సాక్షి కడప : ఇతర ప్రాంతాల నుంచి కడపకు విమానంలో వచ్చే వారికి నగరానికి ఎలా చేరుకోవాలన్న దిగులు ఇక నుంచి అవసరం లేదు.సోమవారం నుంచి ప్రయాణికులను ఎయిర్‌పోర్టు నుంచి ఉచితంగా నగరానికి చేర్చాలని ట్రూ జెట్ సంస్థ భావించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిత్యం వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు విమానాల్లో రాకపోకలు సాగిస్తున్నారు.ఎయిర్‌పోర్టు దగ్గర వాహనాలు లేక ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ట్రూజెట్ సంస్థ ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా కడపకు చెందిన శ్రీ సాయి సాంబశివ ట్రావెల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సోమవారం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల (కార్లు) ద్వారా ప్రయాణికులను తీసుకుని గమ్య స్థానాలకు చేర్చనున్నారు.
కడపలో మూడుచోట్ల స్టాపింగ్
ఎయిర్‌పోర్టులో దిగిన ప్రయాణికులను కడపలో ట్రాన్స్‌పోర్టు సంస్థ వాహనాలు మూడుచోట్ల దింపేలా ప్రణాళిక రూపొందించారు. కడప ఐటీఐ సర్కిల్, ఆర్టీసీ బస్టాండు, అప్సర సర్కిల్ వద్ద వదలనున్నారు.అయితే కార్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సంబంధించి రూటు మధ్యలో దిగాల్సి వస్తే నిలబెట్టేలా చర్యలు చేపట్టారు. సోమవారం ట్రూ జెట్ సంస్థ సేల్స్ సౌత్ ఇండియా మేనేజర్ శ్రీనివాసరావు, కడప ట్రూ జెట్ మేనేజర్ భవ్యన్, శ్రీ సాయి సాంబశివ ట్రావెల్స్ యజమాని ద్వారా ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment