![Driving License New Rules: Get License Without Test At Rto Office - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/26/Untitled-21.jpg.webp?itok=ZAucIKqv)
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) వెళ్లి ఆర్టీఓ వద్ద డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇవేమి చేయకుండా లైసెన్స్ ఎలా వస్తుందని అనుకుంటున్నారా. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నుండి పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు అమలులోకి రాగా, ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని కొన్ని నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.
పరీక్ష లేకుండా లైసెన్స్
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు నుంచి శిక్షణను పూర్తి చేయాలి. ఆపై డ్రైవింగ్‌లో అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్‌లను సదరు శిక్షణా సంస్థ జారీ చేయనుంది. ఆపై వారు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, శిక్షణా కేంద్రం సర్టిఫికేట్ జారీ చేస్తుంది.
సర్టిఫికేట్ పొందిన తర్వాత, అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆపై ఆర్టీఓ వద్ద ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా ఈ శిక్షణ సర్టిఫికేట్ ఆధారంగా లైసెన్స్ పొందవచ్చు. వీటిని కేంద్ర లేదా రాష్ట్ర రవాణా శాఖలు ఈ శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తాయి. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్‌ను ప్రైవేటీకరించే అవకాశం ఉన్నందున డ్రైవర్ శిక్షణా కేంద్రాలను తెరవడంపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సరైన వెరిఫికేషన్లు, తనిఖీలు లేకుండానే ఇలాంటి కేంద్రాలు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తారనే భయం కూడా నెలకొంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు ఎంత వరకు సత్పలితాలను ఇస్తాయని తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.
చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్‌మెంట్ అక్కడ మొదలైంది!
Comments
Please login to add a commentAdd a comment