మాట్లాడుతున్న ఎర్రిస్వామిరెడ్డి
అనంతపురం: తమ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులును వైఎస్సార్‌సీపీ నాయకుడు బి.ఎర్రిస్వామిరెడ్డి హెచ్చరించారు. తమ కుటుంబంపై ఆరోపణలు చేసే అర్హత, స్థాయి ఆయనకు లేవన్నారు. అనంతపురంలోని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఐపీ పెట్టిన కణేకల్లు మండలం హనకనహాల్‌కు చెందిన శనగల వ్యాపారి కృష్ణారెడ్డికి ఎర్రిస్వామిరెడ్డి సహకారం ఉందంటూ కాలవ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమ కుటుంబం ఎలాంటిదో ఒకసారి తమ సొంత గ్రామమైన హనకనహాల్‌కు వెళ్లి విచారించుకోవాలని హితవు పలికారు. కృష్ణారెడ్డి చేతిలో మోసపోయిన రైతుల పక్షాన నిలిచి తమ కుటుంబం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలుసుకుని మాట్లాడాలన్నారు.
మా గ్రామంలోని రైతుల కోసం మంత్రి, ఇతర పెద్దలను తన సోదరుడు బి. గురునాథరెడ్డి మాట్లాడి 1,400 సబ్సిడీ విత్తన శనగను ఇప్పించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పని చేసిన కాలవ వాస్తవలు తెలుసుకోకుండా పనికిమాలిన దగుల్బాజీలను పక్కన కూర్చోబెట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. మానసిక స్థితి సరిగాలేని ఎస్సీ వృద్ధ మహిళను బలత్కారం చేసిన కేసులో నిందితులుగా ఉన్న వారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడిన కాలవ... రాజకీయాలకు అనర్హుడన్నారు.
‘విలేకరిగా ఉన్నప్పుడు నీ ఆస్తులు ఎంత? ఈ రోజు నీ ఆస్తులు ఎంత? ఎలా వచ్చాయి., విలువల్లేని నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఎలా?’ అని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలపై ఊరి దేవునికట్ట వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. గ్రామంలో కులాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ తమ కుటుంబాన్ని ఆదరిస్తారని, తాము కూడా అంతేస్థాయిలో అక్కడి ప్రజలకు అండగా ఉంటున్నామని స్పష్టం చేశారు. సమావేశంలో హనకనహాల్‌కు చెందిన పూజారి రామాంజినేయులు, గెలివే అనిల్‌కుమార్, జయరామిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: బాబు అవినీతివల్లే ‘గుండ్లకమ్మ’కు నష్టం
Comments
Please login to add a commentAdd a comment