కరువు సాయంలో చేతులెత్తేసిన ప్రభుత్వం
పెండింగ్‌లో రెండేళ్ల ఇన్‌పుట్ సబ్సిడీ
ఈ ఏడాది సాయంపై స్పష్టత కరువు
అనంతపురం సెంట్రల్ : ఖరీఫ్ దగ్గర పడుతోంది. రైతు చేతిలో చిల్లిగవ్వ లేదు. సాయం చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. పంట ఏ విధంగా పెట్టాలో తెలియక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే రెండేళ్ల పంట నష్టపరిహారం పెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది కూడా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను రైతులు చవిచూశారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు పాలకులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది. మంగళవారం జరిగే అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు.
సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ ఎప్పటి నుంచి చేపడతారో, సబ్సిడీ ఎంత మేర ప్రకటిస్తారో అధికారులకే తెలియడం లేదు. ఈ నెల 15 నుంచి పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఆదశగా ఏర్పాట్లు జరగడం లేదు. దీంతో సకాలంలో విత్తనం అందుతుందా, అదనులో పంట సాగు చేసుకుంటామా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. మూడేళ్లుగా జిల్లా రైతులు వరుస నష్టాలను చవి చూస్తున్నారు. నష్టపోయిన పంటకు పరిహారం న్యాయబద్ధంగా అందాల్సి ఉండగా, పాలకుల నిర్లక్ష్యం కారణంగా మరుగున పడిపోతోంది. 2013-14 ఖరీఫ్ సీజన్‌లో పంటనష్టపోయిన రైతులకు రూ. 643 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2014-15లో రూ. 559 కోట్లు మంజూరైందని చెబుతున్నా.. పంపిణీ కార్యక్రమం పూర్తి ప్రహసనంగా మారింది. గతేడాది(2015-16) కూడా తీవ్ర వర్షభావంతో రైతన్నలు పంట నష్టపోయారు. నష్టాన్ని అధికారులు అంచనా వేయకపోవడంతో ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు 15వేల హెక్టార్లలో ఉద్యానపంటలు ఎండిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉన్న ఉద్యాన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. గతంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఈ సారి అది కూడా లేదు.
పైసా లేదు..పంట ఎలా?
Published Tue, May 10 2016 3:44 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement