సాక్షి, ఛార్మినార్: ఆర్థిక ఇబ్బందులతో కొంత మంది అమాయక ముస్లిం మహిళలు ఏజెంట్ల చేతుల్లో మోసానికి గురవుతున్నారు. పాతబస్తీలోని మురికివాడలకు చెందిన కొంత మంది మహిళా ముస్లింలు జీవనోపాధి కోసం దుబాయ్ తదితర అరబ్బు దేశాలకు వెళ్లేందుకు ఏజెంట్ల వలలో చిక్కుకుని పడరాని పాట్లు పడుతున్నారు. అమాయక మహిళలకు ఏజెంట్లు వారికి మాయమాటలు చెప్పి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పంపుతున్నారు. అక్కడ వారు నరకయాతన పడుతున్నారు. తిరిగి తమ కుటుంబ సభ్యుల వద్దకు వస్తామంటూ వేడుకుంటున్నారు. చదవండి: మోజు తీరగానే ఫోన్‌లో తలాక్..
శాలిబండ, కిషన్‌బాగ్, బేగంపేట్‌లకు చెందిన 8 మంది బాధితుల కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ సహకారంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్‌కు రాతపూర్వకంగా వినతి పత్రం పంపించారు. ఎనిమిది మంది మహిళలను దుబాయ్‌కు పంపించిన ఏజెంట్ షఫీని టాస్‌్కఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఏం జరుగుతోందంటే...
► ఏజెంట్స్ ఇక్కడ చెప్పేదొకటి...అక్కడికి తీసుకెళ్లిన తర్వాత చేసేదొకటి.
► మంచి ఉద్యోగం..సరిపడా జీతం అని చెప్పే ఇక్కడి ఏజెంట్లు..అక్కడికి వెళ్లిన అనంతరం యుఏఈలోని కొన్ని రిక్రూట్‌మెంట్ సంస్థలకు అప్పజెబుతున్నారు.
► దీంతో అమాయక ముస్లింలు తమకు సంబంధం లేని పనులు చేయలేక ఇబ్బందులకు గురవుతున్నారు.
► మూడు నెలల విజిటింగ్ వీసాపై వీరిని దుబాయ్‌కు తరలిస్తున్న ఏజెంట్లు అనంతరం కనుమరుగవుతున్నారు.
► దుబాయ్‌లో రిక్రూట్ చేసుకుంటున్న ఏజెన్సీలు అక్కడి డబ్బున్న ఇళ్లల్లో పాచిపని చేయడానికి వీరిని అప్పజెబుతున్నారు.
► వీరిపై లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.
► ఇంటి యజమానులు వీరిపై కనికరం లేకుండా అడ్డమైన చాకిరీ చేయించుకుంటున్నారని బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు. వారు పెట్టే నరక యాతనను భరించ లేక తిరిగి నగరానికి రావడానికి సిద్ధపడుతున్నారు.
► ఈ విషయాన్ని సంబందిత ఏజెంట్లకు తెలియజేస్తే...లక్షల్లో డబ్బులు చెల్లించాలంటూ మొండికే స్తున్నారు.
అసలేం జరిగిందంటే..
► కిషన్‌బాగ్‌కు చెందిన యాస్మిన్ బేగం, అమ్రీన్ బేగం, శాలిబండకు చెందిన రహీమాబేగం, బేగంపేట్‌కు చెందిన కనీజ్ ఫాతిమా, నజియాబేగంలతో పాటు మెహెరున్సీసా బేగం, అస్మా బేగం, జరీనా బేగం అనే 8 మంది ముస్లిం మహిళలు షఫీ అనే ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లారు.
► పాతబస్తీ మిశ్రీగంజ్‌కు చెందిన షఫీ అనే ఏజెంట్ వీరికి డబ్బు ఆశ చూపి మాయమాటలు చెప్పి సెపె్టంబర్–అక్టోబర్ మాసాల్లో దుబయ్‌కు తీసుకెళ్లాడు.
► మూడు నెలల విజిటింగ్ వీసాపై తరలించిన షఫీ అక్కడి లేబర్ రిక్రూట్‌మెంట్ అల్ సఫీర్ అనే రిక్రూట్ సంస్థకు అప్పగించాడు.
► అక్కడి రిక్రూట్ సంస్థ వీరిని ఒక్కొక్కరిని రూ.2 లక్షలకు అరబ్ కుటుంబాలకు అప్పగించింది. అక్కడి నుంచి వీరి కష్టాలు మొదలయ్యాయి.
► రోజుకు 15 గంటలు పని చేయించుకునే వారు కొందరైతే..శారీక వేధింపులకు గురిచేసే వారు కొందరు.
► దీంతో విసిగి పోయిన బాధితురాళ్లు ఇక్కడి నగరంలోని తమ కుటుంబ సభ్యులకు వాట్స్ యాప్ కాల్స్ ద్వారా బోరుమన్నారు. అక్కడ తమ వారు పడుతున్న బాధలను భరించలేని ఇక్కడి వారి కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్ సహకారంతో కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసారు.
► సాధ్యమైనంత వెంటనే తమ వారిని భారత్‌కు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment