సాక్షి, కడప/అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : అన్నదాతల్లో విత్తన గుబులు మొదలైంది. సీజన్ ముంచుకొస్తున్నా విత్తన సేకరణ చేయడంలో ఆయిల్‌ఫెడ్, ఏపీ సీడ్స్, హాకా విత్తన సంస్థలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. దీనికితోడు విత్తన ధరలు కూడా పెరిగాయి. ఇది చాలదన్నట్లు పూర్తి ధర చెల్లిస్తేనే సబ్సిడీపై విత్తనాలు ఇస్తామని, ఆ తర్వాత సబ్సిడీని రైతు ఖాతాల్లో జమ చేస్తామని గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లో ఈనెల 25వ తేది నుంచి విత్తనాలు పంపిణీ చేసేందుకు వ్యవసాయాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం వేరుశనగ విత్తనాలను క్వింటాలు రూ. 4600కు సరఫరా చేస్తామని చెబుతోంది. దీంతో పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీ 33 శాతం అంటే రూ. 1518 రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ఏడాది వేరుశనగవిత్తనాలు క్వింటా ధర రూ.3600 ఉండటం గమనార్హం. ఈ ఏడాది రైతుల వద్ద వేరుశనగ విత్తన కాయలు క్వింటా రూ. 3300కు లభ్యమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పోలిస్తే అన్నదాతకు స్వల్పంగా కేవలం రూ. 218 మాత్రమే లబ్ధి చేకూరనుంది. మొత్తం మీద రైతులు విత్తన కాయలు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
విత్తన కేటాయింపులు ఇలా!
జిల్లాలో వేరుశనగ విత్తనాలకు సంబంధించి కే-6 రకం 20 వేల క్వింటాళ్లు, కే-6/కే9 రకాలు 2400 క్వింటాళ్లు, నారాయణి రకం 19 వేల క్వింటాళ్లు, ధరణి 600 క్వింటాళ్లు మొత్తం 42 వేల క్వింటాళ్లు జిల్లాకు కేటాయించారు. గత ఏడాది ఈ సమయానికి విత్తన సేకరణ చేపట్టి మండల కేంద్రాలకు చేర్చే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాది సీజన్ ముంచుకొస్తున్నా ఇప్పటివరకు విత్తన సంస్థలు సేకరణ చేయడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతోపాటు జీలుగలు 6 వేల క్వింటాళ్లు కాగా, కిలో ధర రూ. 30.80, జనుములు వెయ్యి క్వింటాళ్లు కాగా, కిలో ధర రూ. 41.71, పిల్లిపెసర 600 క్వింటాళ్లు కాగా, కిలో ధర రూ. 57.95గా నిర్ణయించారు.
ఈ విత్తనాల ధరలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీని రైతు ఖాతాల్లో జమచేయనుంది. మొత్తం మీద అన్నదాతల స్థితి అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో విత్తనాల పూర్తి ధర చెల్లింపులు రైతులకు భారంగా పరిణమించనుంది. దీనికితోడు విత్తన సేకరణ ఇప్పటికీ జరగకపోవడం, ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో విత్తనం వేస్తేనే పంట వస్తుందనేది రైతుల్లో ఉన్న నమ్మకం. సకాలంలో విత్తనాలు అందుతాయో, లేదోనన్న బెంగ రైతులను పట్టుకుంది. ప్రభుత్వం స్పందించి సకాలంలో విత్తనాలు, విత్తన కాయలు సరఫరాచేసి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విత్తన గుబులు
Published Wed, May 21 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM
Advertisement
Advertisement