గుంటూరు / సత్తెనపల్లి: బస్టాపుల్లో ఎప్పటిలానే ఆర్టీసీ బస్సులు వచ్చి ఆగుతాయి. కండక్టర్లు కిందకు దిగి మరీ ప్రయాణికులను దగ్గరుండి బస్సు ఎక్కిస్తారు. వారిలో వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు ఉంటే తమ చేతులనే వారికి ఆసరగా ఇస్తారు. బస్సుకు రైట్ చెప్పాకా టికెట్ కొడుతూనే తమ బస్సుల్లో నిత్యం ప్రయాణించే వారిని చొరవగా పలకరిస్తూ... వారి సాధక బాధకాలు శ్రద్ధగా ఆలకిస్తారు. చక్కని సలహాలతో వారి సమస్యలకు పరిష్కార మార్గమూ సూచిస్తారు. ఎవరు ఎక్కడ చేయి ఎత్తిన కండక్టర్ ఊదె విజిల్‌కు ఏ మాత్రం కాదనకుండా డ్రైవర్ బస్సును ఆపుతాడు. మొత్తం మీద ప్రయాణికులకు ప్రీతిపాత్రమైన డ్రైవర్, కండక్టర్లుగా వారు ఉంటారు. ఇదంతా.... ఆర్టీసీ సంస్థ తమ కండక్టర్లు, డ్రైవర్ల పనితీరును వివరిస్తూ రూపొందించిన ప్రచార చిత్రంలోని సన్నివేశాలు.
అగ్గి మీద గుగ్గిలం
అయితే నిజానికి ఆర్టీసీ బస్సుల్లో ... ముఖ్యంగా తెలుగు వెలుగు బస్సుల్లోని డ్రైవర్లు, కండక్టర్లు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. టికెట్‌కు సరిపడా చిల్లర లేకపోయినా, బస్సు ఆగకముందే సీటు నుంచి లేవకపోయినా, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే డ్రైవర్‌ను ఎవరైనా ప్రశ్నించినా... సదరు కండక్టర్, డ్రైవర్ ప్రయాణికులపై అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఇక బస్సు పూర్తిగా దిగకముందే, ప్రయాణికులు ఎక్కక ముందే బస్సును కదిలిస్తున్నారు. నిర్ణీత స్టేజి దాటిన తర్వాత మధ్యలో ఎవరైనా చెయి ఎత్తితే... బస్సును ఆపే డ్రైవర్లు కొంత మంది మాత్రమేనన్నది ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న ఆరోపణ. ఇలా శృతి మించిన పోతున్న ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తనను గాడిలో పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) నూతన ఎండీ సురేంద్రబాబు తెరపైకి నూతన విధానాన్ని తీసుకువచ్చారు.
ప్రయాణికులకు అండగా.....
వృద్ధులు ఎక్కేటప్పుడు బస్సును ముందుకు కదిలించడం వల్ల పడిపోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో వృద్ధులు గాయాలపాలుకావడంతో పాటు ప్రాణాలు పోయిన సందర్భాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎండీ సురేంద్రబాబుకు అందిన ఫిర్యాదుల్లో భాగంగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రయాణికులతో దురుసుగా, అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేది లేదని, సంస్థ అభివృద్ధికి కారణమైన ప్రయాణికులతో హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. కండక్టర్లు, డ్రైవర్ల ప్రవర్తన పట్ల అభ్యంతరాలు ఉంటే సంబంధిత డిపో మేనేజర్, ఆర్‌ఎంకు, ప్రధాన కార్యాలయంలో 0866 2570005 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
జిల్లాలోనూ అదే పరిస్థితి
ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల దురుసు ప్రవర్తన సంఘటనలు గుంటూరు రీజియన్‌లోనూ ఉన్నాయి. ఇటీవల ఓ ప్రయాణికుడు చేయి ఎత్తితే బస్సు ఆపక పోవడంతో సదరు ప్రయాణికుడు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ మంత్రూనాయక్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ బస్సు డ్రైవర్‌ను రెండు రోజుల పాటు విధుల నుంచి తప్పించారు. ఇలా పలు డిపోల్లో తెలుగు వెలుగు బస్సులలో కండక్టర్లు, ప్రయాణికులు ఘర్షణ పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ ఇచ్చే సమయంలో అసభ్యంగా మాట్లాడుతూ.. బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికులకు సహకరించాల్సిన కండక్టర్లే ఇలా బెదిరింపు ధోరణితో మాట్లాడడంపై వాగ్వాదాలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment