
మథుర: అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. మరి అడగకుండానే.. అసలు దరఖాస్తు చేయకుండానే డ్రైవింగ్ లైసెన్స్ మంజూరుచేసేవాళ్లను ఏమంటారు? అదికూడా చనిపోయినవారికి!! ఉత్తరప్రదేశ్‌లో ఘనత వహించిన మథుర రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి కార్యాలయం చేసిన బిత్తిరిపని ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొన్నేళ్ల కిందట ఇదే మథుర ఆర్టీఏ.. పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ పేరు, ఫొటోతో డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
జైసింగ్‌పూర్‌లో నివసించిన ఛెత్రామ్ జాదన్ అనే వ్యక్తి 2017, జూన్9న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మొహల్లా మసాని ప్రాంతానికి చెందిన వీరేంద్ర అనే మరో వ్యక్తి 2017, నవంబర్26న లారీ ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, వీరిద్దరి పేర్లమీద మథుర అసిస్టెంట్ ఆర్టీఏ కార్యాలయం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు జారీ అయ్యాయి. స్థానికంగా కలకలం రేపిన ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా మథుర ఏఆర్టీఏను ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, ఆ ఏఆర్టీఏ మాత్రం తప్పందా క్లర్క్‌దేనని వాదిస్తున్నాడు. చివరికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment