ఆపదలో ఆదుకునే లెసైన్స్
‘సమయం రాత్రి ఒంటి గంట అయ్యింది.. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు. హైవే సిబ్బంది వెంటనే దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు.. అయినా ఫలితం లేదు.. అప్పటికే ఆ వ్యక్తికి శరీరంలోని చాలా రక్తం పోయింది.. వెంటనే రక్తం ఎక్కించాలి... పోలీసులు డ్రైవింగ్ లెసైన్స్ తీసి చూశారు. అందులో బ్లడ్ గ్రూప్ నమోదు చేయించిలేదు. ఆ వ్యక్తి రక్తం ఏ గ్రూపో తెలుసుకోవడానికి 30 నిముషాల సమయం పట్టింది. అప్పటికే విలువైన సమయం ఖర్చుయింది.. కేవలం రక్తం అందక ఆ వ్యక్తి మృతిచెందాడు. లెసైన్స్లో బ్లడ్ గ్రూపు నమోదు చేయించకపోతే జరిగే నష్టానికి ఇదొక ఉదాహరణ మాత్రమే... ప్రతి రోజు మన కళ్లముందు ఇలాంటివి ఎన్నో...’
అరసవల్లి/నరసన్నపేట రూరల్ : ప్రస్తుత రోజుల్లో 18 సంవత్సరాలు దాటిన వారందరూ లెసైన్‌సలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిలో అభ్యర్థి పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, ఏ వాహనం అయితే నడపగలరో ఆ సమాచారం, లెసైన్స్ కాలపరిమి ఉంటుంది. ఇంత వరకు అందరికీ తెలుసు.. అయితే, లెసైన్స్‌లో తెలియని మరో ఆప్షన్ ఉంటుంది. అదే లెసైన్స్ హోల్డ్‌ర్(అభ్యర్థి) బ్లడ్(రక్తం) గ్రూప్‌ను తెలిపే ఆప్షన్. దీనిని నూటికి 99 శాతం మంది ఉపయోగించుకోవడం లేదని అధికారక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆప్షన్‌లో తమ రక్తం గ్రూప్‌ను లెసైన్స్ దారుడు నమోదు చేసుకునే అవకాశం ఉంది.
అత్యవసర సమయాల్లో వాహనం నడిపే వారు తప్పని సరిగా తమ లెసైన్స్‌ను తీసుకునుని వెళతారు. అనుకోని సంఘటలను ఎదురైనప్పుడు, లేదా ప్రమాదాలు జరిగినప్పుడు.. అసుపత్రిలో వైద్యులకు గాయపడిన వ్యక్తి రక్తం గ్రూపు కోసం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందించేందుకు వీలుంటుంది. ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడే విలువైన సమయం వారికి ఇచ్చేందుకు లెసై న్స్ ఉపయోగపడుతుంది. లారీ, బస్సు, ట్యాక్సీ, ఆటో ఇలా పలు రకాల వాణిజ్య, ప్రయాణికులను తీసుకుపోవు డ్రైవర్లకు ఇది అత్యవసర సమయాల్లో ఉపయోగ పడుతుంది.
సమూల మార్పులు
పాన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు.. ఇవి ఎంత ముఖ్యమైనవో డ్రైవిం గ్ లెసైన్స్‌కార్డు కూడా అంతే ముఖ్యమైనది. వాహనం నడిపినప్పుడే కాకుండా స్థానికతను కూడా తెలియజేస్తుంది. అందుకే లెసైన్‌స మంజూరును రవాణా శాఖ కఠినతరం చేసింది. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే అభ్యర్థి ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షకు అర్హుడుగా అనుమతిస్తున్నారు. లేని సమయంలో ముందుగానే అనర్హుడిగా వేటు వేసేస్తున్నారు. విద్యార్హత, స్థానికత, ఆధార్‌కార్డు ఉంటేనే లెసైన్స్ జారీ చేస్తున్నారు.
రెండు దశల్లో అభ్యర్థి వివరాల సేకరణ
మొదటి దశ ఎల్‌ఎల్‌ఆర్ ఇచ్చే సమయంలో అభ్యర్థి పూర్తి అడ్రస్, అభ్యర్థి పుట్టు మచ్చలు, సెల్‌ఫోన్ నంబర్ నమోదు చేస్తున్నారు. రెండోసారి డ్రైవింగ్ టెస్టుకు వచ్చే సమయంలో బ్లడ్ గ్రూప్, విద్యార్హత, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు తదితర వివరాలు నమోదు చేస్తున్నారు. ఇలా రెండు సార్లు వివరాలు సేకరించడం వల్ల తప్పులు ఉన్నా.. వివరాలు సరిగ్గా నమోదు కాకపోయినా.. అభ్యర్థులు సరిచూసుకునే వీలుంటుంది. అధికారులు కూడా అభ్యర్థి పత్రాలు కూడా ధ్రువీకరిస్తారు.
డ్రైవింగ్ లెసైన్‌స పొందడం ఇలా..
పాత రోజులు పోయాయి. ఇష్టాను సారంగా వాహనాలు నడుపుతామంటే కుదరదు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాల్సిందే. చేతులు కాలాక ఆకులు పట్టుకొనే కంటే ముందుగానే మేల్కొని ప్రతి వాహనదారు లెసైన్సు పొందడం ఎంతో అవసరం. లెసైన్సు లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం. డ్రైవింగ్ లెసైన్‌స ఎలా పొందాలో మీ కోసం....
ఎల్‌ఎల్‌ఆర్ పొందే విధానం...
మీ సేవ, రవాణా శాఖ కార్యాలయాల్లో వయసు, నివాస ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు-2తో పాటు ద్విచక్ర వాహనం నడిపేందుకు రూ.60లు, నాలుగు చక్రాల వాహనం నడిపేందుకు రూ.90లు చెల్లించి స్లాట్ బుక్ చేయాలి.
వయసు ధ్రువీకరణకు పదోతరగతి మార్కుల జాబితా, పాఠశాల బదిలీ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, జీవిత బీమాసంస్థ బాండ్, సివిల్ డాక్టర్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం... ఇందులో ఏ ఒక్కటి ఇచ్చినా సరిపోతుంది.
అ నివాస ధ్రువీకరణకు రేషన్ కార్డు, ఓటరు కార్డు, ఫోను బిల్లు, విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు తదితర వాటిల్లో ఏదో ఒకటి ఉండాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకు ఇచ్చే తేదీన మాత్రమే రవాణా కార్యాలయానికి వెళ్లాలి.
రవాణా కార్యాలయంలో ఫారం-1, ఫారం-2 దరఖాస్తులతో పాటు వయసు, నివాస ధ్రువీకరణ పత్రాలు, మీసేవలో నగదు రసీదు జిరాక్సు పత్రాలు జతచేయాలి.
రవాణా శాఖ కార్యాలయంలో ఫొటో తీసి వేలి ముద్రలను డిజిటల్ ద్వారా తీసుకుంటారు. అనంతరం లెర్నర్ లెసైన్సుకు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షకు కార్యాలయంలోనే హాజరుకావాల్సి ఉంటుంది.
ట్రాఫిక్ గుర్తులు, రహదారుల నిబంధనలపై ఆబ్జెక్టివ్ తరహాలో కంప్యూటర్ పరీక్ష ఉంటుంది. ఇందులో 20 ప్రశ్నలకు 12 ప్రశ్నలకు సమాధానాలు కరెక్టుగా చెప్పాలి. కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత లెర్నర్ లెసైన్సు మంజూరు చేస్తారు. ఒక వేల ఆన్‌లైన్ పరీక్షలో తప్పిన వారు మళ్లీ మీ సేవలో రూ. 30లు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లెర్నర్ లెసైన్సు 6 నెలలు వరకూ చెల్లుబాటులో ఉంటుంది.
శాశ్వత లెసైన్‌స కోసం..
అ లెర్నర్ లెసైన్‌స పొందిన నెల నుంచి ఆరు నెలల లోపు శాశ్వత లెసైన్‌స పొందాల్సి ఉంటుంది. మీ సేవకు గానీ, రవాణా కార్యాలయానికి గానీ వెళ్లి ద్విచక్ర వాహనానికి రూ.475, నాలుగు చక్రాల వాహనానికి రూ.525లు చెల్లించాలి.
అ మీ సేవలో ఇచ్చిన స్లాట్ ప్రకారం రవాణా వాఖ కార్యాలయానికి వెళ్లి ఫారం-1, ఫారం -4లు పూర్తి చేసి ఎల్‌ఎల్‌ఆర్, మీ సేవ రశీదు జతపర్చి మోటారు వాహనాల అధికారి నిర్వహించే వాహన పరీక్షకు హజరై ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పాసైతే శాశ్వత లెసైన్‌సను పోస్టల్ ద్వారా ఇంటి అడ్రస్‌కు పంపిస్తారు.
ఫొటో, ఎడమచేతి వేలి ముద్ర తప్పనిసరి
ఇప్పటి వరకు లెసైన్స్ కావాల్సిన అభ్యర్థి మొదటిగా ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షకు హాజయ్యేవాడు. ఆ సమయంలో రవాణ శాఖ కార్యాలయంలో ఫొటో విభాగంలో ఫొటోతో పాటు ఎడమ చేతి బొటనవేలిముద్ర సేకరించేవారు. తరువాత ఫొటో, వే లిముద్ర అవసరం ఉండేది కాదు. 30 రోజుల తరువాత ఏఎంవీఐ సమక్షంలో జరిగే వాహన టెస్ట్‌కు సమయంలో డమ్మీ అభ్యర్థులు హాజరవుతున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. వెంటనే ఎల్‌ఎల్‌ఆర్‌తో పాటు వాహన పరీక్షకు వెళ్లేసమయంలో ఫొటో, ఎడమ చేతి బొటనవేలిముద్ర తీసుకుంటున్నారు. మొదట ఎల్‌ఎల్‌ఆర్ తీసుకునే సమయంలో ఉన్న వ్యక్తి అవునాకాదా, వేలిముద్రలు సరిపోలితేనే వాహన పరీక్షలకు అర్హత కల్పిస్తున్నారు. దీంతో అభ్యర్థుల విషయంలో గందరగోళానికి, అక్రమాలకు చెక్ పడుతోందని అధికారులు భావిస్తున్నారు.
లెసైన్స్‌లో బ్లడ్ గ్రూప్ ఆప్షన్ ఉంది
రవాణాశాఖ ఇచ్చే లెసైన్స్‌లో అభ్యర్థి రక్తం గ్రూప్‌ను తెలిపే ఆప్షన్ ఉంది. లెసైన్స్‌దారుడు డీఎల్ తీసుకునే సమయంలో ల్యాబ్ నుంచి తీసుకువచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. లెసైన్స్‌లోని బ్లడ్ గ్రూప్ ఆప్షన్ వద్ద అభ్యర్థి గ్రూపు లెసైన్స్‌లో వస్తుంది. ఇది వాహనదారుడుకి చాలా ఉపయోగపడుతుంది. - ఎస్.వెంకటేశ్వరావు, రవాణాశాఖ ఉప కమిషనర్
అత్యవసర సమయంలో..
ప్రమాదం జరిగిన సమయంలో వ్యక్తికి లెసైన్స్‌లో బ్లడ్ గ్రూప్ ఉంటే చాలా ఉపయోగ పడుతుంది. ప్రాణాలు కాపాడుకునే ఆ కొద్ది సమయంలో వాహన దారుడి లెసైన్స్ పై బ్లడ్‌గ్రూప్ ఉంటే సమయం వృథాకాదు. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.
- డి. సంజీవరావు,
మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్
బ్లడ్ గ్రూపు ఎలా నమోదు చేసుకోవాలి..అభ్యర్థి ముందుగా ఎల్.ఎల్.ఆర్(లెర్నింగ్ లై సెన్స్) తీసుకున్న తరువాత, పర్మినెంట్ లెసైన్స్(డీఎల్) తీసుకునే సమయంలో బ్లడ్ గ్రూప్‌ను నమోదు చేసుకోవాలి. ఎల్‌ఎల్‌ఆర్, ఆధార్ కార్డు, వివిధ ధ్రువపత్రాలతో పాటు గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి అభ్యర్థి బ్లడ్ గ్రూప్ తెలిపే పత్రాన్ని కూడా జతచేయాలి. రవాణాశాఖ కార్యాలయంలో పేరు, అడ్రస్ వివరాలు నమోదు చేసే సమయంలో బ్లడ్ గ్రూప్ ఆప్షన్‌లో తన గ్రూపును అభ్యర్థి నమోదు చేసుకోవాలి.
డ్రైవింగ్‌లెసైన్స్‌లోని బ్లడ్ గ్రూప్ ఆప్షన్