సాక్షి, మెదక్: జిల్లా రవాణా శాఖకు సంబంధించిన బాగోతం రాష్ట్ర రాజధానికి చేరింది. నెలరోజు లుగా ఓ సంఘం నేత, ఏజెంట్ల మధ్య కొనసాగుతున్న వార్ హోంమంత్రితోపాటు డీజీపీ కార్యాలయం దృష్టికి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీఓ కార్యాలయంలో ఇటీవల వరకు ఏజెంట్ల విధానం కొనసాగిన విషయం తెలిసిందే. లైసె న్స్‌లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్, పత్రాల మార్పిడి వంటి వివిధ పనుల నిమిత్తం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుంచి ఏజెంట్లు అనధికార వసూళ్లకు తెగబడ్డారు. అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు, సిబ్బందితో కుమ్మక్కై వాహనదారులను నిలువు దోపిడీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించి అవినీతి బాగోతంపై ఓ సంఘం నేత పలు ఆధారాలతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఈ నేపథ్యంలో ఏజెంట్లు, ఆ సంఘం నేత మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. సదరు సంఘం నేతను అంతమొందించేందుకు ఏజెంట్లు ప్లాన్ వేసినట్లు బయటకు పొక్కడం వేడిపుట్టించింది. ఇదే సమయంలో తమను డబ్బులు డిమాండ్ చేసినట్లు సదరు సంఘం నేతపై ఏజెంట్లు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనను, తనకుటుంబాన్ని అంతమొందించేందుకు ఏజెంట్లు ప్రయత్నించారని సంఘం నేత సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏజెంట్లపై సెక్షన్ 341, 506 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదయ్యాయి. సంఘం నేతపై సెక్షన్ 384 కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు సంఘం నేత మంగళవారం హైదరాబాద్‌లో హోంమంత్రి మహమూద్ అలీని కలిసి ఫిర్యాదు చేశాడు.
డీజీపీ కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేశాడు. ఏజెంట్లు తప్పుడు ఆరోపణలు చేశారని.. ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. అయినా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. తనపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారని.. ఏజెంట్లపై పిటీ కేసు మాత్రమే నమోదు చేశారని అందులో వివరిం చారు. వెంటనే సమగ్ర విచారణ చేపట్టి నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. మెదక్ ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన లొల్లి హోంమంత్రి పేషీ, డీజీపీ కార్యాలయానికి చేరడంతో ఏం జరుగుతుందనే అంశం జిల్లాలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment