‘నల్లగొండ దృష్టి’పేరుతో 65వ జాతీయ రహదారిపై కార్యక్రమం
వట్టిమర్తి వద్ద ఆదివారం ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు.. వెంటనే అద్దాలు అందజేత
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహిస్తాం: మంత్రి వెంకట్‌రెడ్డి
చిట్యాల: రోడ్డు ప్రమాదాలకు గల కారణాల్లో డ్రైవర్లకు దృష్టిలోపం ఉండటం కూడా ఒకటి. చాలామంది డ్రైవర్లకు అవగాహన లేక కంటి పరీక్షలు చేయించుకోరు. దాంతో వారికి దృష్టిలోపం ఉన్న విషయం వారికే తెలియదు. ఈ విషయాన్ని గుర్తించిన రోడ్డు రవాణా, పోలీస్ శాఖల అధికారులు.. వైద్యారోగ్య సహకారంతో డ్రైవర్లకు రహదారుల వెంట ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి వెంటనే కళ్లద్దాలు అందిస్తున్నారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో రాష్ట్రంలో మొదటిసారి నల్లగొండ జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ‘నల్లగొండ దృష్టి’పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ దాబా వద్ద ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
వెంటనే అద్దాలు..
కంటి పరీక్షల శిబిరంలో పరీక్ష చార్ట్‌ను ఆహార పదార్థాల మెనూ కార్డు మాదిరిగా ఏర్పాటు చేశారు. రోటి, పరోటా, తందూరి, దాల్ వంటి పేర్లను హిందీలో రాశారు. ఆదివారం వివిధ రాష్ట్రాలకు చెందిన 82 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 32 మందికి కంటి అద్దాలు అందజేశారు.
వీరిలో చాలామంది మొదటిసారి కంటి పరీక్షలు చేయించుకోవటం విశేషం. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల వెంట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అవసరమైన సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment