సాక్షి, హైదరాబాద్: కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 దేశవ్యాప్తంగా ఆదివారం అమలులోకి వచ్చింది. కానీ, తెలంగాణలో మాత్రం పోలీసులు ఆదివారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి పాత చలాన్‌లే విధించారు. కొత్త చట్టం ప్రకారం.. చలాన్‌లు విధించాలంటూ తమకు రవాణా శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పోలీసులు స్పష్టం చేశారు. జరిమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పైగా కొత్త చలాన్‌లు ఇప్పటికిప్పుడు అమలు చేస్తున్న పలు రాష్ట్రాల్లో దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందనవస్తుంది? అన్న విషయాలు కూడా అధ్యయనం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మనకు ఇక్కడ పాత జరిమానాలే వర్తించనున్నాయని రవాణా, పోలీసు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా ‘ట్రాఫిక్ రూల్స్ పాటించండి... మీ డబ్బు ఆదా చేసుకోండి’ అనే నినాదంతో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. కొత్త నిబంధనలతో జరిమానాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి.. నిబంధనల్ని పాటిస్తే ఏ మేరకు డబ్బు ‘ఆదా’చేసుకోవచ్చు తదితర విషయాలను వివరిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు రూపొందించి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు సైతం వాహనచోదకుల్ని ఆపి వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్ని తనిఖీ చేస్తున్నారు. ఏదైనా లేకపోతే ప్రస్తుతం ఎంత జరిమానా పడుతోంది, కొత్త యాక్ట్ అమలులోకి వస్తే ఏ స్థాయిలో పడుతుంది అనేవి వివరిస్తున్నారు. మరోపక్క వాహనదారులు కూడా ఉల్లంఘనలకు పాల్పడకూడదనే ఉద్దేశంతో డ్రైవింగ్ చేస్తున్నారు. వారం రోజులుగా హెల్మెట్ వినియోగం పెరిగిందని, ఇదే వాహనచోదకులు తీసుకుంటున్న జాగ్రత్తకు నిదర్శనమని ఓ అధికారి తెలిపారు.
ఇక్కడ పాత చలాన్‌లే!
Published Mon, Sep 2 2019 1:19 AM | Last Updated on Mon, Sep 2 2019 7:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment