కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగుకు విత్తనాలను సమకూర్చుకోవడం రైతన్నకు భారమవుతోంది. సబ్సిడీ విత్తనాల ధరను మార్కెట్ కంటే ఎక్కువకు నిర్ణయించడం పట్ల వ్యవసాయ శాఖపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా వేరుశనగ విషయంలో రైతులు ముందుగా పూర్తి ధర చెల్లించాలనే షరతు విధించడం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాకు 40 వేల క్వింటాళ్ల వేరుశనగ.. 12 క్వింటాళ్ల మొక్కజొన్న.. 500 క్వింటాళ్ల మినుములు.. 100 క్వింటాళ్ల పెసలు.. 50 క్వింటాళ్ల సద్దలు.. 50 క్వింటాళ్ల ఆముదం.. 4,500 క్వింటాళ్ల దయంచ.. 300 క్వింటాళ్ల పిల్లి పెసరను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు మంజూరయ్యాయి.
గతంలో వేరుశనగకు 30 శాతం సబ్సిడీ ఉండగా.. మిగిలిన విత్తనాలకు 50 శాతం సబ్సిడీ ఇచ్చేవారు. జిల్లాలో కందులు, మినుములు, పెసలు సాగు భారీగా ఉంటోంది. ఈ విత్తనాలకు ఇచ్చే సబ్సిడీని విపత్తు ప్రస్తుతం 33 శాతానికి తగ్గించడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంది ధర కిలో రూ.59గా ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కంటే ఈసారి కంది విత్తనాలు కిలోపై ధర రూపాయి పెరిగింది. అయితే 50 శాతం ఉన్న సబ్సిడీని 33.05 శాతానికి తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మినుములు కిలో ధర గత ఏడాది రూ.58 కాగా.. రూ.74కు పెరిగింది. దీనిపై సబ్సిడీని మాత్రం 50 నుంచి 33.11 శాతానికి తగ్గించడం గమనార్హం. పెసర ధరను కూడా అడ్డగోలుగా పెంచేశారు. గత ఏడాది కిలో పెసర విత్తనాల ధర రూ.68 కాగా.. ఈసారి ధర ఏకంగా రూ.88కు చేరింది.
ఇక వేరుశనగ విషయానికొస్తే.. ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 1.50 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. జిల్లాకు కె6 రకం వేరుశనగ 40 వేల క్వింటాళ్లు మంజూరైంది. మార్కెట్‌లో నాణ్యమైన వేరుశనగ క్వింటాలు ధర రూ.4 వేలలోపే. గత ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ పండించిన రైతుల్లో 80 శాతం మంది రూ.3 వేల లోపు ధరకే అమ్ముకున్నారు. సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగకు మాత్రం పూర్తి ధర రూ.4,600గా నిర్ణయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో సబ్సిడీ 32.61 శాతానికే పరిమితం చేశారు. సబ్సిడీ పోను వేరుశనగ క్వింటాలుకు రూ.3,100 చెల్లించాల్సి ఉంది. సబ్సిడీ పోను మిగిలిన ధరకే మార్కెట్‌లో వేరుశనగ లభిస్తుండటం గమనార్హం.
వేరుశనగకు పూర్తి ధర చెల్లించాల్సిందే...
సబ్సిడీపై వేరుశనగ తీసుకోవాలనుకునే రైతులు ముందుగా పూర్తి ధర అంటే కిలోకు రూ.46 చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. గత రబీలో పప్పుశనగకు కూడా ముందు పూర్తి ధర చెల్లించాలని ప్రకటించడంతో విత్తనాలు తీసుకునేందుకు రైతు లు వెనుకంజ వేశారు. ఖరీఫ్‌కు సంబంధించి వేరుశనగకు ముందు పూర్తి ధర చెల్లించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొనుగోలుకు ఆసక్తి చూపకపోవచ్చని భావిస్తున్నారు.
అప్పుడే నకిలీలు: జిల్లాలో నకిలీ విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీటీ పత్తిలో నకిలీల బెడద గత ఏడాదికంటే ఈసారి రెట్టింపయింది. సాధారణ పత్తి విత్తనాలను ప్రాసెసింగ్ చేసి కలర్ అద్ది ప్యాకింగ్ చేసి బీటీ పేరు 450 గ్రాముల ప్యాకెట్‌ను రూ.830 ప్రకారం అమ్ముతున్నారు. సి.బెళగల్, గూడూరు, కోడుమూరు, దేవనకొండ, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, హాలహర్వి తదితర మండలాల్లోని గ్రామాల్లో నకిలీ బీటీ విత్తనాల వ్యాపారం జోరుగా జరుగుతోంది. జిల్లాకు 8.30 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు మంజూరైనా సంబంధిత కంపెనీలు వీటిని సిద్ధం చేయని పరిస్థితి. ఈ కారణంగా రైతులు నకిలీ విత్తనాల బారిన పడుతున్నారు. నకిలీ విత్తనాలపై నియంత్రణ లేకపోవడం వల్ల ఇప్పటికే కోట్లాది రూపాయల విలువ చేసే నకిలీ బీటీ విత్తనాలు రైతులకు అంటగట్టినట్లు తెలుస్తోంది.
సబ్సిడీ తగ్గించిన వ్యవసాయ శాఖ
Published Wed, May 28 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement