వేరుశెనగకు డిమాండ్ కొంతే
Published Sat, Jun 3 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM
– ఇప్పటి వరకు పంపిణీ 13065 క్వింటాళ్లు మాత్రమే
కర్నూలు(అగ్రికల్చర్): సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగకు డిమాండ్ కనిపించడం లేదు. జిల్లాలో మే 30 నుంచి వేరుశెనగ పంపిణీ చేస్తున్నప్పటికి ఇంతవరకు పంపిణీ అయింది కేవలం 13065 క్వింటాళ్లు మాత్రమే. ఖరీప్ సీజన్ ఈ నెల1వ తేదీతో ప్రారంభమైనా ఇంత వరకు చినుకు జాడ లేకపోవడంతో రైతులు సబ్సిడీ వేరుశనగ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఖరీప్ సీజన్‌కు సంబంధించి రైతులకు సబ్సిడీ వేరుశెనగకు నిర్ణయించిన ధర రూ.7700. ప్రభుత్వం దళారీలకు లబ్ధి చేకూర్చేందుకే ధరను ఇలా నిర్ణయించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయ శాఖ కిలో వేరుశెనగ ధర రూ.77 నిర్ణయించి సబ్సిడీ 40 శాతం ఇచ్చింది. కిలోకు సబ్సిడీ రూ.30.80 ఉండగా రైతులు రూ.46.20 చెల్లించాల్సి ఉంది.
మార్కెట్‌లో వేరుశెనగ క్వింటాం ధర రూ.4000 నుంచి రూ.4500 వరకు ఉంది. మార్కెట్ ధర కంటే సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగ ధర ఎక్కువగా ఉండటంతో రైతులు ముందుకు రావడం లేదు. మార్క్‌ఫెడ్, ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్‌లు వేరుశెనగను సరఫరా చేస్తున్నాయి. ఈ ఏజెన్సీలు దళారీలపై ఆధారపడ్డాయి. దీంతో వేరుశెనగ నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యత లేకపోవడం, ధర ఎక్కువగా ఉండటం, అందులోను వర్షాలు లేకపోవడంతో సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగకు డిమాండ్ లేకుండా పోయింది. జిల్లాకు వ్యవసాయశాఖ 60,600 క్వింటాళ్లు కేటాయించింది. అయితే 10 వేల క్వింటాళ్లు బఫర్‌లో ఉంచి మిగిలిన 50,600 క్వింటాళ్లను మండలాలకు కేటాయించారు. కర్నూలు, ఆలూరు, మంత్రాలయం సబ్ డివిజన్‌లలో వేరుశెనగకు డిమాండ్ కనిపించడం లేదు. కాగా పత్తికొండ, ఎమ్మిగనూరుల్లో వేరుశనగ పంపిణీ శనివారం నుంచి మొదలైంది.
Advertisement
Advertisement