
సాక్షి, అమరావతి: ఇక లైసెన్సులు లేకుండా వాహనం నడిపినా, అతివేగంతో, మద్యం తాగి డ్రైవ్ చేసినా భారీగా జరిమానాలు చెల్లించాల్సిందే! ఈ మేరకు మోటారు వాహనాల సవరణ బిల్లు–2019లో కేంద్రం నిబంధనలు రూపొందించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం తర్వాత చట్ట రూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులతో కలిసి రవాణా అధికారులు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు రాష్ట్రంలో పరిస్థితులపై ఓ నివేదిక రూపొందించనున్నారు. బిల్లులో ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానా పది రెట్లు వరకు పెంచడంతో ఆ మేరకు వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. ఉల్లంఘనులకు పునశ్చరణ తరగతులను నిర్వహించి, కమ్యూనిటీ సర్వీసు చేసేలా కౌన్సెలింగ్ చేయనుంది.
ఏటా 9 వేల మంది మృతి
రాష్ట్రంలో మొత్తం 90 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిని నడిపే వారిలో 45 శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణా శాఖ సర్వేలోనే తేలింది. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో 9 వేల మంది వరకు మరణిస్తుండగా 30 వేల మంది వరకు క్షతగాత్రులవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సాయం చేసిన వారి వివరాలను ఆస్పత్రులు అడుగుతున్నాయి. మరోవైపు పోలీసులు సాక్ష్యం కోసం ఇబ్బందులు పెడుతున్నారు. నూతన బిల్లు ప్రకారం.. ఆస్పత్రులు క్షతగాత్రులను చేర్చే వారి వివరాలను అడగకూడదు. పోలీసులు ఇబ్బందులకు గురి చేయకూడదు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. రోడ్డు ప్రమాదం జరిగితే.. ఆ రోడ్డు నిర్మాణంలో లోపముంటే కాంట్రాక్టర్ నుంచి అపరాధ రుసుం వసూలు చేయొచ్చు.
రోడ్డు భద్రతా చర్యలకు రూ.50 కోట్లు
గుర్తు తెలియని వాహనాలు ఢీకొని వ్యక్తులు మరణించిన సందర్భాల్లో ఆ వాహనాల సమాచారం దొరకదు. దీంతో బీమా క్లెయిమ్ చేసేందుకు కుదరడం లేదు. ఈ తరహా కేసుల్లో బాధితులు పరిహారం కోసం కలెక్టర్లకు దరఖాస్తు చేసుకునే వీలు కొత్త బిల్లులో కల్పించారు. దీని ప్రకారం.. రూ.2 లక్షల వరకు బాధితులకు పరిహారం అందుతుంది. వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రకారం.. ప్రమాద మృతులకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు అందేలా బిల్లులో పొందుపరిచారు. క్యాబ్‌ల నిర్వాహకుల్ని కూడా చట్టం పరిధిలోకి తెచ్చేలా బిల్లు రూపొందించారు. ఏపీలో క్యాబ్ నిర్వాహకులు ఇష్టారీతిన చార్జీలు వసూలు చేస్తుండటంతో ఛార్జీలను నియంత్రించేలా రాష్ట్ర రవాణా శాఖ నిబంధనలు రూపొందించనుంది. రహదారి భద్రత చర్యలకు గత టీడీపీ ప్రభుత్వం రూ.10 కోట్లే కేటాయించి చేతులు దులుపుకోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.50 కోట్లను కేటాయించింది. స్పీడ్ గన్‌లు, బ్రీత్ ఎనలైజర్లు, ఎన్‌ఫోర్సుమెంట్ పరికరాలు కొనుగోలు చేయడానికి రవాణా శాఖకు అవకాశం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment