గజ్వేల్, న్యూస్‌లైన్: విత్తనాలకు ‘సబ్సిడీ’ వర్తింపు వట్టిమాటగానే మిగిలింది. జిల్లాలో అత్యధికంగా సాగుచేసే వరి, మొక్కజొన్న పంటలపై ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. జాతీయ ఆహార భద్రతా పథకం జాబితా నుంచి జిల్లాను తొలగించడంవల్ల వరి విత్తనాలపై సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం.. మొక్కజొన్నకు సైతం అంతంత మాత్రమే రాయితీ ఇస్తోంది. 33 నుంచి 50 శాతం వరకు సబ్సిడీ అందజేస్తున్నామని గొప్పగా చెబుతున్నా వాస్తవ పరిస్థితిల్లో 20 శాతానికి మించడంలేదు. ప్రధానంగా మొక్కజొన్న విత్తనాల పంపిణీ పరిస్థితి అధ్వానంగా మారింది. ఇందులో కొన్ని రకాలు సబ్సిడీపై, ప్రైవేట్ దుకాణాల్లో ఒకే ధరకు లభ్యం కావడం విస్మయం కలిగిస్తోంది. కంపెనీల ప్రయోజనాల కోసమే ఈ తంతు కొనసాగుతుందనే విషయం బయట పడుతోంది.
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సుమారు 5 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇందులో భాగంగానే వరి సుమారు లక్ష హెక్టార్లు, మొక్కజొన్న 1.50 లక్షల హెక్టార్లు, మిగతా విస్తీర్ణంలో పత్తి, కూరగాయలు, ఇతర పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఇందుకోసం అన్ని విత్తనాలు కలుపుకుని వేల క్వింటాళ్ల సబ్సిడీపై పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. వరి విస్తారంగా సాగవుతుందనే సాకుతో జాతీయ భద్రతా పథకం జాబితా నుంచి జిల్లాను తొలగించారు. ఫలితంగా ఈసారి వరి విత్తనాలపై సబ్సిడీ నిలిచిపోయింది. ఈ విషయాన్ని ఈ నెల 15న ‘సబ్సిడీ విత్తుకు మంగళం.. వరి రైతుకు షాక్’ శీర్షికన ‘సాక్షి’ బయటపెట్టిన సంగతి తెలిసిందే. మిగతా విత్తనాలకు సంబంధించి 33 నుండి 50 శాతం సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. 20 శాతం కూడా సబ్సిడీ వర్తించడం లేదు.
మొక్కజొన్న విత్తనాల పరిస్థితీ అంతే..
మొక్కజొన్నకు సంబంధించి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తనాలు, బహిరంగ మార్కెట్‌లో దొరుకుతున్న విత్తనాల్లో కొన్ని రకాలు ఒకే ధర కలిగి ఉండడం గమనార్హం. ఈ విత్తనాలను కిలోకు రూ.25 సబ్సిడీపై అందజేస్తున్నారు. పలు రకాల కంపెనీల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ఇందులో సగం వరకు రకాలు బహిరంగ మార్కెట్‌లో ఒకే ధరకు లభిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. సబ్సిడీపై, బయట మార్కెట్‌లో ఒకే ధరపై విక్రయించడం వల్ల తమకు ఒరిగేదేమిటని రైతులు మండిపడుతున్నారు. మరోపక్క ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బ్రాండెడ్ రకాల సబ్సిడీ తీరు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్రాండెడ్ రకాలకు చెందిన విత్తన ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్ పరిమాణం 5 కిలోలు) ఎమ్మార్పీ రూ.750 నుంచి రూ.650 వరకు ఉన్నాయి.
గతేడాది ఇలా...
గతేడాది ఖరీఫ్‌లో గజ్వేల్ పట్టణంలోని కావేరి ఎక్కా విత్తనాల పంపిణీకి సంబంధించి జ్యోతి, శివ ట్రేడర్‌లు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు. సబ్సిడీపై అందజేసే విత్తనాలను రైతులు పర్మిట్‌లు పొంది ఈ రెండు దుకాణాల్లోనే రూ.525కి పొందాలి. కానీ స్థానికంగా ఉన్న దుకాణదారులు పర్మిట్‌లతో ప్రమేయం లేకుండా ఈ విత్తనాలను ప్యాకెట్‌కు కేవలం రూ.520 లోపే విక్రయిస్తున్నట్లు గజ్వేల్ వ్యవసాయాధికారి ప్రవీణ్‌కుమార్ గుర్తించారు. ఈ మేరకు ఆయా దుకాణాల్లో శనివారం తనిఖీలు నిర్వహించి తక్కువ ధరకు విక్రయిస్తున్న 180 ప్యాకెట్లను సీజ్ చేశారు.
సదరు దుకాణాల్లో ఆ ప్యాకెట్ల అమ్మకాలను నిలిపివేశారు. ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ ధరకు కంటే తక్కువగా ఎందుకు పంపిణీ చేయాల్సి వచ్చింది? వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. దీనిని బట్టి చూస్తే తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడానికి ప్రభుత్వానికి అధిక ధరలను కోడ్ చేసి ఇస్తున్న కంపెనీలు.. బహిరంగ మార్కెట్‌లోకి వచ్చేసరికి ధరను తగ్గించి ఇవ్వడంలో మాయజాలాన్ని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమైంది. ఈసారి కూడా అదే రకమైన మాయాజాలానికి తెరలేవడం గమనార్హం.
‘సబ్సిడీ’ వట్టిమాటే!
Published Sat, May 24 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement
Advertisement