బండి ధర 9 లక్షలు.. ట్రాఫిక్ ఫైన్ 8 లక్షలు
- నగర రోడ్లపై యథేచ్ఛగా ఉల్లంఘనలు
- అవన్నీ కమర్షియల్ వాహనాలే..
- ఫైన్ కట్టేసి మళ్లీ ఎప్పట్లాగే తిరుగుతున్న వాహనదారులు
- పెనాల్టీ పాయింట్స్ విధానంతో ఇక ఇలాంటి వారికి చెక్: అధికారులు
సాక్షి, హైదరాబాద్
అదో డీసీఎం.. ఆ బండి ధర దాదాపు రూ.9 లక్షలు.. కానీ గత మూడేళ్లలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఆ వాహనానికి పడిన జరిమానా ఎంతో తెలుసా? ఏకంగా రూ.7,64,220. అదో ఆటో.. ఖరీదు రూ.4 లక్షల దాకా ఉంటుంది.. కానీ ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోనందుకు కట్టిన ఫైన్ ఎంతో తెలుసా? రూ.5.73 లక్షలు! హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి జరిమానా చెల్లించిన ‘టాప్ టెన్’ వాహనాల జాబితాను అధికారులు రూపొందించారు. అందులో ఇలాంటి విచిత్రాలెన్నో వెలుగుచూశాయి.
ఈ టాప్ టెన్ వాహనాలు గత మూడేళ్లలో రూ.59.8 లక్షల ఫైన్ కట్టినట్టు లెక్క తేలింది. ఇక హెల్మెట్ ధరించనందుకు ఓ ద్విచక్ర వాహనదారుడికి 97 చలాన్లు జారీ అయ్యాయి. ఇలా టాప్ 10 టూ వీలర్స్‌కు ఏకంగా 650 చలాన్లు జారీ అయినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇలా ఫైన్లు కట్టేస్తూ మళ్లీ దర్జాగా రోడ్డెక్కుతున్న వాహనదారులకు తాజాగా ప్రవేశపెట్టిన పెనాల్టీ పాయింట్ల విధానంతో చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు.
అన్నీ కమర్షియల్ వాహనాలే
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అత్యధిక మొత్తం జరిమానాగా చెల్లించిన టాప్ టెన్ వాహనాలన్నీ కమర్షియల్, సరుకు రవాణా కేటగిరీకి చెందినవే కావడం గమనార్హం. పౌరసరఫరాల శాఖతో పాటు అత్యవసర సేవలకు సంబంధించిన రవాణా వాహనాలకు మాత్రమే నగరంలో 24 గంటలూ తిరిగేందుకు అనుమతి ఉంటుంది. మిగిలిన వాణిజ్య వాహనాలు, లారీలను కేవలం రాత్రి వేళల్లోనే సిటీలోకి అనుమతిస్తారు. అయితే నగరంలో నిత్యం కూల్‌డ్రింక్‌లు, తినుబండారాలు, సరుకులు డెలివరీ చేసే అనేక వాహనాలు సంచరిస్తున్నాయి.
ఇవన్నీ ఆయా దుకాణాలు పనిచేసే వేళల్లోనే తిరగాల్సి ఉండటంతో రోడ్లెక్కడం తప్పడం లేదు. దీంతో వాటికి పోలీసులు ఓ వెసులుబాటు కల్పించారు. ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే ‘నాన్ పీక్ అవర్స్’(మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు)లో వాటికి అనుమతినిచ్చారు. మిగిలిన సమయంలో సిటీ రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుంటారు. అయితే కేవలం ఆ నాలుగు గంటల్లోనేగాకుండా మిగిలిన సమయంలోనూ రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి.
ఒక్కసారి ఫైన్ కట్టేసి.. రోజంతా..
నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా వాహనాన్ని నడిపితే ట్రాఫిక్ పోలీసుల గరిష్టంగా రూ.1,000 వరకు జరిమానా విధిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఓ ఉల్లంఘనకు ఒకసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ 24 గంటల దాటే వరకు మరోసారి ఫైన్ విధించేందుకు అవకాశం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు నగర రోడ్లపై తిరుగుతున్నాయి. రోడ్లపైకి వచ్చిన వెంటనే ఏదో ఓ చోట ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానా చెల్లించేసి ఇక ఆ రశీదుతో రోజంతా నడుపుతున్నారు. తమ వ్యాపారంలో వచ్చే లాభం కంటే చెల్లించే జరిమానా అతి తక్కువ కావడంతో వాహనదారులు ఇలా చేస్తున్నారు. ఇలా టాప్–10 వాహనాలు మూడేళ్ల కాలంలో రూ.59,80,580 జరిమానాగా చెల్లించాయి. ఈ వాహనాలు అనుమతి లేని వేళల్లో తిరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కానీ అప్పటికే అవి ఆ రోజుకు సంబంధించిన జరిమానా చెల్లించి ఉండటంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు.
‘పాయింట్స్’తో స్వైర విహారానికి చెక్
ద్విచక్ర వాహనదారులు కూడా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫైన్ విధించినా మళ్లీ అదే కారణంతో దొరికిపోతున్నారు. ఇలా గత మూడేళ్ల లెక్క తీస్తే అందులో తొలి పది మంది వాహనదారులకు ఏకంగా 650 ‘హెల్మెట్’జరిమానాలు పడ్డట్టు తేలింది. ట్రాఫిక్ అధికారులు ఈ నెల 1 నుంచి ప్రవేశపెట్టిన పెనాల్టీ పాయింట్స్ విధానంతో ఇలాంటివారికి కళ్లెం పడుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు చలాన్‌కు సంబంధించిన నగదు చెల్లిస్తే సరిపోయేది. కానీ కొత్త విధానంలో రెండేళ్లలో కాలంలో 12 పాయింట్లు పడితే సదరు వాహనదారుడి లైసెన్స్ రద్దు కానుంది.
గత మూడేళ్లలో అత్యధిక జరిమానాలు చెల్లించిన ‘టాప్–10’కమర్షియల్ వాహనాలివీ..
వాహనం నంబర్ చెల్లించిన ఫైన్
ఏపీ09వీ6780 రూ.7,64,220
ఏపీ29వీ3285 రూ.6,63,625
ఏపీ28యూ2081 రూ.6,55,635
ఏపీ09వీ8015 రూ.5,99,345
ఏపీ28యూ1711 రూ.5,78,330
ఏపీ29డబ్ల్యూ0814 రూ.5,73,830
ఏపీ28యూ2078 రూ.5,59,455
ఏపీ28యూ2139 రూ.5,36,885
ఏపీ09వీ6872 రూ.5,25,575
ఏపీ09వీ6735 రూ.5,23,680
మొత్తం రూ.59,80,580
గత మూడేళ్లలో ‘హెల్మెట్’చలాన్లు కట్టిన టాప్–10 టూ వీలర్స్..
వాహనం నంబర్ చలాన్లు
ఏపీ10ఎఫ్8737 97
ఏపీ11ఏఈ8321 90
ఏపీ09బీఈ3503 68
ఏపీ12ఈడీ6291 60
ఏపీ12కే1366 58
పీ12ఏ9424 58
ఏపీ12ఈబీ9658 57
ఏపీ09సీడీ4775 55
ఏపీ13హెచ్6054 54
ఏపీ28డీఎం0568 53
మొత్తం 650
గత మూడేళ్లలో ‘టాప్–10’ వాహనాలు కట్టిన జరిమానా 59,80,000
గత మూడేళ్లలో ‘టాప్–10’ టూవీలర్స్‌కు జారీచేసిన చలాన్లు 650
వీటిలో హెల్మెట్ ధరించనందుకు ఓ ద్విచక్ర వాహనదారుడికి జారీ అయిన చలాన్లు 97