వరుస ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలను చవిచూసి సాగులో చతికిలపడ్డ అన్నదాతలు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా కుదేలవుతున్నారు.
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది రైతన్న పరిస్థితి. వరుస ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలను చవిచూసి సాగులో చతికిలపడ్డ అన్నదాతలు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఏటేటా సాగు భారం పెరగడం అన్నదాతను కలవర పరుస్తోంది. ప్రభుత్వం తాజాగా విత్తనాల సబ్సిడీలో భారీగా కోత పెట్టింది. దీంతో సాగుకు సిద్ధపడుతున్న రైతులకు పెరిగిన విత్తనాల ధర పెనుభారమైంది.
ధర పెంచారు.. సబ్సిడీలో కోత పెట్టారు
జిల్లాలో పత్తి తర్వాత అధికంగా పండించేది సోయాబీన్. సోయా విత్తనాల ధరను ప్రభుత్వం అమాంతంగా పెంచేసింది. పెంచిన ధర ప్రకారం రైతన్నపై క్వింటాల్‌కు రూ.2,010 అదనపు భారం పడనుంది. జిల్లాకు ఈ ఏడాది 90వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ లెక్కన రైతులపై సుమారు రూ.18.09 కోట్ల అదనపు భారం పడనుంది. సబ్సిడీలోనూ 2.57శాతం కోత పెట్టారు. కంది విత్తనాల ధర పెంచడమే కాకుండా సబ్సిడీని సుమారు 17శాతం తగ్గించారు. క్వింటాల్ ధరపై రైతులకు రూ.1,050 అదనపు భారం పడనుంది.
జిల్లాకు 400 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరం కాగా, ఈ లెక్కన రైతులపై రూ.4.20 లక్షల భారం పడనుంది. పెసర విత్తనాలపై రూ.9.90 లక్షలు, మినుములపై రూ.2.05లక్షల భారం అదనంగా పడనుంది. మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు విత్తనాలపై క్వింటాల్‌కు రూ.500 సబ్సిడీ ప్రకటించారు. వరి విత్తనాల ధరలు ఈ ఖరీఫ్‌కుగాను పెరిగాయి. ఎంటీయూ 1010, ఎంటీయూ 1001 రకాల ధరలు గతేడాది క్వింటాల్‌కు రూ.2,250 ఉండగా ఈసారి రూ.2,500 వరకు పెరిగాయి. ఎంటీయూ 7029, ఎంటీయూ 1061 ధరలు గతేడాది రూ.2,300 ఉండగా ఈసారి 2,550 వరకు పెరిగాయి. ఆర్‌జీఎల్ రూ.2,600 నుంచి రూ.2,650కి పెరగగా, బీపీటీ రూ.2,800 నుంచి రూ.2,750కి తగ్గింది.
సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకే.
విత్తనాలు కొనాలంటే రైతులు మొదట పూర్తి ధర చెల్లించాలి. ఆ తర్వాత పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. సబ్సిడీ డబ్బులు రైతు ఖాతాలో ఆ తర్వాత జమ అవుతాయి. ఉదాహరణకు.. సోయాబీన్ విత్తనాలు కొనాలంటే మొదట రైతు రూ.7,800 చెల్లించాలి. ఆ తర్వాత రైతు ఖాతాలో ఇందుకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు రూ.2,574 జమ అవుతాయి.