gamyam
-
ఒక్క క్లిక్‌తో.. ఆర్టీసీ బస్సు ఎక్కడుందో చెబుతుంది.. డౌన్లోడ్ ఇలా..
సాక్షి, హైదరాబాద్/ఆఫ్జల్‌గంజ్: లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత సులభతరం చేసేందుకు టీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, వివిధ రకాల ఫీచర్లతో రూపొందించిన ఆర్టీసీ బస్ వెహికల్ ట్రాకింగ్ మొబైల్ యాప్ ‘గమ్యం’ను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ శనివారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ‘గమ్యం’ యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో తిరిగే పుష్పక్, మెట్రో బస్సులతో పాటు దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, జిల్లాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులను కూడా ‘గమ్యం’ యాప్ ద్వారా ట్రాకింగ్ చేయవచ్చు. సుమారు 4,170 బస్సులను వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. ప్రయాణికులు తాము ఎంపిక చేసుకున్న బస్సు ఎక్కడుందో, ఎంతసేపట్లో తాము ఎదురుచూసే బస్‌స్టేషన్‌కు చేరుకుంటుందో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దశలవారీగా ఆర్టీసీలోని అన్ని బస్సులను ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. అక్టోబర్ నాటికి అన్ని బస్సులకు ట్రాకింగ్ సదుపాయం వస్తుందని అధికారులు తెలిపారు. కొత్తగా 776 బస్సులు: ఎండీ సజ్జనార్ ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, ‘గమ్యం’ యాప్ ద్వారా ప్రతి బస్సు వాస్తవ స్థితి కచ్చితంగా తెలుస్తుందన్నారు. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ప్రయాణికుడు తాను ప్రయాణం చేసే బస్సును ప్రతి క్షణం ట్రాక్ చేయవచ్చునన్నారు. ప్రతి రోజూ 45 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రవాణారంగంలో పోటీని ఎదుర్కొనేందుకు అత్యాధునిక హంగులతో రూపొందించిన 776 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. చదవండి: బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు ’’ ‘గమ్యం’ మొబైల్ యాప్‌లో ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడమే కాకుండా, బస్సు నడిపే డ్రైవర్, కండక్టర్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ బస్సు ఎక్కడుందో తెలిసిపోతుంది. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు’’ అని ఎండీ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. రవీందర్, ఈడీలు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, జేడీ (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ పాటిల్, డిజిటల్ ఐటీ కన్సల్టెంట్ దీపా కోడూర్, మ్యాప్ మై ఇండియా ప్రతినిధి హర్మ న్ సింగ్ అరోరా, చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ విజయ పుష్ప, సీఈ రాజశేఖర్, రంగారెడ్డి ఆర్.ఎం. శ్రీ శ్రీధర్ పాల్గొన్నారు. మహిళల భద్రతక ‘ఫ్లాగ్ ఏ బస్’ ఫీచర్ ►మహిళా ప్రయాణికుల భద్రత కోసం గమ్యం యాప్ లో ‘ఫ్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. రాత్రి వేళల్లో బస్టాప్‌లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. ►రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. యాప్‌లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్లో స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్‌ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ►అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉంది. డయల్ 100, 108కి కూడా ఈ యాప్‌ను అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. ►బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహా యం, రోడ్డు ప్రమాదం, తది తర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపో ర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. ►‘TSRTC Gamyam'’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►ఈ యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివ రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ►ఇప్పటికే మొబైల్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్న వాళ్లు అప్డేట్ చేసుకో వడం తప్పనిసరి. -
ఖైదీ, అనగనగా ఒకరోజు, ఓయ్-గమ్యం..
కథలను హీరో చెప్తాడు. హీరోయిన్ చెప్తుంది. కేరెక్టర్ ఆర్టిస్ట్ చెప్తాడు. కాని ఒక్కోసారి రోడ్ కూడా చెప్తుంది.కథ రోడ్ మీద నడుస్తుంది. రోడ్ కథలో పాత్ర అవుతుంది. హాలీవుడ్లో రోడ్ మూవీస్ ప్రత్యేకమైనవి.మన దేశంలో అలాంటి కథలు తక్కువ. కాని తీసిన రోడ్ మూవీస్ ప్రేక్షకులకు నచ్చాయి. నల్లరోడ్డు మీద తెల్ల అక్షరాలతో చెక్కిన కథలు ఇవి. మనిషి ప్రయాణం చేస్తాడు. ఒక్కోసారి తెలిసిన గమ్యం కోసం ప్రయాణిస్తాడు. ఒక్కోసారి తెలియని లక్ష్యం కోసం ప్రయాణిస్తాడు. ఒక్కోసారి భౌతిక ప్రయాణం చేస్తాడు. మరోసారి ఆత్మిక ప్రయాణం చేస్తాడు. ఒక ప్రయాణంలో పరులను తెలుసుకుంటాడు. ఒక ప్రయాణంలో తనను తాను కనుక్కుంటాడు. ఈ మొత్తం ప్రయాణాల్లో ఎవరు తోడు ఉన్నా ఎవరు లేకపోయినా తప్పక ఉండే పాత్ర ఒకే ఒక్కటి.æరోడ్డు. ఆ రోడ్డుకు కథంతా తెలుసు లేదా అదే కథంతా మనకు చెప్తుంటుంది. ఖైదీ పదేళ్ల జైలు శిక్ష అనుభవించి ఆ రోజు విడుదలవుతాడు కార్తి. సాయంత్రం బస్సెక్కి అనాథ శరణాలయంలో ఉన్న కూతురిని మరుసటిరోజు ఉదయం కలవాలి. కాని అతడి వాలకం చూసి పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేస్తారు. అప్పటికే పోలీసులు మరోచోట దాదాపు 900 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకొని ఎస్.పి.ఆఫీస్‌లో దాచి ఉంటారు. వాటి కోసం మాదక ద్రవ్యాల ముఠా ఆ రాత్రి ఎస్.పి. ఆఫీస్ మీద దాడి చేయాలనుకుంటుంది. పోలీస్ ఆఫీసర్లందరూ ఒకచోట పార్టీ చేసుకుంటుంటే వారు తాగే మద్యంలో మాదక ద్రవ్యాలు కలుపుతుంది ముఠా. ఆ మద్యం తాగి ఆఫీసర్లు చావు బతుకుల్లోకి వెళతారు. ఒక్క ఆఫీసరే మద్యం తాగక స్పృహలో ఉంటాడు. అతనికి గత్యంతరం లేక కార్తిని సాయం కోరతాడు. మీడియాకు తెలియకుండా పోలీసులందరికీ వేరే ఊరిలో ఉన్న ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించాలి. అలాగే ఎస్.పి. ఆఫీస్ మీద జరిగే దాడిని ఎదుర్కోవాలి. ఈ రెంటి కోసం మాత్రమే కాకుండా తన కూతురు కోసం కూడా కార్తి చేసే ప్రయాణమే ‘ఖైదీ’. దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆరేడు గంటల్లో జరిగే ఈ కథను ఎంతో బిగువుగా చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. దుర్మార్గం తన లక్ష్యాన్ని చేరే లోపల మంచే తన గమ్యానికి చేరుతుందని ఈ కథ చెబుతుంది. మానవోద్వేగాలు బయల్పడాలంటే మనిషికి ఒక గట్టి ప్రయాణం తగలాలని చెబుతుందీ సినిమా. నిమజ్జనంతో మొదలయ్యి... తెలుగులో ‘రోడ్డు ప్రయాణం’ ప్రధానాంశంగా వచ్చిన సినిమాలలో ‘నిమజ్జనం’ (1979) ను మొదట చెప్పుకోవాలి. ఇందులో మామగారి అస్తికలు గంగలో నిమజ్జనం చేయడానికి భర్తతోపాటు ఎడ్లబండిలో బయలు దేరుతుంది శారద. ఊరి నుంచి చాలా దూరంలో ఉన్న రైలుస్టేషన్కి ఎడ్లబండిలో ప్రయాణం చేయాలి. కాని బండివాడు శారద మీద కన్నేస్తాడు. అస్తికల కుండ నేల జారేలా చేసి భర్తను అది వెతుక్కుంటూ వెళ్లేలా చేసి ఆమెపై అఘాయిత్యం చేస్తాడు. ఈ విషయం ఆమె ఎవరితోనూ చెప్పుకోలేక గంగలో నిమజ్జనం సమయంలో నీట మునిగి ప్రాణాలు వదులుతుంది. తిరుగు ప్రయాణంలో ఒక్కడే వచ్చిన భర్తను చూసి బండివాడు భార్య గురించి వాకబు చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతాడు. పాపభీతితో, పశ్చాత్తాపంతో బండివాడు తాను చేసిన తప్పు ఒప్పుకొని ప్రాణం వొదులుతాడు. నాగార్జున ‘చైతన్య’– వర్మ ‘అనగనగా ఒకరోజు’ ప్రతాప్‌పోతన్ తీసిన ‘చైతన్య’ తెలుగులో పూర్తిస్థాయి రోడ్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో మద్రాసు నుంచి గోవా వరకు ఒక ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో దొంగలు, స్మగ్లర్లు, పోలీసులు, హీరో, హీరోయిన్ అందరూ ఉంటారు. అయితే సరైన కథాంశమే లేదు. ఆ తర్వాత వచ్చిన ఎస్.వి. కృష్ణారెడ్డి ‘గన్ షాట్’(1996) ఒక సైకో నుంచి తప్పించుకోవడానికి హీరో అలీ చేసే రోడ్డు ప్రయాణం కూడా నిరాశ పరిచింది. కాని రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒకరోజు’ హిట్టయ్యింది. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమజంట ఒకరోజులో ఎన్ని అనూహ్య సంఘటనలు ఎదుర్కొందనేది కథ. శ్రీదేవి, వెంకటేశ్‌ల ‘క్షణక్షణం’ కూడా రోడ్ మూవీనే. సంబంధం లేని చోరీ కేసులో తామే నిందితులమని భావించి వీరు అడవుల్లోకి పారిపోతారు. ఆ తర్వాత సిటీకి ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణాల మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఓయ్– గమ్యం తాను ప్రేమించిన అమ్మాయి కేన్సర్ వల్ల మరి కొన్ని రోజుల్లో చనిపోబోతున్నదని తెలిసిన అబ్బాయి ఆమె తన జీవితంలో నెరవేర్చుకోవాలనుకున్న కోరికలు కొన్నింటిని తీర్చడానికి ఆమెను తీసుకొని ప్రయాణం మొదలుపెడతాడు. సిద్ధార్థ, షామిలి నటించిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కాని క్రిష్ తన తొలి సినిమాగా తీసిన రోడ్ మూవీ ‘గమ్యం’ ప్రేక్షకుల, విమర్శకుల మెప్పు పొందింది. ఒక ధనిక కుర్రవాడు శర్వానంద్ తన ప్రియురాలిని వెతుక్కుం టూ చేసే ప్రయాణం ఈ కథ. ఈ ప్రయాణంలో అతడు నిజమైన భారతదేశాన్ని కనుగొంటాడు. జనం ఎలా ఉన్నారో చూస్తాడు. ప్రజల కోసం అడవుల్లో ఉండి పని చేయడం కన్నా ప్రజల మధ్య ఉండి పని చేయడం మంచిదని గ్రహిస్తాడు. క్రిష్‌కు పేరు తెచ్చిన రోడ్ మూవీ ఇది. ఖలేజా త్రివిక్రమ్ తీసిన రోడ్ మూవీ ‘ఖలేజా’ కల్ట్ మూవీగా నిలిచింది. రిలీజైనప్పుడు కన్నా టీవీల్లో ఇది ఎక్కువగా ఆదరణ పొందుతోంది. ‘గమ్యం’ ను పోలిన కథతో తయారైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మనిషి విలువలతో ప్రయాణం చెయ్యాలని చెబుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రేమ కోసం సఫలమైన ప్రయాణం చేయాలని ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చెబుతుంది. ఒక పిల్లవాడితో ఏర్పడిన అనుబంధంతో విలన్ భరతం పట్టడానికి సాయితేజ్ చేసిన ప్రయాణమే ‘సుప్రీమ్’. ముగింపు: కథలన్నీ కంచికి చేరతాయని పెద్దల మాట. ఆ కంచికి చేరడంలో కొన్ని కథలు రోడ్డు మీద జారిపోయి ఉంటాయి. కంచికి పోతూ పోతూ మనకూ తారసపడుతూ ఉంటాయి. అందువల్ల మంచి కథ కోసం రోడ్డు మీద పడి వాటిని పట్టుకోవడంలో తప్పులేదు. రోడ్డుతోపాటు జరిగే ఈ సినీ ప్రయాణం కొనసాగాలి. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
బోల్డ్ కథతో క్రిష్..?
గమ్యం, వేదం లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఘనవిజయం సాధించటంతో స్టార్ లీగ్‌లో చేరిపోయాడు. ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఝాన్సీ లక్ష్మీ భాయ్ కథతో మణికర్ణిక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత క్రిష్ ఓ బోల్డ్ కథతో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. కన్నడ రచయిత బైరప్ప రాసిన పర్వ అనే నవలను సినిమాగా రూపొందించేందుకు క్రిష్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రిష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మహాభారత గాథకు సంబంధించిన పాత్రల నేపథ్యంలో రాసిన పర్వలో పలు వివాదాస్పద విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే కథతో సినిమా రూపొందించే ఆలోచనలో ఉన్నాడట క్రిష్. అయితే క్రిష్ తన తదుపరి ప్రాజెక్ట్‌గానే పర్వను ఎంచుకుంటాడా..? లేక మరో సినిమాను తెర మీదకు తీసుకువస్తాడా చూడాలి. -
ప్రశ్నలోనే బదులు ఉంది... గుర్తుపట్టే గుండెనడుగు...
పాటతత్వం నేను హైదరాబాద్‌కు రావడానికి కారణం సంగీత దర్శకుడు అనిల్. అయితే పాట మీద నాకున్న ఇష్టానికి కారణం సిరివెన్నెల సీతారామశాస్త్రి. వారిద్దరూ కలిసి తొలిసారి చేస్తున్న చిత్రం ‘గమ్యం’. ఓ రోజు అనిల్ స్టూడియోలో ఓ పొడుగాటి పేపర్ చూశాను. బ్లాక్‌పెన్‌తో అర్థం అయి కానట్టుగా ఏదో రాసుంది. పైన చూస్తే ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అనే పేరు బోల్డ్ లెటర్స్‌లో ప్రింట్ అయి ఉంది. అప్పుడే అది శాస్త్రిగారి ‘ఎంత వరకు...’ అనే పాటని అర్థమైంది. ఆ రోజుల్లో ‘ఆత్మసాక్షాత్కార శాస్త్రం’ అనే పుస్తకంలో ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అనే అధ్యాయం చదివాను. ‘ఎంతవరకు...’ అనే పాటలో ప్రతి అక్షరం మనల్ని మనకి పరిచయం చేస్తుంది. చాలా ప్రశ్నలు. చాలా జవాబులు. ఔననిపించే విషయాలు ఇందులో ఎన్నో ఉంటాయి. గొప్ప పాట ప్రపంచానికి తెలియక ముందే నేను విన్నాను అనే సంతోషం అందులోంచి పుట్టిన ఆలోచన. నాలోని మానవతావాదానికి ప్రేరణ. తర్వాత రోజుల్లో శాస్త్రిగారితో నాకున్న పరిచయంతో నేను అడిగిన ప్రశ్నలకు ‘‘నువ్వడిగే ప్రతి ప్రశ్నకీ నీ దగ్గరే జవాబు ఉంటుంది’’అని ఆయన అన్నారు. ఆలోచిస్తే అవును కదా అనిపించింది. ‘‘ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తు పట్టే గుండెన డుగు’’ అని మనకి చెబుతూ ఉంటారు. ‘ఐ సీ హ్యూమన్స్ నాట్ హ్యుమానిటీ’’ ఈ కోట్ విన్నప్పుడల్లా ... ‘మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరూ’ అని పాటలోని ఈ లైన్లు మళ్లీ మళ్లీ గుర్తొస్తాయి. శాస్త్రిగారు ఎప్పుడో చెప్పిన మాట ‘పోయెట్రీ ఈజ్ ఫెల్ట్ బిఫోర్ అండర్స్టుడ్’’ అని పలు సందర్భాల్లో చెప్పేవారు. ‘‘సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలతో విడి విడి రూపాలతో నువ్వే కాదంటున్నది’’ అనే వాక్యాలు ఆ లైన్‌ను ప్రతిబింబిస్తాయి. వేదం చెప్పే మొదటి మాట వెలుగు. ‘నీ ఉనికిని చాటే ఊపిరిలో లేదా గాలీ వెలుతురు’ అని ఆయన మనల్ని ప్రశ్నిస్తారు. పంచభూతాలు నువ్వే కదా అని చెప్పకనే చెబుతారు. పురిటి నొప్పులు తల్లివైతే పోయినప్పుడు కన్నీళ్లు చుట్టూ ఉన్నవాళ్లవి. ఈ రెండిటిలోనూ నీకు బాధ ఉండదనీ, ఆలోచించినప్పుడల్లా ‘అవును’ అనే నిజం తట్టిలేపుతూ ఉంటుంది. ‘‘మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువులు నీలోన లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే రుతువులు నీ భావ చిత్రాలే ’’ ఆయన మన ఇష్టాలను గౌరవిస్తారు. లోపాలను ఎత్తిచూపుతారు. దీన్ని కేవలం పాటగానే విని వదిలేద్దామా, లేదా మనల్ని మనం ప్రశ్నించుకుందామా అని అనుకోకుండా ఉండలేం. మనం నవ్వినా నవ్వలేనిది... ఏడ్చినా ఏడవలేనిది నీడ మాత్రమే... అందుకే మనం చేసే ప్రతి పనికి నీడలే సాక్ష్యాలుగా నిలుస్తాయి. జీవితం పట్ల మనిషి దృక్పథం, ఆలోచన అతనిని నిర్వచిస్తాయి. ఏ భావోద్వేగాలైనా మనం ఏమిటో ఎదుటివారికి పరిచయం చేస్తాయి. ‘‘ఎదురైన మందహాసం నీలోన చెలిమి కోసం మోసం ద్వేషం రోషం నీ నకిలీ మదికి భాష్యం’’ మనలోని ద్వేషం, కోపం, ఆనందం ఇలా..ఎన్ని రకాల పోలికలతో చెప్పినా, మనకు మనమే కనబడతాం. నీలోని భావాలకు నువ్వే అద్దం...నీవే నిదర్శనం. ‘పుటుక చావు రెండే రెండవి నీకవి సొంతం కావు’ అనే లైన్ వేదాంతం నుంచి పుట్టింది కాదు, నిత్యజీవితంలో మనకుండే ప్రశ్న నుంచి పుట్టింది. గమ్యం అంటే చేరడం కాదు. అదే జీవిత గమనం అనే సత్యాన్ని చాలా సరళంగా అర్థమయ్యేట్లు చెప్పారు. ‘‘జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ’’ బ్లాక్ అండ్ వైట్ కళ్లతో ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూస్తుంటాం. మనం ఏ మనిషిని చూసినా, ఏ పనిని గమనించినా మనం ఎక్కడ నిలబడి, ఏ దృక్పథంతో చూస్తున్నామనేదే ముఖ్యం. మన ఉద్దేశం..మన నిర్దేశం కూడా అదే. మన ప్రపంచం, గమ్యం కూడా అదే. ఇలాంటి పాటతో సీతారామశాస్త్రిగారు నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. సేకరణ: శశాంక్.బి - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కృష్ణ చైతన్య, గీత రచయిత -
బాలీవుడ్లో 'కంచె'..?
వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ (రాధకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో తెరకెక్కి, ఘనవిజయం సాధించిన సినిమా 'కంచె'. పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు సౌత్‌తో పాటు నార్త్ ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో సాగే కథ కావటంతో జాతీయ స్థాయిలో కూడా ఈ కథ వర్క్అవుట్ అవుతుందని భావిస్తున్నారు.. బాలీవుడ్ నిర్మాతలు. క్రిష్ కూడా కంచె సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం మంచి ఆఫర్స్ వచ్చినా, రీమేక్ చేయాలనే ఆలోచనతో వాటన్నింటినీ తిరస్కరించాడు. స్టార్ హీరోతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు క్రిష్. బాలీవుడ్లో క్రిష్ తెరకెక్కించిన 'గబ్బర్' సినిమా మంచి వసూళ్లను సాధించింది. దీంతో కంచె సినిమాను కూడా తానే డైరెక్ట్ చేసే ఆలోచనలోఉన్నాడు క్రిష్. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా బాలీవుడ్ వర్షన్లో హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు, నిర్మాణ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్న విషయంపై మాత్రం ఇంకా చెప్పలేదు. గతంలో కూడా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గమ్యం' సినిమాను ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు రీమేక్ చేస్తారన్న వార్తలు బలంగా వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు, మరి కంచె అయినా తెరకెక్కుతుందో.. లేదో.. చూడాలి. -
క్రిష్ నిర్మాతగా తెలుగు సినిమా
సమకాలీన సమస్యలను కథావస్తువులుగా చేసుకుని సినిమాలను తెరకెక్కించే దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్). గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్ చిత్రాలతో తెలుగు చిత్ర సీమలోని మంచి దర్శకుల్లో స్థానం సంపాదించుకున్నారాయన. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్లో ‘గబ్బర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అక్షయ్‌కుమార్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రం నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా చేయడానికి క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే... ఈ సినిమాకంటే ముందు నిర్మాతగా ఓ చిత్రం చేయడానికి క్రిష్ సమాయత్తమయ్యారు. ఇందుకోసం తమిళంలో విజయం సాధించిన ‘శైవం’ సినిమా హక్కులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. బుల్లితెర దర్శకుడైన మలినేని రాధాకృష్ణను ఈ సినిమా ద్వారా తెరకు పరిచయం చేస్తున్నారు క్రిష్.