Motor Vehicle Amendment Bill
-
హెల్మెట్ పెట్టుకోని వాళ్లకు బంపర్ ఆఫర్!
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంలో తమ రూటే సపరేటు అంటున్నారు భోపాల్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి వ్యాస రచన పోటీలు నిర్వహించి.. విజేతలకు ‘ప్రత్యేక బహుమతులు’ కూడా ప్రదానం చేయనున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వారు... ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ విషయమేమిటంటే... మధ్యప్రదేశ్‌లో శనివారం నుంచి 31 రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హెల్మెట్ ధరించకుండా బైకులు నడపడం, సీటు బెల్టు పెట్టుకోకుండా ప్రయాణించడం తరహా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను గురువారం రోడ్లపై నిలిపివేశారు. అనంతరం వారి చేతిలో పెన్ను- పేపర్ పెట్టి తామెందుకు హెల్మెట్ పెట్టుకోలేదో.. సీటు బెల్టు ఎందుకు ధరించలేదో తదితర కారణాలను వ్యాస రూపంలో రాయాల్సిందిగా కోరారు. వంద పదాల్లో వ్యాసం ముగించాలని.. ఈ పోటీలో అత్యుత్తమ వ్యాసాన్ని ఎంపిక చేసి వారికి హెల్మెట్లను ప్రదానం చేస్తామని చెప్పారు. ఈ విధంగా గురువారం ఒక్కరోజే దాదాపు 150 మంది చేత భోపాల్ ట్రాఫిక్ పోలీసులు వ్యాసం రాయించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి జరిమానా విధించే కంటే.. ఇలా సున్నితంగా అర్థమయ్యేలా చెప్పడమే సులభమైన మార్గంగా తోచిందని డీఐజీ ఇర్షాద్ వలీ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు వాహనదారుల్లో తప్పక మార్పు తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ ‘వ్యాస రచన పోటీ’లకు సంబంధించిన వార్తలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక మోటారు వాహన సవరణ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నిబంధనలు ఉల్లంఘించిన వారి జేబుకు చిల్లులు పడుతున్న సంగతి తెలిసిందే. -
కారు యజమానికి రూ. 9.8 లక్షల జరిమానా
అహ్మదాబాద్ : విలాసవంతమైన పోర్షే కారుతో వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్ లేని కారణంగా అతడి కారును ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఏకంగా రూ. 9.8 లక్షల మేర జరిమానా విధించారు. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాలు... అహ్మబాద్‌లోని హెల్మెల్ క్రాస్‌రోడ్ వద్ద బుధవారం సిల్వర్ కలర్ పోర్షే కారు(911 స్పోర్ట్స్ కారు)ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించడంతో పాటు సరైన పత్రాలు లేకపోవడంతో కారును కాసేపు అక్కడే నిలిపారు. అనంతరం కారుకు సంబంధించిన సమాచారాన్ని చెక్ చేయగా లక్షల్లో జరిమానాలు పేరుకు పోయినట్లు గుర్తించారు. అన్నీ కలిపి దాదాపు 10 లక్షల రూపాయల జరిమానా విధించి.. చలానా చెల్లించిన తర్వాతే కారును తిరిగి ఇస్తామని కారు యజమానికి చెప్పడంతో అతడు బిక్క ముఖం వేశాడు. కాగా ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులు ట్వీట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. ‘అమ్మో ఈ జరిమానాతో మరో కారును కొనుక్కోవచ్చు. బహుశా ఇదే అతిపెద్ద భారీ జరిమానా అనుకుంటా’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మోటారు వాహన సవరణ చట్టం వాహనదారులకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటన గురించి అహ్మదాబాద్ డీఎస్పీ మాట్లాడుతూ... మోటారు వాహన చట్టం ప్రకారం కారును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తికి ఆర్టీవో మెమో ఇచ్చామని పేర్కొన్నారు. బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాతే కారును అతడికి అప్పగిస్తామని తెలిపారు. ఇక జర్మనీకి చెందిన జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే. భారత్‌లోనూ తన మార్కెట్‌ను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో రెండు అధునాతన కార్లను భారత్‌లో ప్రవేశపెట్టింది. ‘911 కార్రెరా ఎస్’ పేరిట విడుదలైన విలాసవంతమైన స్పోర్ట్స్ కారు ధర రూ.1.82 కోట్లు కాగా.. ‘911 కార్రెరా ఎస్ కాబ్రియోలెట్’ పేరుతో విడుదలైన మరో కారు ధర రూ.1.99 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. వెనుక ఇంజిన్ కలిగిన ఈ మోడల్ కార్లు అధునాతనంగా రూపుదిద్దుకుని ఆటో మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. -
ఫైన్ వేసినా.. పగ్గాల్లేవ్..
సాక్షి, హైదరాబాద్ : చేతిలో 2000 సీసీ ఇంజిన్ కారు, కళ్లెదురుగా స్పీడు బ్రేకర్లు లేని రింగు రోడ్డు.. ఇంకేం.. కాళ్ల కింద ఉన్న క్లచ్చును తొక్కి రయ్యిమంటూ వాహనాన్ని దూకించడానికి ఇంతకంటే ఏం కావాలి.. వీటికితోడు చేతిలో డ్రగ్స్ ప్యాకెట్టో, బీరుబాటిలో ఉంటే.. ఆ దూకుడుకు కళ్లెమేయడం అసాధ్యమే. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు చేసే ప్రచారం వీరి చెవికెక్కదు. గమ్యస్థానాలకు చేరే లోపు ప్రమాదాలు జరుగుతున్నా వీరికి పట్టదు. పలువురు నటులు, ప్రముఖులు.. వారి పుత్ర రత్నాలు ఇలాగే వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిం చడం, ఓవర్‌స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడటం, చలానా కట్టేయడం. ఎన్ని సార్లు వార్తల్లోకెక్కినా వీరి తీరు మారడం లేదు. కేవలం మరణాలు సంభవిం చినపుడు మాత్రమే ఓవర్‌స్పీడ్‌పై అంతా హడావుడి, అన్ని చోట్ల డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు.. ఆ తర్వాత షరామామూలే.. వేగంగా కారు నడుపుతూ ప్రమాదాలకు కారణమైన వారికి చలానాతోపాటు జైలుకూడా ఉంటేనే వీరికి కళ్లెమేయడం సాధ్యమవుతుందని పోలీసులే అభిప్రాయపడుతున్నారు. వేగం, మద్యం, నిర్లక్ష్యం.. సెప్టెంబర్‌లో కొత్త వాహన సవరణ చట్టం–2019 అమలవుతుందన్న భయంతో తొలుత వాహనదారులు జాగ్రత్తగా నడుచుకున్నారు. ఉల్లంఘనలకు వేలకు వేలు జరిమానాలు విధిస్తారని జంకారు. అయితే, ఆ చట్టం అమలు తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో ఉల్లంఘనులు తిరిగి చెలరేగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వేగమే. అ తర్వాత డ్రంకెన్ డ్రైవ్, డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా ఉండటం వంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్ట వేగ పరిమితి కేవలం 80 కి.మీ. సాధారణ వాహనాల్లో ఈ వేగం దాటితే వాహనంలో మార్పులు వస్తాయి. కానీ, కొంతకాలంగా మార్కెట్లో్లకి వస్తోన్న అధిక సామర్థ్యం, హైఎండ్ వాహనాలు 150 కి.మీ.లు దాటి ప్రయాణించినా పెద్దగా ఇబ్బంది ఉండదు. దీంతో ఈ స్పీడ్‌ను 180 కి.మీ నుంచి 200 కి.మీ. దాకా తీసుకుపోతున్నారు. ఫలితంగా ప్రమాదాలు అనివార్యమవుతున్నాయి. జైలుశిక్ష కూడా విధించాలి.. అతివేగం వల్ల కలిగే అనర్థాలపై ఎంత ప్రచారం చేసినా.. కొందరు ప్రముఖులు వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఓవర్‌స్పీడ్‌కు చలానాలు కడుతున్నారు తప్ప జరిగిన దానికి చింతించడం లేదు. పైగా చాలాసార్లు అవే తప్పులు పునరావృతం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ దాని పరిసరాల్లో ఇలాంటి ఓవర్‌స్పీడ్ మరణాలు సాధారణంగా మారాయి. మితిమీరిన వేగం వాహనం నడిపేవారికి కాదు, రోడ్డుపై వెళ్తున్న వారికీ ప్రమాదమే. అందుకే ఓవర్‌స్పీడ్ విషయంలో భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా ఉండేలా చట్టంలో మార్పులు చేస్తే ఫలితాలు ఉంటాయని తెలంగాణ ఆటోమోటార్స్ వెల్ఫేర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది నమోదైన ఓవర్‌స్పీడ్ కేసుల వివరాలు.. (అక్టోబర్ 31 వరకు) నమోదైన కేసులు: 89,6092 అక్టోబర్ 31న నమోదైన కేసులు: 3,614 రోజుకు నమోదువుతున్న సగటు కేసులు: 2,986 గంటకు నమోదవుతున్న కేసులు దాదాపు: 125 నిమిషానికి నమోదవుతున్న కేసులు: 2.5 అక్టోబర్ 31 వరకు వేసిన చలానాలు: రూ.72.51 కోట్లు రోజుకు సగటున జరిమానాలు: రూ.24.15 లక్షలు భారీ జరిమానాలు విధించే యోచనలో ఉన్నాం.. వాహనదారుల్లో ఉల్లంఘనులు పెరగడం ఆందోళనకర అంశమే. ముఖ్యంగా హైఎండ్ వెహికిల్స్, మోటారు సైకిల్స్ వేగానికి కళ్లెం వేయాల్సిందే. తప్పు చేస్తే కఠినచర్యలు ఉంటాయన్న భయం వాహనదారులకు కలగాలి. ఈ మేరకు కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధించే యోచనలో ఉన్నాం. –పాండురంగ్‌నాయక్, జేటీసీ, ఆర్టీఏ, హైదరాబాద్ -
ఇక్కడ పాత చలాన్లే!
సాక్షి, హైదరాబాద్: కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 దేశవ్యాప్తంగా ఆదివారం అమలులోకి వచ్చింది. కానీ, తెలంగాణలో మాత్రం పోలీసులు ఆదివారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి పాత చలాన్లే విధించారు. కొత్త చట్టం ప్రకారం.. చలాన్లు విధించాలంటూ తమకు రవాణా శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పోలీసులు స్పష్టం చేశారు. జరిమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పైగా కొత్త చలాన్లు ఇప్పటికిప్పుడు అమలు చేస్తున్న పలు రాష్ట్రాల్లో దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందనవస్తుంది? అన్న విషయాలు కూడా అధ్యయనం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మనకు ఇక్కడ పాత జరిమానాలే వర్తించనున్నాయని రవాణా, పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ‘ట్రాఫిక్ రూల్స్ పాటించండి... మీ డబ్బు ఆదా చేసుకోండి’ అనే నినాదంతో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. కొత్త నిబంధనలతో జరిమానాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి.. నిబంధనల్ని పాటిస్తే ఏ మేరకు డబ్బు ‘ఆదా’చేసుకోవచ్చు తదితర విషయాలను వివరిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు రూపొందించి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు సైతం వాహనచోదకుల్ని ఆపి వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్ని తనిఖీ చేస్తున్నారు. ఏదైనా లేకపోతే ప్రస్తుతం ఎంత జరిమానా పడుతోంది, కొత్త యాక్ట్ అమలులోకి వస్తే ఏ స్థాయిలో పడుతుంది అనేవి వివరిస్తున్నారు. మరోపక్క వాహనదారులు కూడా ఉల్లంఘనలకు పాల్పడకూడదనే ఉద్దేశంతో డ్రైవింగ్ చేస్తున్నారు. వారం రోజులుగా హెల్మెట్ వినియోగం పెరిగిందని, ఇదే వాహనచోదకులు తీసుకుంటున్న జాగ్రత్తకు నిదర్శనమని ఓ అధికారి తెలిపారు. -
రేపటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి!
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేశారా? ఎంత ఆలస్యమైనా ఈరోజు ఫైల్ చేసేయండి. ఐటీ రిటర్న్ ఈ రోజులోపు సమర్పించకపోతే 10 వేల రూపాయల వరకు జరిమానా కట్టాల్సిరావొచ్చు. ఆదాయ పన్నుపై కేంద్ర ఆర్థిక బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు రేపటి నుంచి (సెప్టెంబర్ 1) అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు రేపటి నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్సీటీసీ సర్వీస్ చార్జీలు అమల్లో రానున్నాయి. దీంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. కాబట్టి వేతన జీవులు కాస్త కేర్‌ఫుల్‌గా ఉండ్సాలిందే. రేపటి నుంచి కొత్తగా అమల్లోకి రానున్నవి ఏంటో చూద్దాం. ఇల్లు కొనుగోలుపై టీడీఎస్ ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్‌ను డిపాజిట్ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ టీడీఎస్‌ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది. రూ. కోటి విత్‌డ్రా చేస్తే ‘ఫైవ్’ పడుద్ది ఒక సంవత్సరంలో ఒక అకౌంట్ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్‌డ్రాయెల్స్ జరిపితే 2 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్ నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్ విధిస్తారు. ఐఆర్సీటీసీ వడ్డన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఇ-టికెట్లపై సర్వీసు చార్జీలను పునరుద్ధరించింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న నాన్ ఏసీ టికెట్‌పై రూ. 15, ఏసీ టికెట్‌పై రూ. 30 సర్వీసు ఛార్జీలను ఐఆర్సీటీసీ వసూలు చేయనుంది. సర్వీస్ ట్యాక్స్ బకాయిలకు చెక్ సేవా పన్ను బాకాయిలను వదిలించుకునేందుకు కొత్త పథకం అమల్లోకి రానుంది. దీని ద్వారా పెండింగ్‌లో ఉన్న సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకుని బయటపడొచ్చు. బీమా డబ్బుకు తప్పదు పన్ను జీవిత బీమా ప్రీమియం గడువు ముగిసిన తర్వాత తీసుకునే నికర సొమ్ముపై 5 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. కొత్త పాన్‌కార్డులు ఆధార్ నంబరుతో పాన్‌కార్డులు లింక్ చేయనివారికి ఆదాయపన్ను శాఖ కొత్త పాన్‌కార్డులు జారీ చేయనుంది. ఉల్లంఘిస్తే బాదుడే సవరించిన మోటారు వాహనాల చట్టం అమల్లోకి రానుంది. ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించే వారు భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 25 వేలు జరిమానా కట్టాల్సి రావొచ్చు. ట్రాఫిక్ రూల్స్ పాటించి డబ్బులు ఆదా చేసుకోవాలని గత కొద్దిరోజులుగా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. (చదవండి: రూల్స్ బ్రేక్ .. పెనాల్టీ కిక్) షాపింగ్.. బ్రీఫింగ్ ఇప్పటివరకు 50 వేల రూపాయలకు పైబడి చేసిన షాపింగ్ గురించి మాత్రమే ఆదాయపన్ను శాఖకు బ్యాంకులు సమాచారం ఇచ్చేవి. టాక్స్ రిటర్న్స్‌లో ఎటువంటి అనుమానం కలిగినా చిన్న ట్రాన్స్క్షన్ గురించి కూడా బ్యాంకులు ఆరా తీసే అవకాశముంది. (ఇది చదవండి: సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!) -
ప్రమాదాలకు చెక్!
రోడ్డెక్కిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా, భద్రంగా మళ్లీ ఇంటికి చేరేందుకు ఉద్దేశించిన మోటారు వాహనాల చట్టం(సవరణ) బిల్లు ఎన్నెన్నో స్పీడ్ బ్రేకర్లను దాటుకుని ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. ఇది చట్టమైతే నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తోటి పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించే వాహనచోదకులకు కఠిన శిక్షలు, జరిమానాలు విధించేందుకు వీలవుతుంది. అలాగే వాహన ఉత్పత్తిదారులకు, రోడ్లు నిర్మించేవారికి కూడా వర్తించే నిబంధనలు దీన్లో పొందు పరిచారు. మన దేశంలో గతంతో పోలిస్తే రవాణా సౌకర్యాల విస్తృతి పెరిగింది. కళ్లు చెదిరే రీతిలో ఆరు లేన్లు, ఎనిమిది లేన్ల రహదారుల్ని నిర్మిస్తున్నారు. వాటిని చూడముచ్చటగా తీర్చి దిద్దుతు న్నారు. వాహనాలన్నీ పెను వేగంతో పరుగులెడుతున్నాయి. కానీ జనం ప్రాణాలే గాల్లో దీపాలవు తున్నాయి. ఏటా సగటున లక్షన్నరమంది పౌరులు దుర్మరణం పాలవుతున్నారు. మన దేశంలో ఉగ్రవాద ఉదంతాల్లో కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువమంది చనిపోతున్నారు. కానీ కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ వరసగా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించాయి. వాటిని నియంత్రించడం తమ పని కాదన్నట్టు ప్రవర్తించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల విషయంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనించి 2014లో సుప్రీంకోర్టే చొరవ తీసుకుని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతను, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తతను తన నివేదికలో నిశి తంగా ఎత్తిచూపింది. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో, కాలం చెల్లిన వాహనాలను నియంత్రించడంలో, ఇతర భద్రతా నిబంధనలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వాలన్నీ ప్రేక్షకపాత్ర వహిస్తు న్నాయని ఆ కమిటీ సోదాహరణంగా చెప్పింది. కానీ చివరకు ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడానికి ఇన్నేళ్లు పట్టింది. రోడ్డు ప్రమాదాల సంఖ్య 2016తో పోలిస్తే కొంతమేరకు తగ్గాయి. అయినా ప్రపంచ దేశాల న్నిటితో పోలిస్తే ఇప్పటికీ రోడ్డు ప్రమాదాలు మన దేశంలోనే అధికం. వాస్తవానికి ఈ విషయంలో చైనా 2006 వరకూ అగ్రస్థానంలో ఉండేది. కానీ ఆ స్థానాన్ని మన దేశం ఆక్రమించింది. నిరుడు దేశవ్యాప్తంగా 4,61,000 ప్రమాదాలు చోటు చేసుకోగా అందులో 1,49,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2017లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 4,65,000 కాగా, ఈ ప్రమాదాల బారినపడి మొత్తం 1,48,000మంది చనిపోయారు. రోడ్డు ప్రమాదాల్లో ఉత్తరప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంటే, ఆ తర్వాత స్థానం గుజరాత్‌ది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లు తదనంతర స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 2017తో పోలిస్తే మృతుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. రోడ్డు ప్రమా దాలను అరికట్టడంలో, ప్రమాదాల్లో గాయపడినవారిని సకాలంలో ఆదుకుని ప్రాణనష్టాన్ని నివా రించడంలో తమిళనాడు కృషి ప్రస్తావించదగింది. ఆ రాష్ట్రంలో ప్రమాదాలు 25 శాతం తగ్గాయి. ఆ మేరకు మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ద్విచక్రవాహనాల వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జాతీయ, రాష్ట్ర రహదారుల కంటే ఇతర రహదారులపైనే అధికంగా చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా నగరాల్లో రోడ్లు విశాలంగా, మెరుగ్గా ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో ఎంతో కొంత మెరుగు. కానీ జిల్లా స్థాయిల్లో అవి అత్యంత అధ్వాన్న స్థితిలో ఉంటాయి. కనుకనే ప్రమాదాల్లో 45 శాతం ఆ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగడం దురదృష్టంగా, తలరాతగా సరిపెట్టుకునే ధోరణి వల్ల కావొచ్చు... ప్రభు త్వాలపై ఒత్తిళ్లు తగినంతగా ఒత్తిళ్లు రావడం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఆగ్రహావేశాలు పెల్లు బుకుతాయి. కారకులైనవారిపై తక్షణ చర్యలుండాలన్న డిమాండ్లు వినబడతాయి. కానీ రహదారుల నిర్మాణంలో, వాటిని మరమ్మతు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్న తీరు మాత్రం సరిగా చర్చకు రాదు. కనుక రోడ్లు ఎప్పటికీ అధ్వాన్నంగానే ఉంటున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా లేనిచోట, ఇరుకిరుగ్గా, గోతులతో ఉండే రహదారుల వద్ద అధికంగా ప్రమాదాలు జరుగుతున్నా యని భద్రతా నిపుణులు చెబుతున్నారు. రోడ్ల నిర్మాణంలో లోపం ఉంటే సంబంధిత కాంట్రాక్టర్‌ను బాధ్యుణ్ణి చేయడం తాజా సవరణ బిల్లు విశిష్టత. అలాగే వాహన చోదకులను క్రమశిక్షణలో ఉంచ డానికి అవసరమైన నిబంధనలున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి విధించే కనీస జరి మానాను రూ. 100 నుంచి రూ. 500కు పెంచారు. ఇది గరిష్టంగా రూ. 10,000. లైసెన్స్ లేకుండా బండి నడిపేవారికి విధించే పెనాల్టీని రూ. 500 నుంచి రూ. 5,000 చేయడం కూడా మెచ్చదగ్గ అంశం. ఇప్పుడున్న చట్టం ప్రకారం తాగి వాహనాలు నడిపేవారికి విధించే జరిమానా రూ. 2,000 కాగా ఇకపై అది రూ. 10,000. ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారికి ఇకపై రూ. 5,000 వడ్డన తప్పదు. ఇవిగాక అనేక రకాల ఇతర ఉల్లంఘనలకు కూడా శిక్షలు, జరిమానాలు ఎక్కువే ఉన్నాయి. అలాగే కొన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించినవారు సామాజిక సేవ చేయడం తప్పనిసరవు తుంది. ఇది కొత్త ప్రయోగం. ప్రజా రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల అనేకులు సొంత వాహనాల వినియోగంవైపు మొగ్గుచూపుతున్నారు. దీన్ని ప్రభుత్వం గుర్తించిందనే చెప్పాలి. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టానికి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాల్ని మెరుగుపర్చడానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఏటా దాదాపు రూ. 3,80,000 కోట్ల మేర నష్టం కలగజేస్తున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఇన్ని దశాబ్దాల తర్వాత ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం. ఇది చట్టమయ్యాక ఆచరణలో ఎదురయ్యే సమ స్యలేమైనా ఉంటే వెనువెంటనే సవరణలు తీసుకొచ్చేందుకు కూడా వెనకాడ కూడదు. అలాగైతేనే పౌరుల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. -
ట్రాఫిక్ ఉల్లం‘ఘనుల’ ఆటలు చెల్లవిక
సాక్షి, అమరావతి: ఇక లైసెన్సులు లేకుండా వాహనం నడిపినా, అతివేగంతో, మద్యం తాగి డ్రైవ్ చేసినా భారీగా జరిమానాలు చెల్లించాల్సిందే! ఈ మేరకు మోటారు వాహనాల సవరణ బిల్లు–2019లో కేంద్రం నిబంధనలు రూపొందించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం తర్వాత చట్ట రూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులతో కలిసి రవాణా అధికారులు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు రాష్ట్రంలో పరిస్థితులపై ఓ నివేదిక రూపొందించనున్నారు. బిల్లులో ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానా పది రెట్లు వరకు పెంచడంతో ఆ మేరకు వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. ఉల్లంఘనులకు పునశ్చరణ తరగతులను నిర్వహించి, కమ్యూనిటీ సర్వీసు చేసేలా కౌన్సెలింగ్ చేయనుంది. ఏటా 9 వేల మంది మృతి రాష్ట్రంలో మొత్తం 90 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిని నడిపే వారిలో 45 శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణా శాఖ సర్వేలోనే తేలింది. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో 9 వేల మంది వరకు మరణిస్తుండగా 30 వేల మంది వరకు క్షతగాత్రులవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సాయం చేసిన వారి వివరాలను ఆస్పత్రులు అడుగుతున్నాయి. మరోవైపు పోలీసులు సాక్ష్యం కోసం ఇబ్బందులు పెడుతున్నారు. నూతన బిల్లు ప్రకారం.. ఆస్పత్రులు క్షతగాత్రులను చేర్చే వారి వివరాలను అడగకూడదు. పోలీసులు ఇబ్బందులకు గురి చేయకూడదు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. రోడ్డు ప్రమాదం జరిగితే.. ఆ రోడ్డు నిర్మాణంలో లోపముంటే కాంట్రాక్టర్ నుంచి అపరాధ రుసుం వసూలు చేయొచ్చు. రోడ్డు భద్రతా చర్యలకు రూ.50 కోట్లు గుర్తు తెలియని వాహనాలు ఢీకొని వ్యక్తులు మరణించిన సందర్భాల్లో ఆ వాహనాల సమాచారం దొరకదు. దీంతో బీమా క్లెయిమ్ చేసేందుకు కుదరడం లేదు. ఈ తరహా కేసుల్లో బాధితులు పరిహారం కోసం కలెక్టర్లకు దరఖాస్తు చేసుకునే వీలు కొత్త బిల్లులో కల్పించారు. దీని ప్రకారం.. రూ.2 లక్షల వరకు బాధితులకు పరిహారం అందుతుంది. వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రకారం.. ప్రమాద మృతులకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు అందేలా బిల్లులో పొందుపరిచారు. క్యాబ్‌ల నిర్వాహకుల్ని కూడా చట్టం పరిధిలోకి తెచ్చేలా బిల్లు రూపొందించారు. ఏపీలో క్యాబ్ నిర్వాహకులు ఇష్టారీతిన చార్జీలు వసూలు చేస్తుండటంతో ఛార్జీలను నియంత్రించేలా రాష్ట్ర రవాణా శాఖ నిబంధనలు రూపొందించనుంది. రహదారి భద్రత చర్యలకు గత టీడీపీ ప్రభుత్వం రూ.10 కోట్లే కేటాయించి చేతులు దులుపుకోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.50 కోట్లను కేటాయించింది. స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, ఎన్ఫోర్సుమెంట్ పరికరాలు కొనుగోలు చేయడానికి రవాణా శాఖకు అవకాశం లభించింది. -
తెలుగు రాష్ట్రాల్లో డిపోల్లోనే నిలిచిన ఆర్టీసీ బస్సులు
-
నేడు దేశవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె
-
ఫిబ్రవరిలో మోటారు వాహనాల సవరణ బిల్లు!
న్యూఢిల్లీ: రహదారి భద్రతలో ప్రపంచస్థాయి ప్రమాణాలను తీసుకొచ్చేలా మోటారు వాహనాల చట్టానికి సవరణపై కేబినెట్ నోట్‌ను ఇప్పటికే పంపామని, ఫిబ్రవరిలో కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ మంగళవారం ఢిల్లీలో తెలిపారు. సవరణ ప్రతిపాదనపై ప్రధాని మోదీ పలు సూచనలు చేశారన్నారు. బిల్లులో వీటినీ పొందుపరిచి చేరుస్తామని ... కేబినెట్ ఆమోదం తర్వాత తదుపరి పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామన్నారు. కాగా, రామసేతును ధ్వంసం చేయకుండానే సేతుసముద్రం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ మార్గంపై అధ్యయనం చేసి అఫిడవిట్ రూపొందించామని, ప్రధాని ఆమోదించాక దాన్ని సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని గడ్కారీ తెలిపారు. పండ్లు, కూరగాయలను రైతులు స్వేచ్ఛగా విక్రయించుకునేలా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టం పరిధి నుంచి వాటిని తప్పించడంపై రాష్ట్రాలను సంప్రదిస్తామని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మంగళవారం తిరువనంతపురంలో తెలిపారు. మరోవైపు జీఎస్టీ అమలుపై రాష్ట్రాలకు ఏడాది సమయాన్ని అదనంగా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.