సాక్షి, కర్నూలు : రైతుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి నకిలీ, నాసిరకం విత్తనాలు అంటే ప్రయత్నం చేశారు. అదృష్టం కొద్దీ ఓ రైతు వాటిని గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు నాలుక కర్చుకుని ఆ విత్తనాలు వెనక్కి తీసుకుని మరో కంపెనీతో చర్చించి విత్తనాలు తెప్పించే పనిలో పడ్డారు. జిల్లాలో 2300కు పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి. వీటికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఈ సంఘాలతో వెలుగు ప్రాజెక్టుకు అనుసంధానం చేసి ఇటీవల పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు.
ఈ మేరకు జిల్లాలో పత్తి పండించే మండలాలు హొళగుంద, ఆలూరు, కోసిగి, ఆస్పరి, నందవరం, పెద్దకడుబూరు మండలాల్లోని రైతులకు డీఆర్‌డీఏలోని అగ్రికల్చర్ కన్సల్టెంటివ్ సలహాతో గౌతమి సీడ్స్ సంస్థ కావేరి జాదూ కంపెనీ పత్తివిత్తనాలు 11 క్వింటాళ్లను రూ.10 లక్షల దాకా వెచ్చించి కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా వారం రోజుల క్రితం హొళగుంద మండలానికి 200 ప్యాకెట్ల కావేరి జాదూ పత్తి విత్తనాలు ఒక్కొక్కటి రూ.640 ప్రకారం సంఘంలోని రైతులకు విక్రయించారు.
అయితే భీమప్ప అనే రైతు తన వద్ద ఉన్న కావేరి జాదూ విత్తనాలను, వెలుగు ద్వారా వచ్చిన విత్తనాలను సరిపోల్చి చూశారు. రెండింటి మధ్యా తేడా ఉండటంతో వెంటనే మండల ఏవో నరేంద్రకుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ విత్తనాలను కావేరి జాదూ వారికి వాట్సాప్ ద్వారా పంపించగా అవి నకిలీగా నిర్దారించారు. ఈ విషయాన్ని వెలుగు ఏపీఎం దృష్టికి తీసుకెళ్లగా, మిగిలిన 175 ప్యాకెట్లను వెనక్కి తెప్పించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఈ విషయమై విచారణ నిర్వహించారు. మొత్తంగా వచ్చిన విత్తనాలన్నింటినీ వెనక్కి తెప్పించి సదరు గౌతమ్ సీడ్స్‌కు వెనక్కి ఇచ్చారు. ఈ మేరకు ఆ సంస్థకు చెల్లించిన మొత్తాన్ని సైతం వెనక్కి తీసుకున్నారు. తాజాగా కోరమాండల్ కంపెనీ విత్తనాలు తెప్పించేందుకు డీఆర్‌డీఏ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
ఉద్యోగుల పాత్రపై అనుమానాలు
విత్తన పంపిణీ పారదర్శకంగా నిర్వహించడంతో పాటు, రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు వెలుగు ప్రాజెక్టులో ఆయా శాఖల నుంచి ఒక్కొక్కరిని డిప్యుటేషన్‌పై నియమిస్తారు. అయితే వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఉద్యోగి ఈ విత్తనాలను గుర్తించలేకపోయారంటే అనుమానాలకు తావిస్తోంది. తమకు విత్తనాలు మంచివే చూపించారని, రైతులకు మాత్రం నకిలీవి సరఫరా చేసి ఉంటారని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఈ విత్తనాలను రైతులకు ఉచితంగా ఏమీ ఇవ్వడం లేదు.
మార్కెట్‌రేటు కంటే కాస్త తక్కువగా అందజేస్తున్నారు. అయితే ఇందులోనూ కంపెనీలు కక్కుర్తి పడుతూ రైతులను నిలువునా మోసం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు సదరు కంపెనీపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా విత్తనాలు వెనక్కి ఇచ్చేసి చేతులు దులుపుకోవడంపై అనుమానాలకు తావిస్తోంది. అదృష్టవశాత్తూ ఓ రైతు నకిలీ విత్తనాలను సకాలంలో గుర్తించాడు. లేకపోతే ఆ విత్తనాలతో సాగు చేసి తీవ్రంగా నష్టపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం గాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment