేపారు. ఈ సారి గెలిస్తే తప్పకుండా కల్యాణ మండపాలు పూర్తి చేస్తానంటూ కొత్త రాగం అందుకున్నారు. కానీ, ఆయన మోసాలు పసిగట్టిన నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే పూర్తి చేయలేని నిర్మాణాలను.. మళ్లీ గెలిపిస్తే పూర్తి చేస్తామని చెబుతుండడం హాస్యాస్పదమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 650 హామీలిచ్చి, ఆఖరుకు ఆరింటిని కూడా నెరవేర్చని టీడీపీ అధినేత చంద్రబాబు బాటలోనే కాలవ శ్రీనివాసులు ఇంకా నడుస్తుండడం బాధాకరమంటూ నిట్టూరుస్తున్నారు.
కాలవను ఎవరూ నమ్మరు!
గత ఎన్నికల ముందు షాదీమహల్ నిర్మాణానికి కాలవ శ్రీనివాసులు భూమి పూజ చేశారు. ముస్లిం, మైనార్టీలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశపడ్డాం. చివరికి అంతా ఆర్భాటమేనని తేలింది. పైసా నిధులు మంజూరు చేయకుండా మోసం చేశారు. ఇలాగే, శ్మశాన వాటికకు కూడా శిలాఫలకం వేసి చెవిలో పూలు పెట్టారు. నేడు మళ్లీ డ్రామాలాడుతున్న ఆయనను నమ్మేవారు లేరు.
– గోనబావి షర్మశ్, రాయదుర్గం
ఆశలపై నీళ్లు చల్లారు..
కల్యాణ మండపం నిర్మిస్తామని చెప్పి నాయీ బ్రాహ్మణులను కాలవ శ్రీనివాసులు మోసగించారు. శాంతినగర్‌లో శిలాఫలకం వేసినప్పుడు చాలా సంతోషించాం. అంతటితోనే చేతులు దులుపుకుని మా ఆశలపై నీళ్లు చల్లారు. నిధులు మంజూరు చేయకపోవడంతో నేటికీ శిలా ఫలకం ప్రజలను వెక్కిరిస్తోంది.
– రఘురాం, రాయదుర్గం
మాయమాటలతో సరి
టీడీపీ హయాంలో స్వకులశాలి, కుర్నిశాలి, పద్మశాలి కులాల వారి కోసం కల్యాణ మండపాలు నిర్మిస్తామంటూ శిలా ఫలకాలు వేశారు. ఇవి పూర్తయ్యాక ఎంతో ఉపయోగపడతాయని అనుకున్నాం. తీరా చూస్తే అవి ఉత్తుత్తివని తేలింది. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి వంచించడం సరికాదు.
– నగేష్, శాంతినగర్, రాయదుర్గం
Comments
Please login to add a commentAdd a comment