Agents fraud
-
రోజుకు 15 గంటల పని.. లైంగిక వేధింపులు
సాక్షి, ఛార్మినార్: ఆర్థిక ఇబ్బందులతో కొంత మంది అమాయక ముస్లిం మహిళలు ఏజెంట్ల చేతుల్లో మోసానికి గురవుతున్నారు. పాతబస్తీలోని మురికివాడలకు చెందిన కొంత మంది మహిళా ముస్లింలు జీవనోపాధి కోసం దుబాయ్ తదితర అరబ్బు దేశాలకు వెళ్లేందుకు ఏజెంట్ల వలలో చిక్కుకుని పడరాని పాట్లు పడుతున్నారు. అమాయక మహిళలకు ఏజెంట్లు వారికి మాయమాటలు చెప్పి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పంపుతున్నారు. అక్కడ వారు నరకయాతన పడుతున్నారు. తిరిగి తమ కుటుంబ సభ్యుల వద్దకు వస్తామంటూ వేడుకుంటున్నారు. చదవండి: మోజు తీరగానే ఫోన్లో తలాక్.. శాలిబండ, కిషన్‌బాగ్, బేగంపేట్లకు చెందిన 8 మంది బాధితుల కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ సహకారంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్‌కు రాతపూర్వకంగా వినతి పత్రం పంపించారు. ఎనిమిది మంది మహిళలను దుబాయ్‌కు పంపించిన ఏజెంట్ షఫీని టాస్‌్కఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఏం జరుగుతోందంటే... ► ఏజెంట్స్ ఇక్కడ చెప్పేదొకటి...అక్కడికి తీసుకెళ్లిన తర్వాత చేసేదొకటి. ► మంచి ఉద్యోగం..సరిపడా జీతం అని చెప్పే ఇక్కడి ఏజెంట్లు..అక్కడికి వెళ్లిన అనంతరం యుఏఈలోని కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలకు అప్పజెబుతున్నారు. ► దీంతో అమాయక ముస్లింలు తమకు సంబంధం లేని పనులు చేయలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ► మూడు నెలల విజిటింగ్ వీసాపై వీరిని దుబాయ్‌కు తరలిస్తున్న ఏజెంట్లు అనంతరం కనుమరుగవుతున్నారు. ► దుబాయ్‌లో రిక్రూట్ చేసుకుంటున్న ఏజెన్సీలు అక్కడి డబ్బున్న ఇళ్లల్లో పాచిపని చేయడానికి వీరిని అప్పజెబుతున్నారు. ► వీరిపై లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ► ఇంటి యజమానులు వీరిపై కనికరం లేకుండా అడ్డమైన చాకిరీ చేయించుకుంటున్నారని బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు. వారు పెట్టే నరక యాతనను భరించ లేక తిరిగి నగరానికి రావడానికి సిద్ధపడుతున్నారు. ► ఈ విషయాన్ని సంబందిత ఏజెంట్లకు తెలియజేస్తే...లక్షల్లో డబ్బులు చెల్లించాలంటూ మొండికే స్తున్నారు. అసలేం జరిగిందంటే.. ► కిషన్‌బాగ్‌కు చెందిన యాస్మిన్ బేగం, అమ్రీన్ బేగం, శాలిబండకు చెందిన రహీమాబేగం, బేగంపేట్‌కు చెందిన కనీజ్ ఫాతిమా, నజియాబేగంలతో పాటు మెహెరున్సీసా బేగం, అస్మా బేగం, జరీనా బేగం అనే 8 మంది ముస్లిం మహిళలు షఫీ అనే ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లారు. ► పాతబస్తీ మిశ్రీగంజ్‌కు చెందిన షఫీ అనే ఏజెంట్ వీరికి డబ్బు ఆశ చూపి మాయమాటలు చెప్పి సెపె్టంబర్–అక్టోబర్ మాసాల్లో దుబయ్‌కు తీసుకెళ్లాడు. ► మూడు నెలల విజిటింగ్ వీసాపై తరలించిన షఫీ అక్కడి లేబర్ రిక్రూట్మెంట్ అల్ సఫీర్ అనే రిక్రూట్ సంస్థకు అప్పగించాడు. ► అక్కడి రిక్రూట్ సంస్థ వీరిని ఒక్కొక్కరిని రూ.2 లక్షలకు అరబ్ కుటుంబాలకు అప్పగించింది. అక్కడి నుంచి వీరి కష్టాలు మొదలయ్యాయి. ► రోజుకు 15 గంటలు పని చేయించుకునే వారు కొందరైతే..శారీక వేధింపులకు గురిచేసే వారు కొందరు. ► దీంతో విసిగి పోయిన బాధితురాళ్లు ఇక్కడి నగరంలోని తమ కుటుంబ సభ్యులకు వాట్స్ యాప్ కాల్స్ ద్వారా బోరుమన్నారు. అక్కడ తమ వారు పడుతున్న బాధలను భరించలేని ఇక్కడి వారి కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్ సహకారంతో కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసారు. ► సాధ్యమైనంత వెంటనే తమ వారిని భారత్‌కు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
బిల్డర్ల మోసాల నుంచి రక్షణ కల్పించాలి
న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు బిల్డర్లు, ఏజెంట్ల మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు కేంద్రం నమూనా ఒప్పందాలను సిద్ధం చేసేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ ‘మోడల్ బిల్డర్ బయ్యర్ అగ్రిమెంట్’, ‘మోడల్ ఏజెంట్, బయ్యర్ అగ్రిమెంట్’లను అమలయ్యేలా చూడాలని కూడా బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ తన పిల్లో కోరారు. ప్రమోటర్లు, బిల్డర్లు, ఏజెంట్లూ ఏకపక్షమైన ఒప్పందాలను ఉపయోగిస్తూంటారని, దీనివల్ల వినియోగదారులు నష్టపోతున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21లకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. నిర్మాణం పూర్తి చేసి భవనాలను కొనుగోలుదార్లకు అందించడంలో విపరీతమైన జాప్యం చేయడం, వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం ఇప్పటికే చాలాసార్లు జరిగాయనీ, ఏకపక్ష ఒప్పందాల్లోని నిబంధనలను సాకుగా చూపుతున్నారని అశ్విని కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ‘‘బిల్డర్లు డెలివరీ షెడ్యూల్‌ను పదే పదే జారీ చేస్తూంటారు. అనైతికమైన, ఏకపక్షమైన వ్యాపార కార్యకలాపాలు చేస్తూంటారు. ఇవన్నీ నేరపూరిత కుట్ర కిందకు వస్తుంది. ఫ్రాడ్, మోసం, విశ్వాస ఘాతుకం, నిజాయితీ లేకపోవడం, కార్పొరేట్ చట్టాల ఉల్లంఘన, భవనాల విషయంలో అవకతవకలు జరుగుతూంటాయి’’అని వివరించారు. ఈ చర్యలన్నింటి వల్ల వినియోగదారులు మానసిక, ఆర్థిక నష్టాలకు గురవుతున్నారని, అంతేకాకుండా తాము జీవించే, జీవనోపాధి హక్కులను కోల్పోతున్నారని తెలిపారు. అధికారుల నుంచి తగిన అనుమతులు తీసుకోకుండానే సాఫ్ట్ లాంచ్ చేయడం చట్టాన్ని నేరుగా అతిక్రమించడమేనని ఆరోపించారు. విక్రయానికి ముందుగా నియంత్రణ సంస్థల వద్ద ఆ ప్రాజెక్టును నమోదు చేయడం అవసరమని, బిల్డర్ వద్ద అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని కూడా ఈ పిటిషన్లో కోరారు. -
మోసాలకుఅడ్డుకట్ట వేయలేమా..
మోర్తాడ్: మోసపోయేవారు ఉన్నంత కాలం.. మోసగించేవారు ఉంటారు అనే నానుడికి గల్ఫ్ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారు ఎక్కడో ఏదో విధంగా మోసపోతూనే ఉన్నారు. ఇటీవల పలు ఘటనలు వెలుగుచూశాయి. షార్జాలోని బల్దియాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నా యని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి దాదాపు 300 మంది నిరుద్యోగులను నమ్మించి రూ.5 కోట్లతో ఉడాయించిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగింది. నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన ఆ యువకుడు నకిలీ వీసాలను నిరుద్యోగులకు అంటగట్టాడు. ఆ వీసాలతో కార్మికులు షార్జాకు వెళ్లే ప్రయత్నంలో ఎయిర్‌పోర్టులో అధికారులు గుర్తించి తిప్పిపంచారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి వీసాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి రూ.3 కోట్లు వసూలు చేసిన ఓ ఏజెంటు బాగోతాన్ని వరంగల్ జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. ఇవే కాకుండా.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం అనధికారికంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కొందరిని నిజామాబాద్, కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిరుద్యోగుల అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న మోసగాళ్లు అమాయకులను వంచనకు గురిచేస్తున్నారు. ఇదిలావుండగా.. కొందరు లైసెన్స్డ్ ఏజెంట్లు గల్ఫ్ దేశాలకు మొదట విజిట్ వీసాలపై మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిట్ వీసాలపై వెళ్లి గల్ఫ్ దేశాల్లో పనులుచేస్తే ఎన్నో విధాలుగా నష్టపోతారు. నిరుద్యోగులకు అవగాహన లేకపోవడంతో విజిట్ వీసాలపైనే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ఎస్ఓపీపై పోలీసులకు అవగాహన.. విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించే వారికి అండగా విదేశాంగ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ)ని రూపొందించింది. ఈ ఎస్ఓపీపై రాష్ట్ర పోలీసులు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులను మోసం చేసిన ఏజెంట్లపై నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో బాధితులకు ప్రయోజనం కలుగడం లేదు. వీసా మోసాలపై కఠినంగా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం జరగడంతో పాటు మోసాలను అరికట్టడానికి అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీసా మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం.. విదేశాలకు వెళ్లాలనుకునే వారు వీసాలను పొందే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. వలసలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మా టామ్‌కామ్ సంస్థ ఆధ్వర్యంలో, ఉపాధి కల్పన శాఖల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వీసాలు పొందిన తరువాత అవి నకిలీవా లేక సరైనవా అని నిర్ధారించుకోవడానికి వలసదారులకు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్లలో పరిశీలించి వీసాలను నిర్ధారించుకోవాలి. వలసదారులు రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే వీసాల కోసం ప్రయత్నం చేయాలి. లైసెన్స్ లేని ఏజెంట్లను వీసాల కోసం సంప్రదించవద్దు. జాగ్రత్తగా వ్యవహరిస్తే మోసపోకుండా ఉంటారు. వలస వెళ్లాలనుకునేవారికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అండగా ఉంటుంది. సాధారణ కేసుల నమోదుతో ప్రయోజనం లేదు వీసా మోసాలపై పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తే ప్రయోజనం లేదు. వలస వెళ్లే వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం వల్ల ఏజెంట్లు సులభంగా తప్పించుకుంటున్నారు. ఎమిగ్రేషన్ యాక్ట్ 1983తో పాటు ఐపీసీ 370 (మానవ అక్రమ రవాణా) కింద కేసులు పెట్టాలి. నకిలీ ఏజెంట్లు, మోసగించిన ఏజెంట్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. మోసాలను అరికట్టడానికి అవకాశం కలుగుతుంది. వీసా రాకెట్లో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న చైన్ మొత్తాన్ని కేసు పరిధిలోకి తీసుకురావాలి. వలస వెళ్లే కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం.. విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. అనేక మంది కార్మికులు ఎలాంటి శిక్షణ లేకుండానే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళుతున్నారు. అక్కడ పనిపై అవగాహన లేకపోవడంతో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఏజెంట్లు ఫలానా పని అని చెబితే ఆ పనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. శిక్షణ పొంది విదేశాలకు వెళ్తే ఎలాంటి నష్టమూ ఉండదు. కార్మికులు కచ్చితంగా తాము ఉపాధి పొందే రంగంలో శిక్షణ పొంది ఉండాలి. అవగాహన కల్పించాలి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న చాలామంది యువత అవగాహన లోపంతోనే మోసపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్కామ్పైనా అవగాహన లేకపోవడంతో ప్రైవేటు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. చదువుకున్న యువత కూడా ముందువెనకా ఆలోచించకుండా వెళ్లి బలవుతున్నారు. గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలా వెళ్తే బాగుంటుందనేది తెలుసుకోవాలి. -
అంతా అక్రమమే..!
సాక్షి, పెద్దపల్లికమాన్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించినా ఫలితాలు రావటం లేదు. ఆమ్యామ్యాలు లేనిదే పనులు చేయమనే ధోరణి పెద్దపల్లి రవాణాశాఖ కార్యాలయంలో కొద్దిమంది అధికారుల్లో కనబడుతోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, లైసెన్స్ తదితర సమస్యల పరిష్కారానికి వచ్చే సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా వచ్చే ప్రజలను కార్యాలయం చుట్టూ తప్పించుకుంటున్నారు. ఏజెంట్ల ద్వారా వస్తేనే పనులు చేస్తామని కోడ్‌రూపంలో సంకేతాలిస్తున్నారు. జిల్లాలోని ప్రజలు పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, ఎన్టీపీసీ, సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లో ఉండే ఆర్టీఏ ఏజెంట్లను సంప్రదించి పనులు చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు జరుగుతున్నా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రయివేటు ఏజెంట్లదే హవా.. ఆర్టీఏ కార్యాలయంతో సంబంధం లేని ఓ ప్రైవే టు వ్యక్తి రోజూ సాయ్రంతం వాహనాల పనులు చేయించే ఏజెంట్ల వద్ద నగదు తీసుకుని అధికారులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సమయంలో ఏ ఏజెంట్‌కు సంబంధించి ఆ ఏజెంట్ దరఖాస్తులపై కోడ్‌ను సూచించి దరఖాస్తుదారులను కార్యాలయంలోకి పంపిస్తున్నారు. కోడ్ ఉంటే ఎలాంటి సందేహం లేకుండా అధికారులు, కార్యాలయ సిబ్బంది పని పూర్తి చేస్తున్నారు. ఎక్కువ లోపాలు కలిగిన వాహనాలుంటే అందు కు ఎక్కువ నగదు ముట్టజెప్పాల్సిందే. జిల్లాలో టిప్పర్లు, బొగ్గు, ఇసుక లారీలు కాలం చెల్లిన వా హనాల యజమానులు, పెద్ద వ్యాపారుల వద్ద ఎలాంటి కేసు కాకుండా ఉండేందుకు నెలవారీ మామూళ్లు కూడా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.వసూళ్లు సైతం కానిస్టేబుళ్లు, హోంగార్డులే చేస్తున్నట్లు కార్యాలయానికి వెళ్లే పలువురు ఆరోపిస్తున్నారు. పాఠశాలల బస్సుల తనిఖీల్లో.. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల బస్సులకు ఏటా సామర్థ్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. పాఠశాలల ప్రారంభంలో అధికారులు తనిఖీలు చేస్తూ సామర్థ్య పరీక్షలు చేయించని బస్సులను గుర్తించి కేసులు నమోదు చేయాలి. ఇలా చేయకుండా పాఠశాలల యజమానులతో కుమ్మక్కయి వారి నుంచి డబ్బులు తీసుకుని సామర్థ్య పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇవ్వాల్సిన నగదు ఇస్తేనే చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. పట్టపగలే చుక్కలు.. పెద్దపల్లి రవాణా కార్యాలయానికి వచ్చే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు ఇక్కడి అధికారులు, సిబ్బంది, వాహనానికి సంబంధించిన ఏ పనికైనా ఎంతో కొంత ముట్టచెప్పాల్సిందే. నూతన రిజిస్ట్రేషన్‌కు వచ్చే ద్విచక్రవాహనాలకు ప్రయివేటు వ్యక్తులు పరిశీలించి, ఫాం నింపి.. ఎంతోకొంత తీసుకుంటున్నారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడి ఉన్నతాధికారులు సమయానికి రాకపోవడంతో ఉదయం కార్యాలయానికి వచ్చే సామాన్యులు సాయంత్రం వరకు తిండి, తిప్పలు లేకుండా వాహన పరీక్షల కోసం వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పారదర్శకంగా పనులు పెద్దపల్లి ఆర్టీఏ కా ర్యాలయంలో పనుల కోసం ప్రజలు ఏజెంట్లు లేకుండా నేరుగా రావొచ్చు. వారి సమస్యలు నేరుగా పరిష్కరిస్తున్నాం. ఏజెంట్ల ప్రభావం లేకుండా వారిని కార్యాలయంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా సేవలందించేలా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా డబ్బుల కోసం వేధి స్తే నేరుగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారిపై శాఖాపరమైన చర్య తీసుకుంటాం. – ఆఫ్రీన్ సిద్దిఖి, ఆర్టీవో పెద్దపల్లి -
రాజధానికి చేరిన ‘ఆర్టీఓ’ పంచాయితీ
సాక్షి, మెదక్: జిల్లా రవాణా శాఖకు సంబంధించిన బాగోతం రాష్ట్ర రాజధానికి చేరింది. నెలరోజు లుగా ఓ సంఘం నేత, ఏజెంట్ల మధ్య కొనసాగుతున్న వార్ హోంమంత్రితోపాటు డీజీపీ కార్యాలయం దృష్టికి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీఓ కార్యాలయంలో ఇటీవల వరకు ఏజెంట్ల విధానం కొనసాగిన విషయం తెలిసిందే. లైసె న్స్‌లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, పత్రాల మార్పిడి వంటి వివిధ పనుల నిమిత్తం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుంచి ఏజెంట్లు అనధికార వసూళ్లకు తెగబడ్డారు. అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు, సిబ్బందితో కుమ్మక్కై వాహనదారులను నిలువు దోపిడీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించి అవినీతి బాగోతంపై ఓ సంఘం నేత పలు ఆధారాలతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఏజెంట్లు, ఆ సంఘం నేత మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. సదరు సంఘం నేతను అంతమొందించేందుకు ఏజెంట్లు ప్లాన్ వేసినట్లు బయటకు పొక్కడం వేడిపుట్టించింది. ఇదే సమయంలో తమను డబ్బులు డిమాండ్ చేసినట్లు సదరు సంఘం నేతపై ఏజెంట్లు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనను, తనకుటుంబాన్ని అంతమొందించేందుకు ఏజెంట్లు ప్రయత్నించారని సంఘం నేత సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏజెంట్లపై సెక్షన్ 341, 506 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదయ్యాయి. సంఘం నేతపై సెక్షన్ 384 కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు సంఘం నేత మంగళవారం హైదరాబాద్‌లో హోంమంత్రి మహమూద్ అలీని కలిసి ఫిర్యాదు చేశాడు. డీజీపీ కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేశాడు. ఏజెంట్లు తప్పుడు ఆరోపణలు చేశారని.. ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. అయినా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. తనపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారని.. ఏజెంట్లపై పిటీ కేసు మాత్రమే నమోదు చేశారని అందులో వివరిం చారు. వెంటనే సమగ్ర విచారణ చేపట్టి నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. మెదక్ ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన లొల్లి హోంమంత్రి పేషీ, డీజీపీ కార్యాలయానికి చేరడంతో ఏం జరుగుతుందనే అంశం జిల్లాలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. -
ఏజెంట్ల మోసం... మారిషస్‌లో 35 మంది యువకులు
సిరిసిల్ల (కరీంనగర్) : మారిషస్‌లో ఉపాధి చూపిస్తామంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన 35 మంది యువకులను ఏజెంట్లు మోసం చేశారు. మారిషస్ నుంచి బాధితులు సోమవారం సాక్షికి ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కథనం ప్రకారం.. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన రమణారెడ్డి, రామన్నపేటకు చెందిన నాగిరెడ్డి మారిషస్‌లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి సిరిసిల్ల ప్రాంతంలోని 35 మంది యువకులను 15 రోజుల కిందట మారిషస్ పంపించారు. డ్రైవర్, భవన నిర్మాణం, తోటలో పనులంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. పనిలో చేరాక మరో రూ.1.30 లక్షల చొప్పున ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. హర్యానాకు చెందిన జైదుర్గా ట్రావెల్స్ ద్వారా వీరిని మారిషస్ పంపించారు. అయితే అక్కడికి వెళ్లాక వారికి కంపెనీలు ఉపాధి చూపలేదు. తమ వద్ద డబ్బులు లేకపోవడంతో తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని బాధితులు వాపోయారు. ఏజెంట్లకు ఫోన్ చేసి అడిగితే రెండు,మూడు రోజుల్లో పని చూపిస్తామని చెబుతున్నారని కోనరావుపేటకు చెందిన కస్తూరి దశరథరెడ్డి, వూరడి చిన్ననర్సయ్య, బొప్పాపూర్‌కు చెందిన లంబ మహేందర్, దుమాలకు చెందిన రామిండ్ల శ్రీనివాస్, నీరటి భూమరాజు, కొలనూరుకు చెందిన సుదమల్ల లక్ష్మీరాజం ఫోన్లో తెలిపారు. వీసా గడువు తీరితే పోలీసులు అరెస్టు చేసే ప్రమాదం ఉందని, సర్కారు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.