ఉచిత ప్రయాణంపై ఆనందం వ్యక్తం చేస్తున్న స్కూల్ విద్యార్థినులు, మహిళలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు మహిళా ప్రయాణికులతో కిటకిటలాడాయి. ‘మహాలక్ష్మి’పథకంలో భాగంగా ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పించడంపై చాలా మంది మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. శాసనసభ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన వెంటనే.. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
బస్సుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణించే అవకాశం ఉన్నందున.. కిక్కిరిసి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు ముందే ఊహించారు. కీలక ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు సమీక్షించారు. అవసరమైతే అదనపు బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో రద్దీపై స్పష్టత ఉండదని.. సోమవారం నుంచి ఉచిత ప్రయాణ ప్రభావం ఎంతనేది తెలుస్తుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పాయింట్ల వద్ద సోమవారం అదనపు సిబ్బందిని పెట్టి బస్సులను, రద్దీని పర్యవేక్షించనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను గుర్తించి.. అంతగా రద్దీ లేని రూట్ల నుంచి వాటివైపు బస్సులను మళ్లించాలని భావిస్తున్నారు.
గుర్తింపు కార్డులు అడగకుండానే..
ఉచిత ప్రయాణ పథకం కేవలం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఉచితంగా ప్రయాణించాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందినవారని ధ్రువపరిచే గుర్తింపు పత్రాలను కండక్టర్లకు చూపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఒక వారం రోజుల పాటు అలాంటి పత్రాల కోసం పట్టుబట్ట వద్దని, మహిళలందరినీ అనుమతించాలని ఆదేశించారు.
దీంతో తొలిరోజున ఎక్కడా గుర్తింపు కార్డులు అడగలేదు. అయితే ఎందరు ప్రయాణికులు, ఎంతెంత దూరం చొప్పున ప్రయాణించారన్న వివరాలను కండక్టర్లు ఎస్‌ఆర్‌లో నమోదు చేసుకున్నారు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి స్మార్ట్ కార్డులు జారీ చేసేవరకు జీరో టికెట్లు జారీ చేయాల్సి ఉండనుంది. జీరో టికెట్‌కు సంబంధించి టిమ్స్‌లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంది.
ఆటోలు, క్యాబ్‌లు, సెట్విన్ బస్సులపై ప్రభావం!
ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు నేపథ్యంలో ఆటోలు, క్యాబ్‌లు, సెట్విన్ బస్సుల్లో వెళ్లేవారు ఆర్టీసీ బస్సులవైపు మళ్లారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిలోనూ కొందరు బస్సులెక్కారు. ఈ పథకం ఆటోలు, క్యాబ్‌లు, సెట్విన్ బస్సులపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ద్విచక్ర వాహనాల వినియోగం తగ్గితే కొంతమేర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయలూ వస్తున్నాయి.
మరోవైపు ఈ పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరుగుతున్నందున.. వీలైనంత తొందరలో కొత్త బస్సులను సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. కొత్త బస్సులు రోడ్డెక్కితే.. ఆర్టీసీ సర్విసులు పెరిగి ప్రైవేటు వాహనాల రద్దీ కొంత తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment