బాలీవుడ్లో 'కంచె'..?
వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ (రాధకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో తెరకెక్కి, ఘనవిజయం సాధించిన సినిమా 'కంచె'. పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు సౌత్తో పాటు నార్త్ ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో సాగే కథ కావటంతో జాతీయ స్థాయిలో కూడా ఈ కథ వర్క్అవుట్ అవుతుందని భావిస్తున్నారు.. బాలీవుడ్ నిర్మాతలు.
క్రిష్ కూడా కంచె సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం మంచి ఆఫర్స్ వచ్చినా, రీమేక్ చేయాలనే ఆలోచనతో వాటన్నింటినీ తిరస్కరించాడు. స్టార్ హీరోతో భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు క్రిష్. బాలీవుడ్లో క్రిష్ తెరకెక్కించిన 'గబ్బర్' సినిమా మంచి వసూళ్లను సాధించింది. దీంతో కంచె సినిమాను కూడా తానే డైరెక్ట్ చేసే ఆలోచనలోఉన్నాడు క్రిష్.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా బాలీవుడ్ వర్షన్లో హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు, నిర్మాణ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్న విషయంపై మాత్రం ఇంకా చెప్పలేదు. గతంలో కూడా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గమ్యం' సినిమాను ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు రీమేక్ చేస్తారన్న వార్తలు బలంగా వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు, మరి కంచె అయినా తెరకెక్కుతుందో.. లేదో.. చూడాలి.