Soy seeds
-
రైతులకు నాణ్యమైన సోయా విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రైతులకు నాణ్యమైన సోయా విత్తనా లు సరఫరా చేస్తున్నామని తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. టెండర్ నిబంధనల ప్రకారమే ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. సోయా విత్తనోత్పత్తిలో కంపెనీలు మోసం చేస్తున్నట్లు వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుడైన వెంకట్రావు విత్తన ఉత్పత్తి, సరఫరాదారుల సంఘం లెటర్ హెడ్‌ను దుర్వినియోగపరుస్తూ, దాని అధ్యక్షుడిగా 3 నెలలు గా ఉన్నతాధికారులు, సంస్థల మీద తప్పుడు ఫిర్యా దులు చేస్తున్నారన్నారు. నకిలీ సోయా విత్తనాలను విత్తన ధ్రువీకరణ సంస్థ ఏనాడూ ధ్రువీకరించలేదన్నారు. సరైన ఆధారాలు, రైతుల పూర్తి చిరునామా, మూలవిత్తనం సరఫరా చేసిన విత్తనట్యాగులతో సహా సమర్పించిన తర్వాత ఆన్లైన్లో మాత్రమే విత్తన క్షేత్రాలను నమోదు చేస్తామని వివరిం చారు. కాబట్టి ఎటువంటి అక్రమాలు జరిగే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. రైతుల ఆధార్ కార్డులు, పట్టా పాస్ బుక్‌లు వారికి తెలియకుండా సేకరించడం జరగని పని అని అన్నారు. విత్తన ధ్రువీకరణను నాలుగైదు అంచెల్లో ఉన్న అధికారులతో కూడిన తనిఖీ బృం దాలతో కలిపి చేస్తారన్నారు. మూడేళ్లుగా 18–20 లక్షల విత్తనాలను మన రాష్ట్రానికే కాకుండా, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సరఫరా చేస్తున్నామన్నారు. -
పెరిగిన విత్తనాల ధరలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది రైతన్న పరిస్థితి. వరుస ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలను చవిచూసి సాగులో చతికిలపడ్డ అన్నదాతలు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఏటేటా సాగు భారం పెరగడం అన్నదాతను కలవర పరుస్తోంది. ప్రభుత్వం తాజాగా విత్తనాల సబ్సిడీలో భారీగా కోత పెట్టింది. దీంతో సాగుకు సిద్ధపడుతున్న రైతులకు పెరిగిన విత్తనాల ధర పెనుభారమైంది. ధర పెంచారు.. సబ్సిడీలో కోత పెట్టారు జిల్లాలో పత్తి తర్వాత అధికంగా పండించేది సోయాబీన్. సోయా విత్తనాల ధరను ప్రభుత్వం అమాంతంగా పెంచేసింది. పెంచిన ధర ప్రకారం రైతన్నపై క్వింటాల్‌కు రూ.2,010 అదనపు భారం పడనుంది. జిల్లాకు ఈ ఏడాది 90వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ లెక్కన రైతులపై సుమారు రూ.18.09 కోట్ల అదనపు భారం పడనుంది. సబ్సిడీలోనూ 2.57శాతం కోత పెట్టారు. కంది విత్తనాల ధర పెంచడమే కాకుండా సబ్సిడీని సుమారు 17శాతం తగ్గించారు. క్వింటాల్ ధరపై రైతులకు రూ.1,050 అదనపు భారం పడనుంది. జిల్లాకు 400 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరం కాగా, ఈ లెక్కన రైతులపై రూ.4.20 లక్షల భారం పడనుంది. పెసర విత్తనాలపై రూ.9.90 లక్షలు, మినుములపై రూ.2.05లక్షల భారం అదనంగా పడనుంది. మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు విత్తనాలపై క్వింటాల్‌కు రూ.500 సబ్సిడీ ప్రకటించారు. వరి విత్తనాల ధరలు ఈ ఖరీఫ్‌కుగాను పెరిగాయి. ఎంటీయూ 1010, ఎంటీయూ 1001 రకాల ధరలు గతేడాది క్వింటాల్‌కు రూ.2,250 ఉండగా ఈసారి రూ.2,500 వరకు పెరిగాయి. ఎంటీయూ 7029, ఎంటీయూ 1061 ధరలు గతేడాది రూ.2,300 ఉండగా ఈసారి 2,550 వరకు పెరిగాయి. ఆర్జీఎల్ రూ.2,600 నుంచి రూ.2,650కి పెరగగా, బీపీటీ రూ.2,800 నుంచి రూ.2,750కి తగ్గింది. సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకే. విత్తనాలు కొనాలంటే రైతులు మొదట పూర్తి ధర చెల్లించాలి. ఆ తర్వాత పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. సబ్సిడీ డబ్బులు రైతు ఖాతాలో ఆ తర్వాత జమ అవుతాయి. ఉదాహరణకు.. సోయాబీన్ విత్తనాలు కొనాలంటే మొదట రైతు రూ.7,800 చెల్లించాలి. ఆ తర్వాత రైతు ఖాతాలో ఇందుకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు రూ.2,574 జమ అవుతాయి. -
సోయా నైఆయా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఖరీఫ్ సీజను ముంచుకొస్తున్నా సబ్సిడీ సోయా విత్తనాల జాడ లేకపోవడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. విత్తుకునే సమయం దగ్గర పడుతున్నా.. విత్తన నిల్వలు జిల్లాకు చేరకపోవడంతో ఈసారి విత్తన పంపిణీలో జాప్యం జరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతులు ఏటా జూన్ మొదటి వారం నుంచి సోయాను విత్తుకుంటారు. ఈసారి వర్షాలు సకాలంలోనే కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అభిప్రాయ పడుతోంది. దీంతో రైతులు విత్తుకునే సమయానికి ఈ విత్తనాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది కూడా విత్తన సరఫరాలో వ్యవసాయ శాఖ విఫలమైంది. సకాలంలో విత్తనాలు అందక సోయా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. సబ్సిడీ విత్తనాలు దొరకక ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలు వెచ్చిం చి విత్తనాలను కొనుగోలు చేశారు. అధికారులు చొరవ చూపని పక్షంలో రైతులు ఈసారి కూడా ఇబ్బందులే ఎదుర్కొనే అవకాశాలున్నాయి. వి త్తనాలు వేసుకునే అదును దాటిపోయే ప్రమాదముందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటం కారణంగా విత్తన సరఫరాకు టెండర్లు పిలవడం, ధర నిర్ణయంలో జాప్యం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 90 వేల క్వింటాళ్ల కేటాయింపులు జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజనులో సుమారు 3.5 లక్షల హెక్టార్లలో సోయా పంట సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా. గతేడాది పత్తిని వేసుకున్న రైతులు సరైన ధర లభించక తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పత్తిని విక్రయిస్తే సాగు ఖర్చులు కూడా రాలేవు. దిగుబడి పడిపోవడం వంటి కారణాలతో పత్తిని సాగు చేసిన రైతులు ఈసారి సోయా వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. దీంతో సోయా విస్తీర్ణం పెరగనుంది. ఈసారి ఖరీఫ్ సీజనుకు 1.05లక్షల క్విం టాళ్ల సోయా విత్తనాలు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం ది. అయితే ఈ ప్రతిపాదనలను తగ్గించి కేవలం 90వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు కేటాయిం చారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని అకోల, నాందేడ్ నుంచి ఈ సోయా విత్తనాలు వస్తుం టాయి. కాగా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా ఈ జిల్లాకు చేరలేదు. రైతులు ముందుగా పూర్తి ధర చెల్లించాలి.. 33 శాతం సబ్సిడీపై సోయా విత్తనాలను సరఫరా చేస్తున్నారు. రైతులు మాత్రం ముందుగా పూర్తి ధర చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయా లి. ఆ విత్తనాలను విత్తుకున్నట్లు వ్యవసాయ శా ఖ అధికారులు ధ్రువీకరించాక సబ్సిడీ మొత్తా న్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ధర క్వింటాలుకు రూ.7,800లుగా నిర్ణయించారు. రెండు ఎకరాలున్న రైతులకు ఒక బస్తా (30కిలోలు) వి త్తనాలు సబ్సిడీపై ఇస్తారు. రెండు నుంచి ఐదు ఎకరాలున్న రైతులకు రెండు బస్తాలు, ఐదెకరా ల పైన భూమి ఉన్న రైతులకు మూడు బస్తాల చొప్పున ఈ విత్తనాలను పంపిణీ చేస్తారు. కా గా, జిల్లాలో విత్తన పంపిణీ బాధ్యతలను నాలు గు నోడల్ ఏజెన్సీలకు అప్పగించారు. నిర్మల్, భైంసా వ్యవసాయ డివిజన్లలో ఏపీ సీడ్స్ ద్వారా పంపిణీ చేస్తారు. అలాగే ఉట్నూర్, కాగజ్‌నగర్ డివిజన్లలో హాకా ద్వారా, ఆదిలాబాద్, ఖానాపూర్ డివిజన్లలో ఆయిల్‌ఫెడ్ ద్వారా పంపిణీ చేస్తారు. ఇచ్చోడ, చెన్నూరు డివిజన్లలో పంపిణీ బాధ్యతలను మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. ఇబ్బంది రాకుండా చూస్తాం.. సోయా విత్తనాలు రైతులకు సకాలంలో అందే లా చర్యలు తీసుకుంటున్నాము. ఈనెల 25వ తేదీ వరకు 50శాతం విత్తనాలు జిల్లాకు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. విత్తనాలు జిల్లాకు చేరిన వెంటనే పంపిణీకి చర్యలు చేపడతాము. ఎన్నికల కోడ్ కారణంగా కొంత జాప్యం జరిగింది.