సిరిసిల్ల (కరీంనగర్) : మారిషస్‌లో ఉపాధి చూపిస్తామంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన 35 మంది యువకులను ఏజెంట్లు మోసం చేశారు. మారిషస్ నుంచి బాధితులు సోమవారం సాక్షికి ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కథనం ప్రకారం.. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన రమణారెడ్డి, రామన్నపేటకు చెందిన నాగిరెడ్డి మారిషస్‌లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి సిరిసిల్ల ప్రాంతంలోని 35 మంది యువకులను 15 రోజుల కిందట మారిషస్ పంపించారు. డ్రైవర్, భవన నిర్మాణం, తోటలో పనులంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. పనిలో చేరాక మరో రూ.1.30 లక్షల చొప్పున ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. హర్యానాకు చెందిన జైదుర్గా ట్రావెల్స్ ద్వారా వీరిని మారిషస్ పంపించారు.
అయితే అక్కడికి వెళ్లాక వారికి కంపెనీలు ఉపాధి చూపలేదు. తమ వద్ద డబ్బులు లేకపోవడంతో తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని బాధితులు వాపోయారు. ఏజెంట్లకు ఫోన్ చేసి అడిగితే రెండు,మూడు రోజుల్లో పని చూపిస్తామని చెబుతున్నారని కోనరావుపేటకు చెందిన కస్తూరి దశరథరెడ్డి, వూరడి చిన్ననర్సయ్య, బొప్పాపూర్‌కు చెందిన లంబ మహేందర్, దుమాలకు చెందిన రామిండ్ల శ్రీనివాస్, నీరటి భూమరాజు, కొలనూరుకు చెందిన సుదమల్ల లక్ష్మీరాజం ఫోన్‌లో తెలిపారు. వీసా గడువు తీరితే పోలీసులు అరెస్టు చేసే ప్రమాదం ఉందని, సర్కారు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.
ఏజెంట్ల మోసం... మారిషస్‌లో 35 మంది యువకులు
Published Mon, Jun 1 2015 8:07 PM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM
Advertisement