రేపటి నుంచే ఆర్టీసీ బస్సుల్లో..  | Free travel for women in rtc | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే ఆర్టీసీ బస్సుల్లో.. 

Published Fri, Dec 8 2023 4:43 AM | Last Updated on Fri, Dec 8 2023 10:50 AM

Free travel for women in rtc - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఆరు గ్యారంటీలలో రెండింటిని సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా శనివారం నుంచే (ఈనెల 9) అమల్లోకి తేవాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో దీనికి పచ్చజెండా ఊపారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.10 లక్షలకు పెంచే హామీల అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించి, దశలవారీగా పకడ్బందీగా ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ఆలోచనకు వచ్చారు. ఈ భేటీ అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ మీడియాకు వెల్లడించారు.  

ఆరు గ్యారంటీలపై సుదీర్ఘ చర్చ 
కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలపై కేబినెట్‌ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్టు మంత్రులు తెలిపారు. ఈ హామీలను దశలవారీగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని తీర్మానించినట్టు వివరించారు. ఆరు గ్యారంటీలతోపాటు ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలను ఐదేళ్లలోగా నెరవేర్చడమే తమ ప్రభుత్వ కర్తవ్యమన్నారు. ముందుగా ఈ నెల 9వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆధార్, రేషన్‌కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని బస్సుల్లో వెళ్లవచ్చని తెలిపారు. 

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం 
మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చ జరిగిందని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ‘‘2014 నుంచి గురువారం (డిసెంబర్‌ 7వ తేదీ) వరకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏయే ప్రభుత్వ విభాగాలు ఎంత ఖర్చు చేశాయి? దేని కోసం, ఏం ప్రయోజనాల కోసం ఖర్చు చేశాయి? ఆ ఖర్చులతో ఒనగూరిన ప్రయోజనాలేమిటన్న అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు వివరాలు అందజేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఖర్చు, చేకూరిన ప్రయోజనాలు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసేలా అన్ని వివరాలు కావాలని అధికారులను ఆదేశించారు’’ అని మంత్రులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి, గ్యారంటీల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను సేకరించి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు తెలిపారు. గ్రూప్‌–1, 2 పరీక్షల అంశంపైనా కేబినెట్‌ చర్చించినట్టు వివరించారు. 

నేడు విద్యుత్‌ అధికారులతో సమావేశం 
రాష్ట్రంలో రైతులకు, పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్‌ అందించాలని మంత్రివర్గం సమావేశంలో తీర్మానించినట్టు మంత్రులు వెల్లడించారు. ఈ క్రమంలో 2014 నుంచి ఇప్పటివరకు విద్యుత్‌ అంశానికి సంబంధించి చోటు చేసుకున్న తప్పుడు నిర్ణయాలపై చర్చించామని, ఆయా అంశాల్లో అధికారుల వివరణ కోరామని తె లిపారు. శుక్రవారం విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, అధి కారులతో సీఎం రేవంత్‌ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు వివరించారు.

గత పదేళ్లలో విద్యుత్‌కు సంబంధించి అనేక అంశాల్లో తప్పులు జరిగాయని, వాటిని స మీక్షించి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై తగిన నిర్ణయాలు  తీసుకోనున్నట్టు తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా అమలుపైనా చర్చించనున్నట్టు  వెల్లడించారు. 

9న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం 
కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 9వ తేదీన చేపట్టాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు. ఇందుకోసం అసెంబ్లీలో సీనియర్‌ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవడం జరుగుతుందని.. తర్వాత స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం తదితర కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. పూర్తి స్థాయి కేబినెట్‌ కూర్పుపై సీఎం, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. 

రెవెన్యూ గ్రామంగా జయశంకర్‌ ఊరు 
వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి గురువారం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ప్రస్తుతం అక్కంపేట గ్రామం పెద్దాపూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉంది. మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామం–బి లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద  స్మృతి వనం సుందరీకరణ, అభివృద్ధి కోసం ఎకరం భూమి కేటాయిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులను వెంటనే చేపట్టాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement