నేటి నుంచే మహిళలకు ఉచిత ప్రయాణం | Free Bus Travel for Woman in Telangana from December 9 | Sakshi
Sakshi News home page

నేటి నుంచే మహిళలకు ఉచిత ప్రయాణం

Published Sat, Dec 9 2023 4:57 AM | Last Updated on Sat, Dec 9 2023 8:40 AM

Free Bus Travel for Woman in Telangana from December 9 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. టీఎస్‌ ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం మధ్యాహ్నం నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నారు. 1.30 గంటల సమయంలో అసెంబ్లీ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆ రెండు కేటగిరీలకు చెందిన బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. కర్ణాటకలో ఇప్పటికే దీనిని అమలు చేస్తున్నారు. సంస్థ ఈడీ మునిశేఖర్, రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలు గురువారం అక్కడ పథకాన్ని పరిశీలించి వచ్చాయి. వారు సమర్పించిన నివేదికపై శుక్రవారం ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయి చర్చించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక తరహాలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ పథకాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ వెంటనే పథకానికి సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వును రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. 

ప్రయాణికుల్లో మహిళల వాటా 45 శాతం
రాష్ట్ర వ్యాప్తంగా మినీ పల్లెవెలుగు, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో, హైదరాబాద్‌ నగరంలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ పథకం అమలవుతుంది. ఈ కేటగిరీలకు సంబంధించిన బస్సులు 7,292 ఉన్నాయి. వీటి ద్వారానే ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. వీటిల్లో నిత్యం దాదాపు 33 లక్షల మంది ప్రయాణిస్తారు. వీరిలో మహిళల వాటా దాదాపు 45శాతం.

ఈ రూపంలో ఇంతకాలం ఆర్టీసీకి వస్తున్న ఆదాయం దాదాపు రూ. 2,200 కోట్ల నుంచి రూ.2,500 కోట్లు. కాగా ఈ ఆదాయం ఇప్పుడు నిలిచిపోనుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరుగుతుందని, నష్టపోయే మొత్తం త్వరలో రూ.3 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నా రు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం రూపంలో ఆర్టీసీ నష్టపోయే మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌ చేయనుంది. 

తెలంగాణ మహిళలకే..: తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో  ఈ వెసులుబాటు రాష్ట్ర సరిహద్దు వరకే ఉంటుంది. సరిహద్దు దాటి ప్రయాణించే దూరానికి టికెట్‌ కొనాల్సి ఉంటుంది. బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధ మహిళలు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వీరితోపాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఈ వెసులుబాటును కల్పించారు.

తెలంగాణ ప్రాంత మహిళలు మాత్రమే ఈ వెసులుబాటు పొందేందుకు అర్హులు. అందుకోసం వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు అని నిర్ధారించే ఆధార్‌కార్డు సహా ఇతర ధ్రువ పత్రాల్లో ఏదో ఒకదాన్ని చూపించాల్సి ఉంటుంది. తొలి వారం రోజులు మాత్రం ధ్రువపత్రంతో సంబంధం లేకుండా మహిళలందరినీ ఉచితంగా అనుమతిస్తారు. ఇక అర్హులైన వారందరికీ మహాలక్ష్మీ స్మార్ట్‌ కార్డులను జారీ చేస్తారు.

అప్పుడు స్మార్ట్‌ కార్డ్‌ చూపితే సరిపోతుంది. స్మార్ట్‌ కార్డులు సిద్ధం అయ్యే వరకు జీరో టికెట్‌లను జారీ చేస్తారు. రోజుకు ఎన్ని జీరో టికెట్లు జారీ చేశారో లెక్కించి ప్రభుత్వానికి నివేదిస్తే, దాని ఆధారంగా రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ఆర్టీసీకి అందుతుంది. జీరీ టికెట్లు జారీ ప్రారంభించేంతవరకు, బస్సుల్లో ప్రయాణించిన మహిళల సంఖ్యను రోజువారీగా లెక్కించి నమోదు చేయాల్సి ఉంటుంది.

కొత్త బస్సులు వచ్చే వరకు సమస్యే: కర్ణాటకలో ఈ పథకం ప్రారంభమైన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగి గందరగోళం నెలకొంది. కర్ణాటకతో పోలిస్తే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల సంఖ్య తక్కువ. అక్కడ బెంగళూరులోనే ఆయా కేటగిరీలకు చెందిన బస్సులు 5వేల వరకు ఉంటే, హైదరాబా ద్‌లో రెండున్నర వేలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రమంతటా ఇదే తరహా పరిస్థితి ఉండటంతో మహిళల రద్దీ పెరిగితే ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మహిళల సంఖ్య పెరిగితే, పీక్‌ అవర్స్‌లో పురుషులు ప్రయాణించటం కష్టంగా మారే పక్షంలో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే అంశాన్ని పరిశీలిస్తామని సజ్జనార్‌ చెప్పారు. ఇప్పటికే బస్‌ పాస్‌లు తీసుకున్న మహిళలకు డబ్బులు వెనక్కివ్వబోమన్నారు.  

కొత్త బస్సులొస్తున్నాయ్‌: సజ్జనార్‌
‘ఇటీవలే 776 కొత్త బస్సులు కొన్నాం. జిల్లాల్లో ఇతర కేటగిరీలో తిరిగిన బస్సుల్లో దాదాపు 1,000 వరకు కన్వర్షన్‌ ద్వారా సిటీ బస్సులుగా మార్చాం. త్వరలో 1,050 కొత్త బస్సులు కొంటున్నాం. మరో 1,000 వరకు ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తున్నాయి. అవసరమైతే మరిన్ని కొత్త బస్సులు కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. ఆర్టీసీ ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని బస్సులు కొనేలా ఏర్పాట్లు చేస్తాం. ఇక డ్రైవర్ల అవసరం కూడా ఉన్నందున భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభిస్తాం. ఈ గొప్ప పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తాం. ప్రజలు కూడా సహకరించాలి..’ అని ఎండీ సజ్జనార్‌ కోరారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement