సాక్షి, హైదరాబాద్ : చేతిలో 2000 సీసీ ఇంజిన్ కారు, కళ్లెదురుగా స్పీడు బ్రేకర్లు లేని రింగు రోడ్డు.. ఇంకేం.. కాళ్ల కింద ఉన్న క్లచ్చును తొక్కి రయ్యిమంటూ వాహనాన్ని దూకించడానికి ఇంతకంటే ఏం కావాలి.. వీటికితోడు చేతిలో డ్రగ్స్ ప్యాకెట్టో, బీరుబాటిలో ఉంటే.. ఆ దూకుడుకు కళ్లెమేయడం అసాధ్యమే. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు చేసే ప్రచారం వీరి చెవికెక్కదు. గమ్యస్థానాలకు చేరే లోపు ప్రమాదాలు జరుగుతున్నా వీరికి పట్టదు. పలువురు నటులు, ప్రముఖులు.. వారి పుత్ర రత్నాలు ఇలాగే వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిం చడం, ఓవర్‌స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడటం, చలానా కట్టేయడం. ఎన్ని సార్లు వార్తల్లోకెక్కినా వీరి తీరు మారడం లేదు. కేవలం మరణాలు సంభవిం చినపుడు మాత్రమే ఓవర్‌స్పీడ్‌పై అంతా హడావుడి, అన్ని చోట్ల డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు.. ఆ తర్వాత షరామామూలే.. వేగంగా కారు నడుపుతూ ప్రమాదాలకు కారణమైన వారికి చలానాతోపాటు జైలుకూడా ఉంటేనే వీరికి కళ్లెమేయడం సాధ్యమవుతుందని పోలీసులే అభిప్రాయపడుతున్నారు.
వేగం, మద్యం, నిర్లక్ష్యం..
సెప్టెంబర్‌లో కొత్త వాహన సవరణ చట్టం–2019 అమలవుతుందన్న భయంతో తొలుత వాహనదారులు జాగ్రత్తగా నడుచుకున్నారు. ఉల్లంఘనలకు వేలకు వేలు జరిమానాలు విధిస్తారని జంకారు. అయితే, ఆ చట్టం అమలు తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో ఉల్లంఘనులు తిరిగి చెలరేగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వేగమే. అ తర్వాత డ్రంకెన్ డ్రైవ్, డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా ఉండటం వంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్ట వేగ పరిమితి కేవలం 80 కి.మీ. సాధారణ వాహనాల్లో ఈ వేగం దాటితే వాహనంలో మార్పులు వస్తాయి. కానీ, కొంతకాలంగా మార్కెట్లో్లకి వస్తోన్న అధిక సామర్థ్యం, హైఎండ్ వాహనాలు 150 కి.మీ.లు దాటి ప్రయాణించినా పెద్దగా ఇబ్బంది ఉండదు. దీంతో ఈ స్పీడ్‌ను 180 కి.మీ నుంచి 200 కి.మీ. దాకా తీసుకుపోతున్నారు. ఫలితంగా ప్రమాదాలు అనివార్యమవుతున్నాయి.
జైలుశిక్ష కూడా విధించాలి..
అతివేగం వల్ల కలిగే అనర్థాలపై ఎంత ప్రచారం చేసినా.. కొందరు ప్రముఖులు వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఓవర్‌స్పీడ్‌కు చలానాలు కడుతున్నారు తప్ప జరిగిన దానికి చింతించడం లేదు. పైగా చాలాసార్లు అవే తప్పులు పునరావృతం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ దాని పరిసరాల్లో ఇలాంటి ఓవర్‌స్పీడ్ మరణాలు సాధారణంగా మారాయి. మితిమీరిన వేగం వాహనం నడిపేవారికి కాదు, రోడ్డుపై వెళ్తున్న వారికీ ప్రమాదమే. అందుకే ఓవర్‌స్పీడ్ విషయంలో భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా ఉండేలా చట్టంలో మార్పులు చేస్తే ఫలితాలు ఉంటాయని తెలంగాణ ఆటోమోటార్స్ వెల్ఫేర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది నమోదైన ఓవర్‌స్పీడ్ కేసుల వివరాలు.. (అక్టోబర్ 31 వరకు)
- నమోదైన కేసులు: 89,6092
- అక్టోబర్ 31న నమోదైన కేసులు: 3,614
- రోజుకు నమోదువుతున్న సగటు కేసులు: 2,986
- గంటకు నమోదవుతున్న కేసులు దాదాపు: 125
- నిమిషానికి నమోదవుతున్న కేసులు: 2.5
- అక్టోబర్ 31 వరకు వేసిన చలానాలు: రూ.72.51 కోట్లు
- రోజుకు సగటున జరిమానాలు: రూ.24.15 లక్షలు
భారీ జరిమానాలు విధించే యోచనలో ఉన్నాం..
వాహనదారుల్లో ఉల్లంఘనులు పెరగడం ఆందోళనకర అంశమే. ముఖ్యంగా హైఎండ్ వెహికిల్స్, మోటారు సైకిల్స్ వేగానికి కళ్లెం వేయాల్సిందే. తప్పు చేస్తే కఠినచర్యలు ఉంటాయన్న భయం వాహనదారులకు కలగాలి. ఈ మేరకు కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధించే యోచనలో ఉన్నాం. –పాండురంగ్‌నాయక్, జేటీసీ, ఆర్టీఏ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment