Traffic fine
-
వాహనదారుల భరతం పడుతున్న ట్రాఫిక్ పోలీసులు...
సాక్షి, చైన్నె: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టేవిధంగా చైన్నె పోలీసులు దూకుడు పెంచారు. గత ఏడు నెలల్లో రూ. 60 కోట్లను చలాన్ల రూపంలో వసూలు చేశారు. అలాగే మద్యం మత్తులో వాహనాలు నడిపిన మందుబాబులకు నుంచి ఏకంగా రూ. 19 కోట్లు రాబట్టారు. వివరాలు.. రాష్ట్ర రాజధాని నగరం చైన్నెలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే రీతిలో దూకుడు పెంచారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని, ట్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహనదారులను, సిగ్నల్స్‌లో ఆపకుండా ముందుకెళ్లే వారిపై గురి పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు విస్తృతంగా చేస్తున్నారు. అలాగే, రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారు , బైక్ రేసింగ్లలో పాల్గొనే వారికి జరిమానాల మోత మోగిస్తున్నారు. జరిమానాల జోరు.. నగరంలో అనేక కూడళ్లను హెల్మెట్ జోన్లు, స్పీడ్ కంట్రోల్ చెకింగ్ జోన్లుగా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో నిరంతరం దృష్టి సారిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా జరిమానాల మోత మోగిస్తున్నారు. నిఘా నేత్రాల ద్వారా సైతం గురించి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో చలానా విధిస్తున్నారు. 32 రకాల నిబంధనలకు జరిమానాలు విధించాల్సి ఉన్నా, ప్రధానంగా ఏడు రకాల నిబంధనలు ఉల్లంఘించే వారిని నుంచి మాత్రమే ప్రసుత్తం ఫైన్ వసూలు చేస్తున్నారు. గత ఏడాది జరిమానాల రూపంలో ట్రాఫిక్ పోలీసు ఖాతాలో రూ. 149 కోట్లు చేరాయి. ఈ ఏడాది ఏడు నెలల్లో రూ. 60 కోట్లను దాటేశారు. ఇందులో మందు బాబుల నుంచి ఎక్కువ మొత్తమే వసూలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 19,765 మందిపై కేసు నమోదు చేసి రూ. 19.76 కోట్లు జరిమానాల రూపంలో వసూళ్లు చేసి ఉన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన 3,61,655 మంది నుండి రూ. 36.16 కోట్లు, ట్రిబుల్స్ డ్రైవింగ్‌లో 8,593 కేసులు నమోదు చేసి రూ. 85.93 లక్షలు, అతి వేగానికి సంబంధించి 2,716 కేసుల్లో రూ. 27.16 లక్షలు, సీటు బెల్ట్ ధరించని 9,101 మంది నుంచి రూ. 91.01 లక్షలు, సిగ్నల్ వద్ద వాహనం ఆపకుండా వెళ్లిన 39,320 మంది నుంచి రూ. 1.96 కోట్లు, కార్లకు బ్లాక్ ఫిల్మ్ అంటించిన 4,284 మంది నుంచి రూ.21.42 లక్షలు వసూలు చేశారు. ఇదే కాకుండా సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన వాహన నెంబర్లకు ఎస్ఎంఎస్ల ద్వారా చాలానా విధించారు. వీటి ద్వారా కోట్లాది రూపాయలు వసూలు కావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా లేదా, ట్రాఫిక్ జరిమాన వసూళ్లు కేంద్రాల ద్వారా వాహన దారులు త్వరితగతిన చెల్లిస్తే మంచిది. లేని పక్షంలో వారి వాహనాలు, లైసెన్స్‌లను సీజ్ చేసే విధంగా ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచనున్నారు. ఇక వాహనదారులు నిబంధనలు సక్రమంగా పాటిస్తే, జరిమానాల మోత మోగించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా వాహన దారులకు మరింత అవగాహన కల్పించే విధంగా రోడ్ సేఫ్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చైన్నె పోలీసుల కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్ తెలిపారు. -
జరిమానా నుంచి తప్పించుకోవాలని..ఏకంగా చనిపోయిన పైలట్..
ఒక మహిళ విచిత్రమైన మోసానికి పాల్పడింది. ఏకంగా చనిపోయిన వ్యక్తి ఐడెంటీటిని ఉపయోగించి మోసగించే ప్రయత్నంలో పట్టుబడింది. దీంతో ఆమెకు కోర్టు శిక్ష విధించనుంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియన్ మహిళ 33 ఏళ్ల స్టెఫానీ లూయిస్ బెన్నెట్ కారు డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడంతో పట్టుబడింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు ఆమెకు దాదాపు రూ. 88 వేలు జరిమానా విధించారు. ఐతే ఆమె ఈ ట్రాఫిక్ జరిమానా నుంచి తప్పించుకునేందుకు తాను ఎలాంటి నేరం చేయలేదంటూ ఆన్లైన్లోనే సదరు ట్రాఫిక్ సంస్థకు తెలిపింది. ఆ సమయంలో తన కారుని నడిపింది యాష్ జెంక్సిన్గా పేర్కొంది. అతను సీ వరల్డ్ పైలంట్. అతని ఐడెంట్ని ఉపయోగించి.. అతన డెత్ రిపోర్ట్ ఉన్న పూర్తి పేరు, పుట్టిన తేదీని వినియోగించింది. వాస్తవానికి అతను జనవరి 2న గోల్డ్ కోస్ట్ బ్రాడ్‌వాటర్‌లో హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా మరో హెలికాప్టర్ ఢీ కొట్టడంతో..అతను సిడ్నీ మహిళ వెనెస్సాటాడ్రోస్, బ్రిటీష్ జంట రాస్, డయాన్ హ్యైస్ అనే ముగ్గురు ప్రయాణికులతో కలసి స్పాట్లో చనిపోయాడు. జెంక్సిన్ మరణించిన కొన్ని వారాల తర్వాత అతని భార్యకు జరిమాన నోటీసులు అందాయి. ఆమె ట్రాఫిక్ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు సదరు మహిళ బెన్నెట్ తతమను తప్పుదారి పట్టించి మోసం చేసిందని గుర్తించారు. ఈ మేరకు సదరు మహిళను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆమె నేరం చేసినట్లు కోర్టు ఎదుట అంగీకరించింది. తాను ఆ మరుసటి రోజు తన వ్యాఖ్యలను ఆన్లైన్లో వెనక్కి తీసుకునేందుకు యత్నించినా..అందుకు సదరు వెబ్సైట్ అంగీకరించలేదని వాపోయింది. తాను ఆర్థిక సమస్యలను ఎదుర్కొనడం వల్లే ఇలా చేశానిని కోర్టుకి వివరించింది. ఈ మేరకు బెన్నెట్ చేసిన నేరానికి గాను మే 19న శిక్ష ఖరారు చేయనుంది కోర్టు. (చదవండి: ఉక్రెయిన్‌కు నాటో భారీ ఆయుధ సాయం) -
ఫైన్ వేసినా.. పగ్గాల్లేవ్..
సాక్షి, హైదరాబాద్ : చేతిలో 2000 సీసీ ఇంజిన్ కారు, కళ్లెదురుగా స్పీడు బ్రేకర్లు లేని రింగు రోడ్డు.. ఇంకేం.. కాళ్ల కింద ఉన్న క్లచ్చును తొక్కి రయ్యిమంటూ వాహనాన్ని దూకించడానికి ఇంతకంటే ఏం కావాలి.. వీటికితోడు చేతిలో డ్రగ్స్ ప్యాకెట్టో, బీరుబాటిలో ఉంటే.. ఆ దూకుడుకు కళ్లెమేయడం అసాధ్యమే. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు చేసే ప్రచారం వీరి చెవికెక్కదు. గమ్యస్థానాలకు చేరే లోపు ప్రమాదాలు జరుగుతున్నా వీరికి పట్టదు. పలువురు నటులు, ప్రముఖులు.. వారి పుత్ర రత్నాలు ఇలాగే వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిం చడం, ఓవర్‌స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడటం, చలానా కట్టేయడం. ఎన్ని సార్లు వార్తల్లోకెక్కినా వీరి తీరు మారడం లేదు. కేవలం మరణాలు సంభవిం చినపుడు మాత్రమే ఓవర్‌స్పీడ్‌పై అంతా హడావుడి, అన్ని చోట్ల డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు.. ఆ తర్వాత షరామామూలే.. వేగంగా కారు నడుపుతూ ప్రమాదాలకు కారణమైన వారికి చలానాతోపాటు జైలుకూడా ఉంటేనే వీరికి కళ్లెమేయడం సాధ్యమవుతుందని పోలీసులే అభిప్రాయపడుతున్నారు. వేగం, మద్యం, నిర్లక్ష్యం.. సెప్టెంబర్‌లో కొత్త వాహన సవరణ చట్టం–2019 అమలవుతుందన్న భయంతో తొలుత వాహనదారులు జాగ్రత్తగా నడుచుకున్నారు. ఉల్లంఘనలకు వేలకు వేలు జరిమానాలు విధిస్తారని జంకారు. అయితే, ఆ చట్టం అమలు తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో ఉల్లంఘనులు తిరిగి చెలరేగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వేగమే. అ తర్వాత డ్రంకెన్ డ్రైవ్, డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా ఉండటం వంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్ట వేగ పరిమితి కేవలం 80 కి.మీ. సాధారణ వాహనాల్లో ఈ వేగం దాటితే వాహనంలో మార్పులు వస్తాయి. కానీ, కొంతకాలంగా మార్కెట్లో్లకి వస్తోన్న అధిక సామర్థ్యం, హైఎండ్ వాహనాలు 150 కి.మీ.లు దాటి ప్రయాణించినా పెద్దగా ఇబ్బంది ఉండదు. దీంతో ఈ స్పీడ్‌ను 180 కి.మీ నుంచి 200 కి.మీ. దాకా తీసుకుపోతున్నారు. ఫలితంగా ప్రమాదాలు అనివార్యమవుతున్నాయి. జైలుశిక్ష కూడా విధించాలి.. అతివేగం వల్ల కలిగే అనర్థాలపై ఎంత ప్రచారం చేసినా.. కొందరు ప్రముఖులు వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఓవర్‌స్పీడ్‌కు చలానాలు కడుతున్నారు తప్ప జరిగిన దానికి చింతించడం లేదు. పైగా చాలాసార్లు అవే తప్పులు పునరావృతం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ దాని పరిసరాల్లో ఇలాంటి ఓవర్‌స్పీడ్ మరణాలు సాధారణంగా మారాయి. మితిమీరిన వేగం వాహనం నడిపేవారికి కాదు, రోడ్డుపై వెళ్తున్న వారికీ ప్రమాదమే. అందుకే ఓవర్‌స్పీడ్ విషయంలో భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా ఉండేలా చట్టంలో మార్పులు చేస్తే ఫలితాలు ఉంటాయని తెలంగాణ ఆటోమోటార్స్ వెల్ఫేర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది నమోదైన ఓవర్‌స్పీడ్ కేసుల వివరాలు.. (అక్టోబర్ 31 వరకు) నమోదైన కేసులు: 89,6092 అక్టోబర్ 31న నమోదైన కేసులు: 3,614 రోజుకు నమోదువుతున్న సగటు కేసులు: 2,986 గంటకు నమోదవుతున్న కేసులు దాదాపు: 125 నిమిషానికి నమోదవుతున్న కేసులు: 2.5 అక్టోబర్ 31 వరకు వేసిన చలానాలు: రూ.72.51 కోట్లు రోజుకు సగటున జరిమానాలు: రూ.24.15 లక్షలు భారీ జరిమానాలు విధించే యోచనలో ఉన్నాం.. వాహనదారుల్లో ఉల్లంఘనులు పెరగడం ఆందోళనకర అంశమే. ముఖ్యంగా హైఎండ్ వెహికిల్స్, మోటారు సైకిల్స్ వేగానికి కళ్లెం వేయాల్సిందే. తప్పు చేస్తే కఠినచర్యలు ఉంటాయన్న భయం వాహనదారులకు కలగాలి. ఈ మేరకు కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధించే యోచనలో ఉన్నాం. –పాండురంగ్‌నాయక్, జేటీసీ, ఆర్టీఏ, హైదరాబాద్ -
అతివేగానికి కళ్లు బైర్లుకమ్మే ఫైన్
దుబాయ్: కారును గంటకు 83కిలోమీటర్ల వేగంతో నడిపినందుకు దుబాయ్ ట్రాఫిక్ అధికారులు ఓ కారు డ్రైవర్‌కు 3000 ధీరమ్(భారత రూపాయిల్లో 53 వేల పైనే) ల జరిమాన విధించారు. వివరాలు, దుబాయ్‌లోని కోర్నిచే అల్ ఖ్వసిమ్ రోడ్లో ఓ కారు డ్రైవర్ వాహనాన్ని గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. నిబంధనల ప్రకారం ఆ రోడ్డులో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వాహనాలను నడపాలి. గతంలో గంటకు 60 కిలోమీటర్ల నిబంధన ఉంది, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది అక్కడి ట్రాఫిక్ నిబంధనలు విధించే సంస్థ. దుబాయ్‌లో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం అతివేగం కారణంగానే జరుగుతున్నట్టు దుబాయ్ ట్రాఫిక్ నియంత్రణ అధికారులు తెలిపారు. అతివేగంతో వాహనాలను నడిపే వారు అత్యధికంగా యువకులు, లైసెన్స్ లేని వారేనని అధికారుల పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన ట్రాఫిక్ పెట్రోలింగ్‌లో 69 మంది యువకులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ.. పట్టుబడినట్టు అక్కడి పోలీసులు తెలిపారు. -
ప్రయాణం ఓకే.. పార్కింగ్‌తోనే పరేషానీ!
సాక్షి, హైదరాబాద్: రెండో రోజూ నగర సిటిజన్లలో మెట్రో జోష్ కనిపించింది. తొలిరోజే 2 లక్షల మంది ప్రయాణికుల జర్నీతో ఇతర మెట్రోల రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇదే జోరుతో రెండోరోజు గురువారం కూడా నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గాల్లో సుమారు రెండు లక్షల మంది ప్రయాణించినట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... ఈ రెండు మార్గాల్లోని 24 స్టేషన్లకుగాను ఐదు చోట్ల మాత్రమే పార్కింగ్ సదుపాయాలుండడంతో మిగతా చోట్ల పార్కింగ్ తిప్పలు నగరవాసులకు చుక్కలు చూపాయి. పార్కింగ్ సదుపాయం ఉన్న చోట చార్జీల బాదుడు.. లేని చోట స్టేషన్ల కింద, సమీప ప్రాంతాల్లో బైక్‌లు, కార్లు పార్కింగ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి ఒక్కొక్కరి నుంచి వందల రూపాయలు జరినామా విధించారు. ట్రాఫిక్ పోలీసుల బాదుడు అదనం... ఇక ప్రధాన రహదారులపై ఉన్న మెట్రో స్టేషన్ల కింద, సమీప ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను గురువారం ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. బైక్‌లు, కార్లను సమీప ట్రాఫిక్ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఒకేరోజు సుమారు వెయ్యి వాహనాలను సీజ్‌చేసి ఒక్కో ద్విచక్రవాహనం నుంచి రూ.250.. కార్లపై రూ.350 జరిమానా విధించడం గమనార్హం. కిటకిటలాడిన మెట్రో స్టేషన్లు.. మెట్రో ‘సెకండ్’డే జర్నీ సైతం అదుర్స్ అనిపించింది. ప్రధానంగా ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్, బేగంపేట, ప్రకాష్‌నగర్, రసూల్‌పురా, పరేడ్‌గ్రౌండ్స్ మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఎక్కడా లేనంత రద్దీ అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లో కనిపించింది. ఈ నేపథ్యంలో స్టేషన్లలో, మెట్రో రైలులో సెల్పీలు దిగి జనం మురిసిపోయారు. కాగా మియాపూర్ స్టేషన్ ఆవరణలో 25 సైకిళ్లతో ఏర్పాటు చేసిన సైకిల్‌స్టేషన్ కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు. సాంకేతిక కారణాల కారణంగా రిజిస్ట్రేషన్లు ఇంకా ప్రారంభించలేదని ఈ కేంద్రం నిర్వాహకులు తెలిపారు. టికెట్ కన్నా.. పార్కింగ్ చార్జీయే అధికం.. ప్రస్తుతం అందుబాటులోఉన్న ఐదు పార్కింగ్ ప్రాంతాల్లో బైక్‌లకు తొలి 2 గంటలు రూ.6, ఆ తరువాత ప్రతి గంట కు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన పది గంటలపాటు బైక్‌ను మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన వారు రూ.24 సమర్పించుకోవాలి. ఇక కార్లకు తొలి 2 గంటలకు రూ.12.. ఆపై ప్రతి గంటకు రూ.6 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన మెట్రో స్టేషన్ వద్ద కారును పది గంటల పాటు పార్క్ చేస్తే రూ.48 చెల్లించాలి. అంటే నాగోల్–అమీర్‌పేట్ టికెట్ చార్జీ రూ.45 కాగా.. పార్కింగ్ చార్జీ రూ.48 అన్నమాట. మరోవైపు మెట్రో అధికారులు మరో ఆరు పార్కింగ్ కేంద్రాలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినా.. ఇంకా కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. మెట్రో.. ఎంతో థ్రిల్... మెట్రో మొదటి అనుభవం ఎంతో థ్రిల్‌నిచ్చింది. అయితే మహిళలకు టికెట్ కౌంటర్ల వద్ద విడిగా క్యూలైన్ గానీ, రైలులో విడిగా సీట్లు గానీ లేకపోవడం కొంచెం బాధ కలిగించింది. –రామసుధ, అమీర్‌పేట్ చార్జీ భారంగా మారింది నాగోలు నుంచి అమీర్‌పేట్ వరకు మెట్రో ప్రయాణం చేశా. జర్నీ బాగుంది కానీ చార్జీ భారంగా మారింది. అలాగే స్టేషన్ల వద్ద పార్కింగ్ సౌకర్యం లేక వాహనం ఎక్కడ పెట్టాలో అర్ధం కాలేదు. –సాయి -
బండి ధర 9 లక్షలు.. ట్రాఫిక్ ఫైన్ 8 లక్షలు
నగర రోడ్లపై యథేచ్ఛగా ఉల్లంఘనలు అవన్నీ కమర్షియల్ వాహనాలే.. ఫైన్ కట్టేసి మళ్లీ ఎప్పట్లాగే తిరుగుతున్న వాహనదారులు పెనాల్టీ పాయింట్స్ విధానంతో ఇక ఇలాంటి వారికి చెక్: అధికారులు సాక్షి, హైదరాబాద్ అదో డీసీఎం.. ఆ బండి ధర దాదాపు రూ.9 లక్షలు.. కానీ గత మూడేళ్లలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఆ వాహనానికి పడిన జరిమానా ఎంతో తెలుసా? ఏకంగా రూ.7,64,220. అదో ఆటో.. ఖరీదు రూ.4 లక్షల దాకా ఉంటుంది.. కానీ ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోనందుకు కట్టిన ఫైన్ ఎంతో తెలుసా? రూ.5.73 లక్షలు! హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి జరిమానా చెల్లించిన ‘టాప్ టెన్’ వాహనాల జాబితాను అధికారులు రూపొందించారు. అందులో ఇలాంటి విచిత్రాలెన్నో వెలుగుచూశాయి. ఈ టాప్ టెన్ వాహనాలు గత మూడేళ్లలో రూ.59.8 లక్షల ఫైన్ కట్టినట్టు లెక్క తేలింది. ఇక హెల్మెట్ ధరించనందుకు ఓ ద్విచక్ర వాహనదారుడికి 97 చలాన్లు జారీ అయ్యాయి. ఇలా టాప్ 10 టూ వీలర్స్‌కు ఏకంగా 650 చలాన్లు జారీ అయినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇలా ఫైన్లు కట్టేస్తూ మళ్లీ దర్జాగా రోడ్డెక్కుతున్న వాహనదారులకు తాజాగా ప్రవేశపెట్టిన పెనాల్టీ పాయింట్ల విధానంతో చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ కమర్షియల్ వాహనాలే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అత్యధిక మొత్తం జరిమానాగా చెల్లించిన టాప్ టెన్ వాహనాలన్నీ కమర్షియల్, సరుకు రవాణా కేటగిరీకి చెందినవే కావడం గమనార్హం. పౌరసరఫరాల శాఖతో పాటు అత్యవసర సేవలకు సంబంధించిన రవాణా వాహనాలకు మాత్రమే నగరంలో 24 గంటలూ తిరిగేందుకు అనుమతి ఉంటుంది. మిగిలిన వాణిజ్య వాహనాలు, లారీలను కేవలం రాత్రి వేళల్లోనే సిటీలోకి అనుమతిస్తారు. అయితే నగరంలో నిత్యం కూల్‌డ్రింక్‌లు, తినుబండారాలు, సరుకులు డెలివరీ చేసే అనేక వాహనాలు సంచరిస్తున్నాయి. ఇవన్నీ ఆయా దుకాణాలు పనిచేసే వేళల్లోనే తిరగాల్సి ఉండటంతో రోడ్లెక్కడం తప్పడం లేదు. దీంతో వాటికి పోలీసులు ఓ వెసులుబాటు కల్పించారు. ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే ‘నాన్ పీక్ అవర్స్’(మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు)లో వాటికి అనుమతినిచ్చారు. మిగిలిన సమయంలో సిటీ రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుంటారు. అయితే కేవలం ఆ నాలుగు గంటల్లోనేగాకుండా మిగిలిన సమయంలోనూ రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఒక్కసారి ఫైన్ కట్టేసి.. రోజంతా.. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా వాహనాన్ని నడిపితే ట్రాఫిక్ పోలీసుల గరిష్టంగా రూ.1,000 వరకు జరిమానా విధిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఓ ఉల్లంఘనకు ఒకసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ 24 గంటల దాటే వరకు మరోసారి ఫైన్ విధించేందుకు అవకాశం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు నగర రోడ్లపై తిరుగుతున్నాయి. రోడ్లపైకి వచ్చిన వెంటనే ఏదో ఓ చోట ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానా చెల్లించేసి ఇక ఆ రశీదుతో రోజంతా నడుపుతున్నారు. తమ వ్యాపారంలో వచ్చే లాభం కంటే చెల్లించే జరిమానా అతి తక్కువ కావడంతో వాహనదారులు ఇలా చేస్తున్నారు. ఇలా టాప్–10 వాహనాలు మూడేళ్ల కాలంలో రూ.59,80,580 జరిమానాగా చెల్లించాయి. ఈ వాహనాలు అనుమతి లేని వేళల్లో తిరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కానీ అప్పటికే అవి ఆ రోజుకు సంబంధించిన జరిమానా చెల్లించి ఉండటంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. ‘పాయింట్స్’తో స్వైర విహారానికి చెక్ ద్విచక్ర వాహనదారులు కూడా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫైన్ విధించినా మళ్లీ అదే కారణంతో దొరికిపోతున్నారు. ఇలా గత మూడేళ్ల లెక్క తీస్తే అందులో తొలి పది మంది వాహనదారులకు ఏకంగా 650 ‘హెల్మెట్’జరిమానాలు పడ్డట్టు తేలింది. ట్రాఫిక్ అధికారులు ఈ నెల 1 నుంచి ప్రవేశపెట్టిన పెనాల్టీ పాయింట్స్ విధానంతో ఇలాంటివారికి కళ్లెం పడుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు చలాన్‌కు సంబంధించిన నగదు చెల్లిస్తే సరిపోయేది. కానీ కొత్త విధానంలో రెండేళ్లలో కాలంలో 12 పాయింట్లు పడితే సదరు వాహనదారుడి లైసెన్స్ రద్దు కానుంది. గత మూడేళ్లలో అత్యధిక జరిమానాలు చెల్లించిన ‘టాప్–10’కమర్షియల్ వాహనాలివీ.. వాహనం నంబర్ చెల్లించిన ఫైన్ ఏపీ09వీ6780 రూ.7,64,220 ఏపీ29వీ3285 రూ.6,63,625 ఏపీ28యూ2081 రూ.6,55,635 ఏపీ09వీ8015 రూ.5,99,345 ఏపీ28యూ1711 రూ.5,78,330 ఏపీ29డబ్ల్యూ0814 రూ.5,73,830 ఏపీ28యూ2078 రూ.5,59,455 ఏపీ28యూ2139 రూ.5,36,885 ఏపీ09వీ6872 రూ.5,25,575 ఏపీ09వీ6735 రూ.5,23,680 మొత్తం రూ.59,80,580 గత మూడేళ్లలో ‘హెల్మెట్’చలాన్లు కట్టిన టాప్–10 టూ వీలర్స్.. వాహనం నంబర్ చలాన్లు ఏపీ10ఎఫ్8737 97 ఏపీ11ఏఈ8321 90 ఏపీ09బీఈ3503 68 ఏపీ12ఈడీ6291 60 ఏపీ12కే1366 58 పీ12ఏ9424 58 ఏపీ12ఈబీ9658 57 ఏపీ09సీడీ4775 55 ఏపీ13హెచ్6054 54 ఏపీ28డీఎం0568 53 మొత్తం 650 గత మూడేళ్లలో ‘టాప్–10’ వాహనాలు కట్టిన జరిమానా 59,80,000 గత మూడేళ్లలో ‘టాప్–10’ టూవీలర్స్‌కు జారీచేసిన చలాన్లు 650 వీటిలో హెల్మెట్ ధరించనందుకు ఓ ద్విచక్ర వాహనదారుడికి జారీ అయిన చలాన్లు 97