సాక్షి, చైన్నె: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టేవిధంగా చైన్నె పోలీసులు దూకుడు పెంచారు. గత ఏడు నెలల్లో రూ. 60 కోట్లను చలాన్ల రూపంలో వసూలు చేశారు. అలాగే మద్యం మత్తులో వాహనాలు నడిపిన మందుబాబులకు నుంచి ఏకంగా రూ. 19 కోట్లు రాబట్టారు. వివరాలు.. రాష్ట్ర రాజధాని నగరం చైన్నెలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.
నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే రీతిలో దూకుడు పెంచారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని, ట్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహనదారులను, సిగ్నల్స్‌లో ఆపకుండా ముందుకెళ్లే వారిపై గురి పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు విస్తృతంగా చేస్తున్నారు. అలాగే, రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారు , బైక్ రేసింగ్‌లలో పాల్గొనే వారికి జరిమానాల మోత మోగిస్తున్నారు.
జరిమానాల జోరు..
నగరంలో అనేక కూడళ్లను హెల్మెట్ జోన్లు, స్పీడ్ కంట్రోల్ చెకింగ్ జోన్లుగా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో నిరంతరం దృష్టి సారిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా జరిమానాల మోత మోగిస్తున్నారు. నిఘా నేత్రాల ద్వారా సైతం గురించి మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్ రూపంలో చలానా విధిస్తున్నారు. 32 రకాల నిబంధనలకు జరిమానాలు విధించాల్సి ఉన్నా, ప్రధానంగా ఏడు రకాల నిబంధనలు ఉల్లంఘించే వారిని నుంచి మాత్రమే ప్రసుత్తం ఫైన్ వసూలు చేస్తున్నారు. గత ఏడాది జరిమానాల రూపంలో ట్రాఫిక్ పోలీసు ఖాతాలో రూ. 149 కోట్లు చేరాయి. ఈ ఏడాది ఏడు నెలల్లో రూ. 60 కోట్లను దాటేశారు. ఇందులో మందు బాబుల నుంచి ఎక్కువ మొత్తమే వసూలు చేశారు.
మద్యం సేవించి వాహనాలు నడిపిన 19,765 మందిపై కేసు నమోదు చేసి రూ. 19.76 కోట్లు జరిమానాల రూపంలో వసూళ్లు చేసి ఉన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన 3,61,655 మంది నుండి రూ. 36.16 కోట్లు, ట్రిబుల్స్ డ్రైవింగ్‌లో 8,593 కేసులు నమోదు చేసి రూ. 85.93 లక్షలు, అతి వేగానికి సంబంధించి 2,716 కేసుల్లో రూ. 27.16 లక్షలు, సీటు బెల్ట్ ధరించని 9,101 మంది నుంచి రూ. 91.01 లక్షలు, సిగ్నల్ వద్ద వాహనం ఆపకుండా వెళ్లిన 39,320 మంది నుంచి రూ. 1.96 కోట్లు, కార్లకు బ్లాక్ ఫిల్మ్ అంటించిన 4,284 మంది నుంచి రూ.21.42 లక్షలు వసూలు చేశారు. ఇదే కాకుండా సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన వాహన నెంబర్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా చాలానా విధించారు. వీటి ద్వారా కోట్లాది రూపాయలు వసూలు కావాల్సి ఉంది.
ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా లేదా, ట్రాఫిక్ జరిమాన వసూళ్లు కేంద్రాల ద్వారా వాహన దారులు త్వరితగతిన చెల్లిస్తే మంచిది. లేని పక్షంలో వారి వాహనాలు, లైసెన్స్‌లను సీజ్ చేసే విధంగా ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచనున్నారు. ఇక వాహనదారులు నిబంధనలు సక్రమంగా పాటిస్తే, జరిమానాల మోత మోగించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా వాహన దారులకు మరింత అవగాహన కల్పించే విధంగా రోడ్ సేఫ్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చైన్నె పోలీసుల కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment